వరుస ఓటములతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన పాకిస్థాన్‌ జట్టు(Pakistan Cricket team)కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గత 76 రోజులుగా ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేక చతికిల పడ్డ దాయాది జట్టులో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. వన్డే వరల్డ్‌కప్‌లో ఓటమితో పాక్‌ కెప్టెన్సీ పదవికి బాబార్‌ ఆజమ్‌ రాజీనామా చేసినప్పుడు మొదలైన ఈ రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. పాక్‌లో విజయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వేళ.. ఇప్పటికే నలుగురు కీలక సిబ్బంది రాజీనామా చేయగా తాజాగా ప్రముఖ పాక్‌ క్రికెటర్‌ దేశాన్ని విడిచి వెళ్లనున్నాడంటూ వార్తలు వస్తుండడం కలకలం రేపుతోంది.


దేశం వీడుతాడా..?
పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్ అహ్మద్(Sarfaraz Ahmed)...దేశాన్ని విడిచి వెళ్లాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌(UK)కు తన మకాం మార్చాలని సర్ఫరాజ్ అహ్మద్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టెస్టుల్లో పాక్‌ వికెట్‌ కీపర్‌గా కొనసాగుతున్న సర్ఫరాజ్‌ అహ్మద్‌కు.. మహ్మద్‌ రిజ్వాన్‌తో పాటు యువ వికెట్‌ కీపర్ల నుంచి తీవ్ర పోటీ ఎదురువుతోంది. దీంతో అతడిని సెలక్టర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక వేళ సెలక్టర్లు ఎంపిక చేసినా.. తుది జట్టులో చోటు ఉండడం లేదు. తన క్రికెట్‌ భవిష్యత్తు సందిగ్ధంలో పడడంతో పాకిస్తాన్‌ను విడిచిపెట్టి లండన్‌ వెళ్లాలని సర్ఫరాజ్‌ అహ్మద్‌ నిర్ణయించుకున్నట్లు పాక్‌ మీడియా కోడై కూస్తోంది. లండన్‌లో ఉంటూ కౌంటీలు, ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఆడాలని సర్ఫరాజ్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పాక్‌ను వీడి లండన్‌ వెళ్లినా పాకిస్తాన్‌లో జరగనున్ పీఎస్‌ఎల్‌ లో మాత్రం ఆడతానని సర్ఫరాజ్‌ చెప్పినట్లు తెలుస్తోంది.


ఇంతటీ ఏమైదంటే..?
 సర్ఫరాజ్‌ ఇటీవలే పాకిస్తాన్‌ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టులలో ఆడాడు. వైట్‌ బాల్‌ క్రికెట్‌లో పాకిస్తాన్‌ తరఫున 2021లో ఆడాడు. 2019 వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత ఫామ్‌ లేమితో పాటు మహ్మద్‌ రిజ్వాన్‌ మూడు ఫార్మాట్లలో వికెట్‌ కీపర్‌గా కొనసాగుతుండటంతో సెలక్టర్లు సర్ఫరాజ్‌ అహ్మద్‌ను పట్టించుకోలేదు. కానీ గతేడాది అతడు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడిని పట్టించుకోకపోయినా సర్ఫరాజ్‌.. టెస్టు క్రికెట్‌లో మాత్రం అడపాదడపా అవకాశాలు అందుకుంటున్నాడు. కానీ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో పాక్‌ జట్టు అతడిని బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌గా వాడుకుంది. దేశం విడిచి వెళ్లడంపైసర్ఫరాజ్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.


ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టుకు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్న అహ్మద్‌.. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు సర్ఫరాజ్‌ తన కెరీర్‌లో ఇప్పటివరకు 54 టెస్టులు, 117 వన్డేలు, 61 టీ20ల్లో పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో 6 సెంచరీలు, 35 హాఫ్‌ సెంచరీల సాయంతో 6,164 పరుగులు చేశాడు. కాగా 2017లో అతడి సారథ్యంలోనే ఛాంపియన్స్‌ ట్రోఫీని పాకిస్తాన్‌ సొంతం చేసుకుంది.