DC In WPL 2025 Final: ఊహించిన ఫలితమే వచ్చింది. డబ్ల్యూపీఎల్ లీగ్ దశలో రెండుసార్లు ఫైనలిస్టు ఢిల్లీ క్యాపిటల్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. వరుసగా మూడో సీజన్ లోనూ నేరుగా టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో 11 పరుగులతో ముంబై ఇండియన్స్ ఓడిపోవడంతో ఢిల్లీ నేరుగా ఫైనల్లోకి ప్రవేశించింది. తాజా పరాజయంతో ఎలిమినేటర్ స్థాయికి ముంబై ఇండియన్స్ పడిపోయింది.
గురువారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ తో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు శనివారం జరిగే టోర్నీ ఫైనల్లో ఢిల్లీతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ రెండు మ్యాచ్ లు ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతాయి. ఇక తాజాగా జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 199 పరుగుల భారీ స్కోరు సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన ఆర్సీబీ బ్యాటర్లు.. బ్యాటింగ్ కు స్వర్గధామమైన ఈ పిచ్ పై పరుగుల పండుగ చేసుకున్నారు. ముఖ్యంగా కెప్టెన్ స్మృతి మంధాన ఫ్యాబ్యులస్ ఫిఫ్టీ (37 బంతుల్లో 53, 6 ఫోర్లు, 3 సిక్సర్లు)తో టచ్ లోకి వచ్చి, ఫామ్ చాటుకుంది. బౌలర్లలో హీలీ మథ్యూస్ కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో ముంబై.. 20 ఓవర్లు ఆడి, కేవలం 9 వికెట్లకు 188 పరుగులకు పరిమితమైంది. వన్ డౌన్ బ్యాటర్ నాట్ స్కివర్ బ్రంట్ మెరుపు ఫిఫ్టీ (35 బంతుల్లో 69, 9 ఫోర్లు, 2 సిక్సర్లు)తో సత్తా చాటింది. బౌలర్లలో స్నేహ్ రాణా మూడు వికెట్లతో రాణించింది.
కసిగా ఆడిన ఆర్సీబీ..
ఈ మ్యాచ్ కు ముందే నాకౌట్ రేసు నుంచి తప్పుకున్న ఆర్సీబీ.. చివరి లీగ్ మ్యాచ్ లో ఫ్రీగా ఆడింది. ముఖ్యంగా ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న స్మృతి తన బ్యాట్ కు పదును పెట్టింది. ఆరంభం నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. మరో ఓపెనర్ సబ్బినేని మేఘన (13 బంతుల్లో 26, 4 ఫోర్లు, 1 సిక్సర్) తగ్గేదేలే అంటూ దూకుడుగా ఆడింది. వీరిద్దరూ 22 బంతుల్లోనే 41 పరుగులు జోడించి తుఫాన్ ఆరంభాన్నిచ్చారు. ఆ తర్వాత ఎలీస్ పెర్రీ (49 నాటౌట్) కూడా కుదురుగా ఆడటంతో ఆర్సీబీ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. స్మృతి, పెర్రీ జోడీ మెరుగ్గా స్ట్రైక్ రొటేట్ చేస్తూ, చకచకా పరుగులు సాధించారు. ఈక్రమంలో 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న స్మృతి.. ఆ తర్వాత ఔటయ్యింది. ఆ తర్వాత వచ్చిన రిచా ఘోష్ (36), జార్జియా వారెహమ్ (31) కూడా దూకుడుగా ఆడటంతో ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది. మిగతా బౌలర్లలో అమెలియా కెర్ కు ఒక వికెట్ దక్కింది.
టాపార్డర్ విఫలం..
200 పరుగుల ఛేజింగ్ చేస్తే, నేరుగా ఫైనల్లోకి వెళతామని సమీకరణం ముందున్న వేళ, ముంబైకి ఓపెనర్లు శుభారంభాన్నివ్వ లేకపోయారు. హీలీ (19), అమెలియా (9) త్వరగా పెవిలియన్ కు చేరారు. ఈ దశలో బ్రంట్ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగి, ఒత్తిడిని పెంచింది. అయితే మరో ఎండ్ లో తనకు సహకారం అందించే వారు కరువయ్యారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ (20)తోపాటు మిడిలార్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. చివర్లో సజీవన్ సాజన (23 నాటౌట్) రెండు సిక్సర్లతో ఆశలు రేపినా, ఆమె ఔటవడంతో ముంబై ఆశలు ఆవిరయ్యాయి. మిగతా బౌలర్లలో కిమ్ గార్త్, పెర్రీలకు రెండు, హీథర్ గ్రాహమ్, జార్జియ వారెహమ్ లకు చెరో వికెట్ లభించింది. స్నేహ్ రాణాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.