Ravichandran Ashwin breaks Anil Kumbles all time record in India: టీమిండియా స్పిన్‌ మాంత్రికుడు, క్రికెట్‌ జీనియస్‌ రవిచంద్రన్ అశ్విన్( Ravichandran Ashwin) మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు. రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో అయిదు వికెట్లు తీసిన అశ్విన్.. సుదీర్ఘ ఫార్మాట్‌లో స్వదేశంలో 351 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో 350 వికెట్లతో తనకంటే ముందున్న అనిల్ కుంబ్లేను అశ్విన్ అధిగమించాడు. అశ్విన్, కుంబ్లే మినహా టెస్టుల్లో మరే ఇతర భారతీయ బౌలర్ స్వదేశంలో 300 వికెట్లు పడగొట్టలేదు. 265 వికెట్లతో హర్భజన్ సింగ్ మూడో స్థానంలో... 219 వికెట్లతో కపిల్‌ నాలుగో స్థానంలో.. 210 వికెట్లతో రవీంద్ర జడేజా అయిదో స్థానంలో ఉన్నారు. అంతర్జాతీయంగా చూస్తే శ్రీలంక మాజీ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తన స్వదేశంలో ఏకంగా 493 వికెట్లు తీయగా.. ఇంగ్లాండ్‌ పేసర్‌ అండర్సన్ స్వదేశంలో 434 వికెట్లు తీశాడు. మరో ఇంగ్లండ్ స్టార్ స్టువర్ట్ బ్రాడ్ స్వదేశంలో 398 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

 

అశ్విన్‌ రికార్డులే రికార్డులు

రాజ్‌కోట్‌ వేదికగా భారత్‌(India), ఇంగ్లాండ్‌(England) మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌, క్రికెట్‌ జీనియస్‌, స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin) అరుదైన రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో ఐదు వందల వికెట్లు తీసిన బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. 98 టెస్టుల్లోనే అశ్విన్‌ 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. తక్కువ మ్యాచుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ప్రపంచ క్రికెట్లో అతికొద్ది మందికి మాత్రమే సాధ్యమైన ఈ ఘనతను ఈ చెన్నై స్పిన్‌ మాంత్రికుడు అందుకున్నాడు. అశ్విన్‌ కంటే ముందు 147 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో కేవలం 8 మంది మాత్రమే టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయి చేరుకున్నారు. 2011లో టెస్టు అరంగేట్రం చేసిన అశ్విన్‌.. అనిల్‌ కుంబ్లే, హర్భజన్‌ల తర్వాత ఆస్థాయి స్పిన్నర్‌గా ఖ్యాతి తెచ్చుకున్నాడు. ఈ 500 వికెట్ల ఘనతను అశ్విన్‌ ప్రత్యేకమైన వ్యక్తికి అంకితం ఇచ్చాడు. 

ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌.. అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో బెయిర్‌ స్టోను అవుట్‌ చేసి అశ్విన్‌ ఈ ఘనత సాధించాడు. 23 మ్యాచుల్లోనే ఈ స్టార్‌ స్పిన్నర్‌ వంద వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య టెస్టుల్లో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కూడా అశ్విన్‌ నిలిచాడు. అశ్విన్ కంటే ముందు జేమ్స్‌ అండర్సన్‌ భారత జట్టుపై 139 వికెట్లు తీసి టాప్‌లో ఉన్నాడు.

 

మరో రికార్డు కూడా...

టెస్టుల్లో ఒక దేశంపై వేయికుపైగా పరుగులు 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గానూ అశ్విన్‌ మరో రికార్డ్‌ సాధించాడు. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత అందుకున్న ఏడో బౌలర్‌గా నిలిచాడు. అతడి కంటే ముందు జార్జ్‌ గిఫెన్‌, మోనీ నోబెల్‌, విల్‌ఫ్రెడ్‌ రోడ్స్‌, గార్‌ఫీల్డ్‌ సోబెర్స్‌, ఇయాన్‌ బోథమ్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌ ఈ ఫీట్‌ సాధించారు.