దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ(Ranji Trophy 2024)లో అరుదైన రికార్డులు నమోదవుతున్నాయి. బ్యాటర్లు భారీ ఇన్నింగ్సులతో చెలరేగుతుండగా.. బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో మెరుస్తున్నారు. తాజాగా విదర్భ-మణిపూర్(Vidarbha Vs Manipur) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర రికార్డు నమోదైంది. విదర్భ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆదిత్య సర్వతె (Aditya Sarwate) అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన ఆదిత్య సర్వతె తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం తొమ్మిది ఓవర్లు వేశాడు. అంటే 54 బంతులు వేశాడు. ఈ 54 బంతుల్లో 53 బంతులు డాట్ బాల్స్ కావడం విశేషం. అంటే మణిపూర్(Manipur) బ్యాటర్లు కేవలం ఒక్క బంతికి మాత్రమే ఒక్క పరుగు తీశాడు. ఇలా డాట్స్ వేసి సర్వతే అరుదైన ఘనత సాధించాడు. అంతేనా నాలుగు వికెట్లు కూడా తీశాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఆదిత్య విజృంభించడంతో ఈ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసి విదర్భ ఘన విజయాన్ని అందుకుంది.
మ్యాచ్ సాగిందిలా...
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన మణిపూర్.. తొలి ఇన్నింగ్స్‌లో 34.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌట్ అయింది. విదర్భ బౌలర్లలో ఆదిత్య 9 ఓవర్లు బౌలింగ్ చేసి 8 మెయిడిన్లు చేసి ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 80.3 ఓవర్లలో 230 పరుగులుకు ఆలౌట్ అయింది. బౌలింగ్‌లో రాణించిన ఆదిత్య.. బ్యాటింగ్‌లో కూడా 69 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో మణిపూర్.. 32 ఓవర్లలో 65 పరుగులకే కుప్పకూలింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఆదిత్య.. 11 ఓవర్లు బౌలింగ్ చేసి ఆరు మెయిడిన్లు చేసి పది పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో కూడా అతడు ఐదు వికెట్లు తీశాడు. ఫలితంగా విదర్భ.. 90 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆదిత్య సర్వతె రెండు ఇన్నింగ్సుల్లో కలిసి 19 ఓవర్లు వేసి 14 మెయిడిన్లు వేసి 16 పరుగులు ఇచ్చి తొమ్మిది వికెట్లు తీసుకుని సత్తా చాటాడు.
హైదరాబాద్ ఘన విజయం
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2024లో హైదరాబాద్ క్రికెట్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మేఘాలయపై ఇన్నింగ్స్ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండురోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో.. మేఘాలయాను హైదరాబాద్ జట్టు చిత్తు చేసింది. రంజీ ట్రోఫీ ‘ప్లేట్’ గ్రూప్‌లో భాగంగా మేఘాలయాతో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బౌలింగ్ చేసింది. మేఘాలయను తొలి ఇన్నింగ్స్‌లో 33.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ చేసింది. మేఘాలయ బ్యాటర్లలో కెప్టెన్ కిషన్ లింగ్డో (51) మినహా అంతా విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో సాకేత్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ హైదరాబాద్ ఏడు వికెట్ల నష్టానికి 346 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రోహిత్ రాయుడు 124 పరుగులతో అజేయంగా నిలవగా.. చందన్ సహానీ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మేఘాలయను హైదరాబాద్ బౌలర్లు 154 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో మేఘాలయపై ఇన్నింగ్స్ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.