Sanjay Dutt: 90వ దశకంలో  ‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ’ అంటూ దేశాన్ని ఊపేసిన  బాలీవుడ్ వెటరన్ నటుడు సంజయ్ దత్ అదే పాటకు  కాస్త క్రికెట్ టచ్ ఇచ్చాడు. ‘నాయక్ నహీ..  ఫ్రాంచైజ్ ఓనర్ మై హూ’ అంటూ  క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. జింబాబ్వే వేదికగా  వచ్చే  నెల నుంచి   జరుగబోయే  జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ (Zim Afro T10 League)‌లో సంజయ్ దత్  ఓ ఫ్రాంచైజీని దక్కించుకున్నాడు.  ఈ లీగ్‌లో మన మున్నాభాయ్.. హరారే హరికేన్స్ టీమ్‌ను కొనుగోలు చేశాడు.  


ఐదు టీమ్స్‌తో  జులై  20 నుంచి అదే నెల 29 వరకూ  జింబాబ్వే వేదికగా ఈ టీ10 లీగ్ జరుగనుంది. ఐదు టీమ్స్ పేర్లను  హరారే హరికేన్స్, డర్బన్ క్వాలందర్స్, కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ, బులవాయో బ్రేవ్స్, జోబర్గ్ లయన్స్‌గా  నామకరణం  కూడా చేశారు.  


ఇక సంజయ్ దత్ టీమ్  హరారే  హరికేన్స్ విషయానికొస్తే.. ఆయనతో పాటు  ప్రముఖ వ్యాపార  సంస్థ   ఏరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తో కలిసి ఆయన హరారే టీమ్ లో పెట్టుబడులు పెట్టారు. ఏరీస్  సంస్థ  సినిమా,  సాఫ్ట్‌వేర్, తదితర రంగాలలో  వ్యాపార  కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. ఈ సంస్థ ఛైర్మన్  సోహన్ రాయ్‌తో కలిసి  సంజయ్ దత్ తన క్రికెట్ జర్నీని ఆరంభించబోతున్నాడు.  గతంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగినప్పుడు పలు సందర్భాలలో స్టేడియానికి వచ్చి  అభిమానులను ఉర్రూతలూగించిన మున్నాభాయ్.. త్వరలో  లీగ్ మొత్తం   క్రికెట్ మ్యాచ్‌లతో బిజీబిజీగా గడుపనున్నాడు.   


 






జింబాబ్వేకు ఘన చరిత్ర : సంజయ్ దత్ 


జిమ్ ఆఫ్రో టీ10 లో   జట్టును దక్కించుకోవడంపై  సంజయ్ దత్ మాట్లాడుతూ.. ‘భారత్‌లో  క్రికెట్ ఓ మతం వంటిది.  ఈ ఆటను ఆడే అతి పెద్ద దేశాలలో భారత్ కూడా ఒకటి.  ఆటను ప్రపంచంలోని ప్రతి మూలకు తీసుకెళ్లడం నా కర్తవ్యంగా నేను భావిస్తున్నా. క్రికెట్‌లో జింబాబ్వేకు కూడా ఘన చరిత్రే ఉంది. త్వరలో జరుగబోయే జిమ్ అఫ్రో టీ10 లీగ్ లో హరారే హరికేన్స్  బాగా రాణిస్తుందని నేను ఆశిస్తున్నా..’అని  చెప్పాడు.  


అది మా అదృష్టం : మకోని


‘వినోద రంగంగా ఉన్న  సినిమాకు సంబంధించిన  ప్రముఖులు  జిమ్ ఆఫ్రో లో పెట్టుబుడులు  పెట్టడం  చాలా ఆనందాన్ని ఇస్తోంది.  తద్వారా ఈ టోర్నీకి మంచి ఆదరణ లభిస్తుందన్న నమ్మకం మాకుంది. ఇక హరారే హరికేన్స్  ఈ టోర్నీలో రాణించడమే మిగిలుంది’ అని జింబాబ్వే  క్రికెట్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ గివ్‌మోర్ మకోని తెలిపారు. 


2న వేలం.. 


ఈ లీగ్‌లో  ఆటగాళ్ల వేలం  జులై 2న జరుగనుందని జింబాబ్వే క్రికెట్ వర్గాలు తెలిపాయి.  పది రోజుల పాటు ఆఫ్రికా ఖండ అభిమానులను ఈ లీగ్ ఉర్రూతలూగించనుంది.  జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ లో డర్బన్ డర్బన్ క్వాలందర్స్ టీమ్.. పాకిస్తాన్  సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లోని లాహోర్ క్వాలందర్స్  టీమే కావడం గమనార్హం.