Cricket News: భారత్ (Bharat)వేదికగా జరిగిన ప్రపంచకప్(World Cup)లో మహ్మద్ షమీ(Mohammed Shami).. ప్రదర్శన క్రికెట్(Cricket) అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. అది మాములు ప్రదర్శన. ప్రతీ బంతికి వికెట్ తీసేలా.. బంతిబంతికి పరీక్ష పెట్టేలా..బుమ్రా, సిరాజ్‌లకు ఆత్మ విశ్వాసం పెరిగేలా షమీ చెలరేగిపోయాడు. బంతితో నిప్పులు చెరిగాడు. బాల్ అందుకుంటే వికెట్ పక్కా అనేంతలా అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రతీ బంతికి వికెట్ తప్పదేమో అని బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టాడు. తొలి నాలుగు మ్యాచుల్లో తుది జట్టులో ఆడే అవకాశమే దక్కని షమీ.. ఒక్కసారి అవకాశం దక్కిన తర్వాత తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు షమీ కుటుంబం నుంచి మరో పేసర్ జాతీయ జట్టు దిశగా పయనిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు.
అన్నకు తగ్గ తమ్ముుడు
బెంగాల్ తరపున మహమ్మద్ షమీ సోదరుడు మహమ్మద్ రంజీ అరంగేట్రం చేశాడు. షమీ లాగే కైఫ్(Mohammed Kaif)కు కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఎంతో మక్కువ. తనకంటే ఆరేళ్ల పెద్దవాడైన షమీ అంతర్జాతీయ క్రికెట్లో సాగుతుండటం చూసిన కైఫ్ స్ఫూర్తి పొందాడు. స్పీడ్, సీమ్, స్వింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు.
కైఫ్ ఇప్పటివరకూ తొమ్మిది లిస్ట్- ఎ మ్యాచ్‌ల్లో 26.33 సగటుతో 12 వికెట్లు పడగొట్టాడు. 2021లో జమ్ము కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌తో బెంగాల్ తరఫున లిస్ట్- ఎ తో క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది విజయ్ హజారే టోర్నీలో 7 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. గోవాపై మూడు వికెట్లను సాధించాడు. బరోడా, తమిళనాడు, పంజాబ్, హరియాణాపై కూడా రెండు వికెట్ల చొప్పున పడగొట్టాడు. 2021 బెంగాల్ టీ20 ఛాలెంజ్ టోర్నీలో ఖరగ్‌పూర్ బ్లాస్టర్స్ తరపున ఆడి 7 వికెట్లతో రాణించాడు. ఐపీఎల్ వేలంలో అతడు అమ్ముడుపోలేదు.
అండగా షమీ
టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలనే కైఫ్ కల నెరవేరే దిశగా షమీ అండగా నిలుస్తున్నాడు. కలిసి సాధన చేయడంతో పాటు, అవసరమైన సలహాలు, సూచనలిస్తూ తమ్ముడి బౌలింగ్ మెరుగవడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో సోదరులు ఇద్దరు కలిసి స్వగ్రామంలో ప్రాక్టీస్ చేశారు.
వరల్డ్‌కప్ హీరో షమీ
భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో షమీ అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో షమీ 7/57 గణాంకాలు నమోదు చేశాడు. వరల్డ్ కప్ చరిత్రలో భారత్ తరఫున ఏడు వికెట్లు తీయడం ఇదే తొలిసారి. ఈ ఘనతతో షమీ తన పేరిట సరికొత్త రికార్డ్‌ని లిఖించుకున్నాడు. ఆశిష్ నెహ్రా 2003 వరల్డ్‌కప్‌లో ఆరు వికెట్లు తీసి, వరల్డ్‌కప్‌లోని సింగిల్ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర నెలకొల్పాడు. ఇప్పుడు షమీ ఏడు వికెట్లు పడగొట్టి.. ఆ చరిత్రను తిరగరాశాడు. న్యూజిలాండ్‌పై సెమీఫైనల్లో ఏడు వికెట్ల హాల్‌తో.. వరల్డ్‌కప్‌లో నాలుగుసార్లు అయిదు వికెట్లు సాధించిన బౌలర్‌గానూ షమీ మరో రికార్డ్‌ని నెలకొల్పాడు.