రంజీ ట్రోఫీ 2023-2024 సీజన్‌ను హైదరాబాద్‌ ఘనంగా ప్రారంభించింది. రెండు రోజుల్లోనే నాగాలాండ్‌ను మట్టికరిపించింది. ఇన్నింగ్స్‌ 194 పరుగుల తేడాతో నాగాలాండ్‌పై హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. తొలుత రాహుల్‌ సింగ్‌ గహ్లోత్‌ డబుల్‌ సెంచరీ... కెప్టెన్‌ తిలక్‌ వర్మ శతకంతో భారీ స్కోరు చేసిన హైదరాబాద్‌... తర్వాత నాగాలాండ్‌ను రెండు ఇన్నింగ్సుల్లోనూ తక్కువ పరుగులకే ఆలౌట్‌ చేసింది. హైదరాబాద్‌ బౌలర్ల ధాటికి నాగాలాండ్‌ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకపోయింది. హైదరాబాద్‌ బ్యాటర్ రాహుల్‌ సింగ్‌ గహ్లోత్‌ 143 బంతుల్లో డబుల్‌ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో రవిశాస్త్రి తర్వాత రంజీ ట్రోఫీలో వేగవంతమైన డబుల్‌ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా రాహుల్‌ గుర్తింపు పొందాడు. 


తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు
ఆరంభ మ్యాచ్‌లో హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసింది. గహ్లోత్‌ రాహుల్‌ సింగ్‌( Gahlaut Rahul Singh) డబల్‌ సెంచరీ, టీమిండియ యువ బ్యాటర్‌ తిలక్‌ వర్మ(Tilak Varma) భారీ సెంచరీలతో చెలరేగడంతో... హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో 76.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 474 పరుగుల భారీ స్కోరు వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. నాగాలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌(Hyderabad)టాస్‌ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. గహ్లోత్‌ రాహుల్‌ సింగ్‌, ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ నాగాలాండ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాహుల్‌సింగ్‌ చెలరేగిపోయాడు. టీ20 తరహాలో బ్యాటింగ్‌ చేసిన రాహుల్‌సింగ్‌... 157 బంతుల్లో 136కు పైగా స్ట్రైక్‌రేటుతో 214 పరుగులు సాధించాడు. రాహుల్‌ సింగ్‌ ఇన్నింగ్స్‌లో 23 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. ఓపెనర్‌ తన్మయ్‌ కూడా 80 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ అవుటయ్యాక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్‌ వర్మ.. పట్టుదలగా నిలబడి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. 112 బంతుల్లోనే ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో తిలక్‌ వర్మ శతకం పూర్తి చేసుకున్నాడు. నాగాలాండ్‌ బౌలర్లలో కరుణ్‌ తెవాటియా, నగాహో చిషి, ఇమ్ లివటి లెమ్టూర్‌, క్రెవిస్టో కెన్సె, కెప్టెన్‌ రొంగ్సెన్‌ జొనాథన్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 


కుప్పకూలిన నాగాలాండ్‌
తొలి ఇన్నింగ్స్‌లో  51.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌట్‌ అయిన నాగాలాండ్‌  ఫాలో ఆన్‌ ఆడించింది. అయితే హైదరాబాద్‌ బౌలర్ల ధాటికి తాళలేక రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో ఇన్నింగ్స్‌ 194 పరుగుల తేడాతో హైదరాబాద్‌ భారీ విజయం సాధించింది. రెండ్రోజుల్లోనే ఈ టెస్టు మ్యాచ్‌ ముగిసిపోయింది. హైదరాబాద్‌ బౌలర్లలో టి.త్యాగరాజన్‌ అత్యధికంగా ఎనిమిది వికెట్లు పడగొట్టగా.. చామా మిలింద్‌కు ఆరు వికెట్లు దక్కాయి. తెలుకపల్లి రవితేజ రెండు, కార్తికేయ మూడు, రోహిత్‌ రాయుడు ఒక వికెట్‌ పడగొట్టారు.
నయా వాల్ భారీ శతకం 
రాజ్‌కోట్‌ వేదికగా జార్ఖండ్‌తో మొదలైన ఐదు రోజుల మ్యాచ్‌లో పుజారా సెంచరీతో మెరిశాడు. పుజారా డబుల్‌ సెంచరీ దిశగా పయనిస్తున్నాడు. పుజారా 239 బంతుల్లో 19 ఫోర్ల సాయంతో 157 పరుగులతో క్రీజులో ఉండగా.. ప్రేరక్‌ మన్కడ్‌ 23 పరుగులతో అజేయంగా ఉన్నాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి సౌరాష్ట్ర 119 ఓవర్లలో  నాలుగు వికెట్లు నష్టపోయి 406 పరుగుల భారీ స్కోరు సాధించింది.