Ambati Rayudu: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. వృత్తిపరమైన క్రీడను ఆడుతున్నందున రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ఎక్స్‌లో ఆదివారం ట్వీట్ చేశాడు. త్వరలో దుబాయ్(Dubai)లో జరుగనున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్(Indetnational T20 )లో ఆడనున్నట్లు అంబటి రాయుడు ప్రకటించాడు. ఇంటర్నేషనల్ లీగ్‌లో రాయుడు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో జతకట్టనున్నాడు. రాయుడు గతంలో ఐపీఎల్‌లోనూ ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ జనవరి 20 నుంచి ప్రారంభం కానుంది.
ట్వీట్ ఇదే...
వైఎస్సార్సీపీ నుంచి తప్పుకొంటున్నట్టు ట్వీట్ చేసిన తర్వాత రాయుడు ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించాడు. త్వరలో దుబాయ్ వేదికగా జరగాల్సి ఉన్న ఇంటర్నేషనల్ లీగ్ టీ2లో ముంబై తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నానని ఆ ట్వీట్‌లో తెలిపాడు. ప్రొఫెషనల్ ఆటలో ఆడేందుకు తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్ లో వెల్లడించాడు. దుబాయ్ వేదికగా ఈ నెల 19 నుంచి ఐఎల్ టీ20 మొదలుకానుంది. ఫిబ్రవరి 17 వరకూ ఈ టోర్నీ జరుగుతుంది.
అలా చేరాడు.. ఇలా వీడాడు..
డిసెంబర్ 28న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అంబటి రాయుడు ఈ నెల 6న (శనివారం) తాను పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. వైసీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నా. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నా. త్వరలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా' అంటూ ట్వీట్ చేయడంతో అంతా షాకయ్యారు. వైసీపీ శ్రేణులు, అభిమానులు ఏమైందీ.? అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు. గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తామన్న హామీతోనే అంబటి రాయుడు వైసీపీలో చేరారని.. అయితే అది కేటాయించకపోవడంతోనే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారని వార్తలు హల్చల్ చేశాయి. ఆయనకు మచిలీపట్నం టికెట్ ఆఫర్ చేయగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, టీడీపీ సైతం అంబటి రాజీనామాపై స్పందించింది. 'జగన్ వంటి దుర్మార్గుడితో కలిసి మీరు మీ రాజకీయ ఇన్నింగ్స్ ఆడనందుకు సంతోషంగా ఉంది. మీ భవిష్యత్ ప్రయత్నాల్లో మీకు అంతా మంచే జరగాలని దేవుడిని కోరుకుంటున్నాం' అని ట్వీట్ చేస్తూ అంబటి రాయుడు ట్వీట్ ను ట్యాగ్ చేసింది. అధినేత చంద్రబాబు సైతం ఆదివారం తిరువూరు సభలో మాట్లాడుతూ.. అంబటి రాయుడు అంశంపై స్పందించారు. గుంటూరు ఎంపీ టికెట్ పేరుతో మాజీ క్రికెటర్ అంబటి రాయుడును మోసగించారని, ఆ టికెట్ మరొకరికి ఇవ్వడంతో ఆయన వైసీపీ నుంచి బయటకు వెళ్తున్నట్లు ప్రకటించారని అన్నారు.
రఘురామ కౌంటర్
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jaganmohan Reddy) గురించి తెలుసుకునేందుకు తనకు ఆరు నెలలు సమయం పట్టిందని.... కానీ అంబటి రాయుడు ఆరు రోజుల్లోనే తెలుసుకున్నాడని అన్నారు ఎంపీ రాఘురామకృష్ణరాజు(Raghuramakrishna Raju). జగన్ వ్యక్తిత్వాన్ని ఇంత తొందరగా గ్రహించాడని.... వైఎస్‌ఆర్‌సీపీలో చేరి ఎంత తప్పుచేసాడో తెలుసుకున్నాడని అన్నారు. అందుకే... ఇలా చేరి.. అలా బటయకు వచ్చాడని ఎద్దేవా చేశారు రఘురామ. వైఎస్‌ఆర్‌సీపీ మునిగిపోయే నావ లాంటిదని అంబటి రాయుడు తొందరగానే గుర్తించారన్నారు. అందుకే చేరిన వారం రోజుల్లోనే ఆ పార్టీని వీడారని చెప్పారు. చెడు గురించి ఇంత తొందరగా తెలుసుకున్న అంబటి రాయుడిని తాను అభినందిస్తున్నట్లు చెప్పారు.