Ricky Ponting:
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ షాకింగ్ న్యూస్ చెప్పాడు! మెక్ కలమ్ కన్నా ముందు తనకే ఇంగ్లాండ్ టెస్టు కోచ్ పదవిని ఆఫర్ చేశారని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ పురుషుల జట్టు క్రికెట్ డైరెక్టర్ రాబ్ కీ తనకు చాలాసార్లు కాల్ చేశాడని వివరించాడు. కుటుంబ కారణాలతోనే ఆ బాధ్యతలు తీసుకోలేదని స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ నేపథ్యంలో అతడీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఏడాది క్రితమే మెక్ కలమ్ ఇంగ్లాండ్ టెస్టు కోచింగ్ పదవిని స్వీకరించాడు. అంతకు ముందు ఇంగ్లిష్ జట్టు సుదీర్ఘ ఫార్మాట్లో ఘోర ఓటములను చవిచూసింది. పాకిస్థాన్‌లోనూ అవమానం మూటగట్టుకుంది. దాంతో ఈసీబీ ప్రక్షాళన చేపట్టింది. టెస్టులకు మెక్ కలమ్, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాథ్యూ మాట్‌ను కోచ్‌లుగా ఎంపిక చేసింది. జో రూట్ సైతం కెప్టెన్సీ వదిలేశాడు. బ్యాటింగ్ మెంటార్ గ్రాహమ్ థార్ప్, మేనేజింగ్ డైరెక్టర్ యాష్లే గైల్స్ తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. పురుషుల జట్టుకు రాబ్ కీ కొత్త డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు.
'ఇంగ్లాండ్ టెస్టు కోచింగ్ పదవిని బ్రెండన్ కన్నా ముందు నాకే ఆఫర్ చేశారు. రాబ్ కీ క్రికెట్ డైరెక్టర్ అవ్వగానే అతడి నుంచి నాకు కాల్స్ వచ్చాయి. కానీ నేను ఫుల్ టైమ్ ఇంటర్నేషనల్ కోచింగ్ బాధ్యతలకు సిద్ధంగా లేను. కుటుంబం కోసం కొన్ని వదిలేయక తప్పని పరిస్థితుల్లో ఉన్నాను. క్రికెటర్‌గా చాలాకాలం పర్యటనలు చేశాను. ఇప్పుడు నాకు చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వారికి ఎక్కువ కాలం దూరంగా ఉండలేను. బ్రెండన్‌నే చూడండి. అతడి కుటుంబం ఈ రోజే ఇక్కడికి వచ్చింది. పిల్లలు పాఠశాలకు వెళ్తున్నప్పుడు బయటకు వెళ్లడం నాకు ఇష్టం లేదు' అని రికీ పాంటింగ్ అన్నాడు.
టీమ్‌ఇండియా కోచ్‌గా పనిచేయాలని గతంలో బీసీసీఐ తనను సంప్రదించినట్టు రికీ పాంటింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇవే కారణాలతో తాను అందుకు అంగీకరించలేదని పేర్కొన్నాడు. రాహుల్ ద్రవిడ్ ఒప్పుకోవడం ఆశ్చర్యపరిచిందని తెలిపాడు. అతడికీ చిన్న పిల్లలే ఉన్నారని గుర్తు చేశాడు. కాగా బ్రెండన్ మెక్‌కలమ్, బెన్ స్టోక్స్ సరికొత్త అగ్రెషన్‌తో టెస్టు క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. 'బజ్ బాల్' థీమ్‌తో ఆడుతున్నారు. వీరిద్దరి నేతృత్వంలో ఇంగ్లాండ్ 13 టెస్టుల్లో 11 గెలిచింది. పైగా ఒక్క సిరీసు కూడా ఓడిపోలేదు. కాగా ప్రస్తుతం జరుగుతున్న యాషెస్‌లో ఆంగ్లేయులు మొదటి మ్యాచులో 2 వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బుధవారం నుంచి రెండో టెస్టు లార్డ్స్‌లో మొదలవుతుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Ashes Series 2023: ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్‌కు ఆస్ట్రేలియా షాకిచ్చింది. 280 పరుగుల లక్ష్యంతో ఐదో రోజు బరిలోకి దిగిన కంగారూలు.. ఆట ఆఖరుదాకా పోరాడి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (197 బంతుల్లో 65, 7 ఫోర్లు) నిలకడకు తోడు ఆఖర్లో సారథి పాట్ కమిన్స్ (73 బంతుల్లో 44, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), నాథన్ లియాన్ (28 బంతుల్లో16 నాటౌట్, 2 ఫోర్లు) ల పోరాటంతో మరో నాలుగు ఓవర్ల ఆట మిగిలుండగానే కంగారూలు చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు. విజయానికి 53 పరగుల దూరంలో ప్రధాన బ్యాటర్లందరూ నిష్క్రమించినా కమిన్స్, లియాన్‌లు ఓ చిన్నపాటి యుద్ధమే చేసి తమ జట్టుకు విజయాన్ని అందించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంతో నిలిచింది.