పేస్‌ బౌలర్లు నిప్పులు చెరిగిన వేళ బెంగాల్‌- ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh Vs  Bengal) మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్‌(Ranji Match) రసవత్తరంగా మారింది. తొలుత బెంగాల్‌ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌( Mohammed Kaif).. ఉత్తర్‌ ప్రదేశ్ తరపున టీమిండియా(Team India) సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌( Bhuvneshwar Kumar) అద్భుత బౌలింగ్‌తో ఈ మ్యాచ్‌లో ఒకేరోజూ 15 వికెట్లు నేలకూలాయి. కాన్పూర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బెంగాల్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కెప్టెన్‌ మనోజ్‌ తివారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బౌలర్లు చెలరేగారు. బెంగాల్‌ బౌలర్ల దెబ్బకు ఉత్తర్‌ప్రదేశ్‌ కేవలం 20.5 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. మహ్మద్‌ షమీ తమ్ముడు మహ్మద్‌ కైఫ్‌ నాలుగు వికెట్లతో యూపీ పతనాన్ని శాసించాడు. యూపీ బ్యాటర్లలో ఓపెనర్‌ సమర్థ్‌ సింగ్‌ 13 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవడం విశేషం.

 

చెలరేగిన భువీ

అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన బెంగాల్‌ను.... టీమిండియా సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ముప్పుతిప్పలు పెచ్చాడు. బెంగాల్‌ బ్యాటర్లను క్రీజులో కుదురుకోనివ్వకుండా చెలరేగాడు. అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేసిన భువీ 1.90 ఎకనామీతో ఏకంగా ఐదు వికెట్లు నేలకూల్చాడు. భువనేశ్వర్‌ దెబ్బకు ఓపెనర్‌ సౌరవ్‌ పాల్‌ 13, సుదీప్‌ కుమార్‌ ఘరామి 0, అనుస్తుప్‌ మజుందార్‌ 12, మనోజ్‌ తివారి 3, అభిషేక్‌ పోరెల్‌ 12 పరుగులకే అవుటయ్యారు. మొదటి రోజు ఆట పూర్తయ్యే సరికి భువనేశ్వర్‌ కుమార్‌ ఐదు వికెట్లు కూల్చగా.. బెంగాల్‌ బ్యాటర్లు శ్రేయాన్ష్‌ ఘోష్‌ 37, కరణ్‌ లాల్‌ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆట ముగిసే సరికి 28 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసిన బెంగాల్‌ 35 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

 

అన్నకు తగ్గ తమ్ముడు

బెంగాల్‌ తరపున మహమ్మద్‌ షమీ సోదరుడు మహమ్మద్‌ రంజీ అరంగేట్రం చేశాడు. షమీ లాగే కైఫ్‌(Mohammed Kaif)కు కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే ఎంతో మక్కువ. తనకంటే ఆరేళ్ల పెద్దవాడైన షమీ అంతర్జాతీయ క్రికెట్లో సాగుతుండటం చూసిన కైఫ్ స్ఫూర్తి పొందాడు. స్పీడ్, సీమ్, స్వింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు.

 

కైఫ్ ఇప్పటివరకూ తొమ్మిది లిస్ట్‌- ఎ మ్యాచ్‌ల్లో 26.33 సగటుతో 12 వికెట్లు పడగొట్టాడు. 2021లో జమ్ము కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌తో బెంగాల్‌ తరఫున లిస్ట్‌- ఎ తో క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది విజయ్‌ హజారే టోర్నీలో 7 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. గోవాపై మూడు వికెట్లను సాధించాడు. బరోడా, తమిళనాడు, పంజాబ్, హరియాణాపై కూడా రెండు వికెట్ల చొప్పున పడగొట్టాడు. 2021 బెంగాల్‌ టీ20 ఛాలెంజ్‌ టోర్నీలో ఖరగ్‌పూర్‌ బ్లాస్టర్స్‌ తరపున ఆడి 7 వికెట్లతో రాణించాడు. ఐపీఎల్‌ వేలంలో అతడు అమ్ముడుపోలేదు.

 

అండగా షమీ

టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలనే కైఫ్‌ కల నెరవేరే దిశగా షమీ అండగా నిలుస్తున్నాడు. కలిసి సాధన చేయడంతో పాటు, అవసరమైన సలహాలు, సూచనలిస్తూ తమ్ముడి బౌలింగ్‌ మెరుగవడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో సోదరులు ఇద్దరు కలిసి స్వగ్రామంలో ప్రాక్టీస్‌ చేశారు.