T20 World Cup Batting Most Sixes in Career: టీ20ల్లో హిట్టర్లు ఎక్కువగా ఇష్టపడే షాట్ సిక్సే. ఏ దిశగా బాదామన్నది కాదు సిక్స్ వెళ్లిందా లేదా అనే ముఖ్యమని రెచ్చిపోతారు బ్యాటర్లు. పొట్టి ప్రపంచకప్‌లో అన్ని సీజన్లు కలిపి అలా మోతమోగించిన సిక్సర్ల వీరుల జాబితా చాలా పెద్దదే ఉంది. అందులో మొదటి వాడు వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్(Chris Gayle). గేల్ ఇప్పటివరకూ టీ20 ప్రపంచకప్(T20 World Cup) అన్ని సీజన్‌లలో కలిపి 63 సిక్సర్లు కొట్టాడు. 2007 నుంచి 2021 వరకూ 33 మ్యాచ్‌లు ఆడిన గేల్ 31 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. గేల్ మైదానంలో సునామీలా విరుచుకుపడతాడు. అందుకే అతడి సిక్సర్ల రికార్డు దరిదాపుల్లో ఇంకో బ్యాట్స్‌మెన్ ఎవరూ లేరు.
అత్యధిక సిక్సర్ల మొనగాడు రోహిత్
సిక్స్ లతో అదరగొట్టే ఆటగాళ్ళ జాబితాలో రెండో స్థానం ఇంకెవరు హిట్ మ్యాన్ రోహిత్ శర్మదే(Rohit Sharma). అభిమానులు కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయేలా కళాత్మంగా బంతిని స్టాండ్స్‌లోకి పంపడంలో రోహిత్ స్టైలే వేరు. 2007 నుంచి 2022 వరకూ 39 మ్యాచ్‌లు ఆడిన హిట్ మ్యాన్ 36 ఇన్నింగ్స్‌ల్లో 35 సిక్స్‌లు కొట్టి రికార్డు నెలకొల్పాడు. రోహిత్ తర్వాత స్థానం ఇంగ్లండ్ బ్యాటర్ జోస్ బట్లర్(Jos Buttler)ది. 2012 నుంచి 2022 వరకూ 27 మ్యాచ్‌లు ఆడిన బట్లర్… 33 సిక్స్‌లు బాదాడు. ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు మన సింగ్ ఇస్ కింగ్ యువరాజ్ సింగ్ (Yuvaraj Singh)ఉన్నాడు. 2007 నుంచి 2016 వరకూ 31 మ్యాచ్‌లు ఆడిన యువరాజ్ 28 ఇన్నింగ్స్‌లలో 33 సిక్స్‌లు కొట్టాడు. 2007 నుంచి 2016 వరకూ టీ20 ప్రపంచకప్‌లో 24 మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వాట్సన్(SR Watson) 22 ఇన్నింగ్స్‌లలో 31 సిక్సర్లతో రికార్డు సాధించాడు.
ఆస్ట్రేలియాకే చెందిన డేవిడ్ వార్నర్(David Warner) కూడా 31 సిక్సర్లు కొట్టి జాబితాలో చోటు సంపాదించాడు. 2009 నుంచి 2022 వరకూ 34 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ ఈ రికార్డు అందుకున్నాడు. తర్వాతి స్థానం దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్‌దే. 2007 నుంచి 2016 వరకూ 30 మ్యాచ్‌లు ఆడిన డివిలియర్స్ 29 ఇన్నింగ్స్‌లలో 30 సిక్సర్లు బాదాడు. విరాట్ కోహ్లీ కూడా టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్లు కొట్టిన వీరుల్లో చోటు సంపాదించాడు. 2012 నుంచి 2022 వరకూ 27 మ్యాచ్‌ల్లో పాల్గొన్న కోహ్లీ 25 ఇన్నింగ్స్‌లో 28 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితా తర్వాతి స్థానంలో విండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో ఉన్నాడు. 2007 నుంచి 2021 వరకూ 34 మ్యాచ్‌లు ఆడిన బ్రావో 30 ఇన్నింగ్స్‌లో 25 సిక్సర్లు కొట్టాడు. శ్రీలంక క్రికెటర్ మహేళ జయవర్దనే 2007 నుంచి 2014 వరకూ 31 మ్యాచ్‌లు ఆడి 25 సిక్సర్లు బాదాడు.