దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2024(Ranji Trophy2024)లో హైదరాబాద్(Hyderabad) క్రికెట్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మేఘాలయ(Meghalaya) పై ఇన్నింగ్స్ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండురోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో.. మేఘాలయాను హైదరాబాద్ జట్టు చిత్తు చేసింది. రంజీ ట్రోఫీ ‘ప్లేట్’ గ్రూప్‌లో భాగంగా మేఘాలయాతో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బౌలింగ్ చేసింది. మేఘాలయను తొలి ఇన్నింగ్స్‌లో 33.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ చేసింది. మేఘాలయ బ్యాటర్లలో కెప్టెన్ కిషన్ లింగ్డో (51) మినహా అంతా విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో సాకేత్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ హైదరాబాద్ ఏడు వికెట్ల నష్టానికి 346 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రోహిత్ రాయుడు 124 పరుగులతో అజేయంగా నిలవగా.. చందన్ సహానీ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మేఘాలయను హైదరాబాద్ బౌలర్లు 154 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో మేఘాలయపై ఇన్నింగ్స్ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలి మ్యాచ్‌లోనూ ఇన్నింగ్స్ విజయం
రంజీ ట్రోఫీ 2023-2024 సీజన్‌ను హైదరాబాద్ ఘనంగా ప్రారంభించింది. రెండు రోజుల్లోనే నాగాలాండ్‌ను మట్టికరిపించింది. ఇన్నింగ్స్ 194 పరుగుల తేడాతో నాగాలాండ్‌పై హైదరాబాద్ ఘన విజయం సాధించింది. తొలుత రాహుల్ సింగ్ గహ్లోత్ డబుల్ సెంచరీ... కెప్టెన్ తిలక్ వర్మ శతకంతో భారీ స్కోరు చేసిన హైదరాబాద్... తర్వాత నాగాలాండ్‌ను రెండు ఇన్నింగ్సుల్లోనూ తక్కువ పరుగులకే ఆలౌట్ చేసింది. హైదరాబాద్ బౌలర్ల ధాటికి నాగాలాండ్ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకపోయింది. హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ సింగ్ గహ్లోత్ 143 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో రవిశాస్త్రి తర్వాత రంజీ ట్రోఫీలో వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా రాహుల్ గుర్తింపు పొందాడు.
తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు
ఆరంభ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసింది. గహ్లోత్ రాహుల్ సింగ్( Gahlaut Rahul Singh) డబల్ సెంచరీ, టీమిండియ యువ బ్యాటర్ తిలక్ వర్మ(Tilak Varma) భారీ సెంచరీలతో చెలరేగడంతో... హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో 76.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 474 పరుగుల భారీ స్కోరు వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 51.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌట్ అయిన నాగాలాండ్ ఫాలో ఆన్ ఆడించింది. అయితే హైదరాబాద్ బౌలర్ల ధాటికి తాళలేక రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో ఇన్నింగ్స్ 194 పరుగుల తేడాతో హైదరాబాద్ భారీ విజయం సాధించింది. రెండ్రోజుల్లోనే ఈ టెస్టు మ్యాచ్ ముగిసిపోయింది. హైదరాబాద్ బౌలర్లలో టి.త్యాగరాజన్ అత్యధికంగా ఎనిమిది వికెట్లు పడగొట్టగా.. చామా మిలింద్‌కు ఆరు వికెట్లు దక్కాయి. తెలుకపల్లి రవితేజ రెండు, కార్తికేయ మూడు, రోహిత్ రాయుడు ఒక వికెట్ పడగొట్టారు.