2027 Odi World Cup: భార‌త వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ వ‌న్డే భ‌విత‌వ్యంపై ఆస్ట్రేలియా మాజీ సార‌థి రికీ పాంటింగ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. రోహిత్ లో మ‌రికొంత‌కాలం  వన్డే క్రికెట్ ఆడే స‌త్తా ఉందని, వ‌చ్చే 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు త‌ను ఆడ‌తాడ‌ని ధీమా వ్య‌క్తం చేశాడు. సార‌థిగా అద్భుతాలు సృష్టిస్తున్న రోహిత్.. ఇటీవ‌లే పాకిస్థాన్ ఆతిథ్య‌మిచ్చిన ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీని భార‌త్ నెగ్గ‌డంలో త‌ను కీల‌కపాత్ర పోషించాడు. అటు కెప్టెన్ గా, ఇటు ప్లేయ‌ర్ గా రాణించాడు. న్యూజిలాండ్ తో జ‌రిగిన ఫైన‌ల్లో ఏకంగా ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకుని, ఐసీసీ ఫైన‌ల్లో ఈ ఘ‌న‌త సాధించిన రెండో భార‌త కెప్టెన్ గా నిలిచాడు. ఇక మ్యాచ్ అనంత‌రం త‌ను వ‌న్డేల నుంచి ఇప్ప‌ట్లో రిటైర్ కాబోన‌ని రోహిత్ చెప్పేశాడు. దీంతో అత‌ని రిటైర్మెంట్ ఊహాగానాల‌కు చెక్ ప‌డింది. ఇక‌, రోహిత్ ఆలోచ‌న‌ను పాంటింగ్ కూడా స‌మ‌ర్థించాడు. రోహిత్ మ‌న‌సులో సుదీర్ఘ‌మైన టార్గెట్ పెట్టుకుని ఈ మాట‌లు అన్నాడ‌ని విశ్లేషించాడు. 

ఆ ఒక్క‌లోటు తీర్చుకోవాల‌ని..కెప్టెన్ గా వ‌న్డే ప్ర‌పంచ‌ప్, టీ20 ప్ర‌పంచ‌క‌ప్ , ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీని సాధించిన ధోనీ చ‌రిత్ర‌లో నిలిచిపోయాడు. త‌న‌లా మ‌రే కెప్టెన్ ఈ ఘ‌న‌త సాధించ‌లేదు. అయితే రోహిత్ మాత్రం గ‌తేడాది టీ20 ప్ర‌పంచ‌క‌ప్, ఈ ఏడాది చాంపియ‌న్స్ ట్రోఫీ సాధించాడు. ఇక రెండేళ్ల కింద‌ట వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ను గెలిచేందుకు ఆఖ‌రి మెట్టు వ‌ర‌కు వ‌చ్చిన టీమిండియా.. చివ‌ర‌కు ఫైన‌ల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ కూడా సాధించి, ఆ ఒక్క లోటు కూడా తీర్చుకోవాల‌ని రోహిత్ భావిస్తున్న‌ట్లు పాంటింగ్ విశ్లేషించాడు. చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్లో రోహిత్ ఆట‌తీరును గ‌మ‌నించిన‌ట్ల‌యితే, త‌న‌లో ఇంకా చాలాకాలం క్రికెట్ ఆడే స‌త్తా ఉంద‌ని పేర్కొన్నాడు. తను ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సాధించిన విషయాన్ని గుర్తు చేశాడు. 

2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్..గ‌తేడాది టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్.. ప్ర‌స్తుతం వ‌న్డేలు, టెస్టులు మాత్ర‌మే ఆడుతున్నాడు. ఈ నేప‌థ్యంలో వ‌న్డేల్లో ఇంకో రెండేళ్లు ఆడితే, మెగాటోర్నీలో బ‌రిలోకి దిగ‌వ‌చ్చ‌ని పాంటింగ్ పేర్కొన్నాడు. ద‌క్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలతో క‌లిసి ఆతిథ్య‌మిస్తున్న ఈ టోర్నీలో గెలిచి, మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచిన ధోనీ స‌ర‌స‌న నిల‌వాల‌ని రోహిత్ భావిస్తున్నాడు. 2021లో 34 ఏళ్ల వ‌య‌సులో కెప్టెన్సీ ప‌గ్గాలు చేప‌ట్టిన రోహిత్.. జ‌ట్టుకు దాదాపు 11 ఏళ్ల త‌ర్వాత టీ20 ప్ర‌పంచ‌క‌ప్ రూపంలో ఐసీసీ టైటిల్ అందించాడు. తొమ్మిది నెల‌లు తిర‌గ‌కుండానే ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ రూపంలో మ‌రో టైటిల్ అందించాడు. ఇక ఇప్పటివరకు భారత్ ఖాతాలో 7 ఐసీసీ టైటిల్స్ ఉన్నాయి. 1983 వన్డే ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2002 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2025 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలతోపాటు 20007 టీ20 ప్రపంచకప్, 2024 టీ20 ప్రపంచకప్ లను తన ఖాతాలో వేసుకుంది. పురుషుల క్రికెట్లో ఆస్ట్రేలియా తర్వాత అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది.