Yuvraj Singh Sensational Comments: టీమిండియా(Team India) మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) సంచలన వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్‌కు అసలు పరిమిత ఓవర్ల జట్టులో స్థానం పొందే అర్హతే లేదని తేల్చేశాడు. ఓ ఇంటర్వ్యూలో టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అశ్విన్ గురించి ఎదురైన ప్రశ్నకు యువరాజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్ గొప్ప బౌలరే.. కానీ వన్డే, టీ20 జట్టులో ఉండే అర్హత అతడికి లేదని యువీ అన్నాడు. టెస్టుల్లో ఆల్‌రౌండర్‌గా అశ్విన్ బెస్ట్ అని.. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్లో బ్యాటర్‌గా, ఫీల్డర్‌గా తను ఏం చేయగలడని యువరాజ్ ప్రశ్నించాడు. టెస్టుల్లో అశ్విన్ కచ్చితంగా ఉండాలని కానీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం అతడికి చోటు అవసరం లేదని కుండబద్దలు కొట్టాడు.
అశ్విన్ రికార్డులు తెలిసే అన్నాడా..?
అశ్విన్ 116 వన్డేల్లో 156.. అదే విధంగా 65 టీ20లలో 72 వికెట్లు తీశాడు. అయితే, వన్డే, టీ20లలో యువ బౌలర్లు ప్రతిభ నిరూపించుకుంటున్నా 2011 ప్రపంచకప్.. 2023 వరల్డ్‌కప్ జట్లలో అశ్విన్‌కు స్థానం లభించింది. అయినా యువరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం క్రికెట్ వర్గాలను విస్మయపరిచింది. అశ్విన్. టెస్టుల్లో బంతి, బ్యాట్‌తో రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. టెస్టుల్లో 490 వికెట్లు తీసిన అశ్విన్.. ఇంగ్లండ్‌తో జనవరి 25 నుంచి మొదలుకానున్న టెస్టు సిరీస్ సందర్భంగా 500 వికెట్ల క్లబ్‌లో చేరే దిశగా పయనిస్తున్నాడు. ఇప్పటి వరకూ 95 టెస్టుల్లో అశూ 3,193 పరుగులు సాధించాడు. ఇందులో 5 శతకాలు, 14 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇలా ఆల్‌రౌండర్‌గా భారత టెస్టు జట్టులో పాతుకుపోయిన అశ్విన్‌కు.. వన్డే, టీ20 జట్టులో మాత్రం ఉండే అర్హత లేదని యువరాజ్ అనడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
ముంబై కెప్టెన్సీపైనా స్పందించిన యువీ
ముంబయి జట్టును ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ.. వచ్చే సీజన్‌లో హార్దిక్ సారథ్యంలో ఆడాలి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఇగో సమస్యలు తలెత్తుతాయా అనే ప్రశ్నకు యువరాజ్‌సింగ్ స్పందించాడు. ఇద్దరు ఆటగాళ్లు కలిసి ఆడినప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయని....కానీ ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా చర్చించుకోవాలని యువీ సూచించాడు. హార్దిక్ ముంబయి జట్టుకు ఆడినప్పుడు అతడి నుంచి ఉత్తమ ప్రదర్శన వెలికితీసేందుకు రోహిత్ కీలక పాత్ర పోషించాడని....యువీ గుర్తు చేశాడు. వచ్చే టీ20 ప్రపంచకప్ టోర్నీలో కెప్టెన్‌గా హార్దిక్‌కు అవకాశం ఇస్తారా..? అన్న ప్రశ్నకు యువీ స్పందిస్తూ.. అది అతడి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందన్నాడు. ఇది సెలెక్టర్లు నిర్ణయించాల్సిన అంశమని పేర్కొన్నాడు. కానీ రోహిత్ గొప్ప కెప్టెన్ అని తాను చెప్పగలనని అన్నాడు.
అందరూ ఆడితేనే ఐసీసీ ట్రోఫీ
ఐసీసీ ట్రోఫీ గెలవాలంటే ఒకరిద్దరూ కాకుండా జట్టు మొత్తం రాణించాలని యువరాజ్ అన్నాడు. పెద్ద మ్యాచుల్లో ఒక్కరిద్దరు ఆడితే సరిపోదనీ.... జట్టు మొత్తం బాగా ఆడాలని అన్నాడు. భారత జట్టు గొప్ప ఆల్‌రౌండర్లలో ఒకడైన యవరాజ్ సింగ్ రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచాడు. 2007లో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో యూవీ సంచలన ఆటతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు సిక్సర్లతో చరిత్ర సృష్టించాడు.