Harmanpreet Kaur lead MI to second victory by 5 wickets : మహిళల ఐపీఎల్‌ (WPL) 2024 ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్‌(Mumbai Indians) వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గుజరాత్‌ జెయింట్స్‌(Gujarat Giants )తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ కేవలం 126 పరుగులే చేయగా.. 127 పరుగుల లక్ష్యాన్ని ముంబై సునాయసంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగుల నామమాత్రపు స్కోర్‌ చేసింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో కేథరీన్‌ బ్రైస్‌ (25 నాటౌట్‌), కెప్టెన్‌ బెత్‌ మూనీ ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. వేద కృష్ణమూర్తి (0), హర్లీన్‌ డియోల్‌ (8), లిచ్‌ఫీల్డ్‌ (7), దయాలన్‌ హేమలత (3), ఆష్లే గార్డ్‌నర్‌ (15), స్నేహ్‌ రాణా (0), లియా తహుహు (0) విఫలమయ్యారు. ముంబై బౌలర్లు అమేలియా కెర్‌ 4, షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ 3 వికెట్లు తీసి గుజరాత్‌ పతనాన్ని శాశించారు. నాట్‌ సీవర్‌ బ్రంట్‌, హేలీ మాథ్యూస్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అమేలియా కెర్‌ ఆఖర్‌ ఓవర్‌లో 2 వికెట్లు తీసి గుజరాత్‌ను నామమాత్రపు స్కోర్‌కే కట్టడి చేసింది. 



తేలిగ్గా ఛేదించిన ముంబై 
గుజరాత్ విధించిన 127 పరుగుల లక్ష్యాన్ని ముంబై సునాయసంగా ఛేదించింది. అయిదు వికెట్లను నష్టపోయి 18 ఓవర్లలో 129 పరుగులు చేసి విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 46 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించింది. అమెలియా కెర్ (31), నాటస్కివెర్ బ్రంట్ (22) రాణించారు. గుజరాత్‌ బౌలర్లు తనుజా కాన్వార్ 2.. లీ తహుహు, కాథరిన్‌ బ్రైస్ చెరో వికెట్‌ తీశారు. ఈ విజయంతో ముంబయి (4) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. ప్రస్తుత ఎడిషన్‌లో గుజరాత్‌కు ఇది తొలి మ్యాచ్‌ కాగా.. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌ లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో ఢిల్లీపై విజయం సాధించి, ఖాతా తెరిచింది.


తొలి మ్యాచ్‌ గెలిచారిలా..
మహిళల ప్రిమియర్‌ లీగ్‌ సీజన్‌-2 తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌(Mumbai Indians) బోణీ కొట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals)ను ఓడించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది.  అలిస్‌ క్యాప్సీ (53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75), జెమీమా రోడ్రిగ్స్‌ (24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42) ధాటిగా ఆడారు. సివర్‌ బ్రంట్‌, అమేలియా కెర్‌ చెరో 2 వికెట్లు తీశారు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై చివరి బంతికి లక్ష్యాన్ని అందుకుంది.  ఛేదనలో రెండో బంతికే మాథ్యూస్‌ హీలీ వికెట్‌ పడినా... ముంబై లక్ష్యం దిశగా సాగింది. యాస్తిక భాటియా 45 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 57 పరుగులు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 34 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 55 పరుగులు చేయడంతో ముంబై తేలిగ్గానే లక్ష్యాన్ని ఛేదిస్తుందని అనిపించింది.  అమేలియా 24 పరుగులతో కలిసి ఎదురుదాడి చేసి ముంబైలో ఆశలు రేపింది. కానీ అమేలియా పెవిలియన్‌ చేరడంతో ముంబయికి ఎదురుదెబ్బ తగిలింది. 


చివరి ఓవర్‌లో 12 పరుగులు
ముంబై గెలవాలంటే చివరి ఓవర్‌లో ముంబై విజయానికి 12 పరుగులు కావాలి. క్యాప్సీ తొలి బంతికే పూజను అవుట్‌ చేసింది. అయిదో బంతికి హర్మన్‌ప్రీత్‌ను కూడా ఔట్‌ చేయడంతో ఢిల్లీ విజయం ఖాయంగా కనిపించింది. తొలి 5 బంతుల్లో 7 పరుగులిచ్చిన క్యాప్సీ... మంచి బంతులతో ఆకట్టుకుంది. చివరి బంతికి 5 రన్స్‌ అవసరమగా.. సజన (6 నాటౌట్‌) స్టన్నింగ్‌ సిక్స్‌తో మ్యాచ్‌ను ఫినిష్‌ చేసింది. హర్మన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది.