Ind vs Aus 1st ODI |  ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పెర్త్‌లో జరుగుతున్న మొదటి వన్డేకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. ఇదివరకే ఓసారి భారత్ ఇన్నింగ్స్ మధ్యలో వర్షం కురవడంతో కొంతసేపు మ్యాచ్ నిలిపివేశారు. తరువాత మ్యాచ్ మొదలైంది. మరో 3 ఓవర్లు ఆట కొనసాగిన వెంటనే మరోసారి వరుణుడు ఆటంకం కలిగించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ తక్కువ స్కోరుకే అవుటయ్యారు.

Continues below advertisement

భారత్ ఇన్నింగ్స్‌కు వరుణుడి అంతరాయం..

మొదట 8.5 ఓవర్లలో భారత్ 25/3 స్కోరు వద్ద ఉండగా వర్షం అంతరాయం కలిగించింది, కొంత సమయానికి కవర్లు తొలగించి, మ్యాచ్ కొనసాగించారు. గిల్ ఔటయ్యాక అక్షర్ పటేల్ బ్యాటింగ్ కు వచ్చాడు. శ్రేయస్ అయ్యర్ (6), అక్షర్ పటేల్ (7) పరుగులతో ఉన్న సమయంలో మరోసారి వర్షం మొదలైంది. దాంతో 11.5 ఓవర్లో 37/3 వద్ద మరోసారి మ్యాచ్ నిలిపివేశారు. ఆట మధ్యాహ్నం దాదాపు ఒంటి గంటకు మొదలయ్యే అవకాశం ఉంది. అంపైర్లు గొడుగు తీసుకుని మైదానంలోకి వెళ్లి పరిశీలించి వచ్చారు.

Continues below advertisement

ఆసీస్ కు పేసర్లు శుభారంభం

ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టుకు బౌలర్లు మంచి ఆరంభం ఇచ్చారు. లైన్ అండ్ లెంగ్త్ బంతులు వేసి ఒత్తిడి తెచ్చారు. జోష్ హేజిల్‌వుడ్ ప్రారంభంలోనే రోహిత్ శర్మను 8 పరుగుల వద్ద అవుట్ చేశాడు. తర్వాత కోహ్లీ వంతు అయింది. విరాట్ కోహ్లీ కూడా త్వరగానే అవుటయ్యాడు, 8 బంతులాడిన కోహ్లీ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు.

కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను సరిదిద్దాలని చూశాడు. కొన్ని బౌండరీలతో టచ్ లో కనిపించాడు. కాని ఎల్లీస్ బౌలింగ్ లో వికెట్ సమర్పించుకున్నాడు.గిల్ బంతిని చక్కగా ఆడటానికి ప్రయత్నించాడు, కానీ లెగ్ సైడ్‌లో దిగుతున్న బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. బంతి లోపలి అంచున తగిలి జోష్ ఫిలిప్ వైపు వెళ్లగా ఎడమవైపుకి దూకి చక్కగా క్యాచ్ పట్టాడు. 9 ఓవర్లలోనే భారత్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది.

ఓవర్లలో భారీ కోత విధిస్తారా..

మధ్యాహ్నం 12:25 గంటలకు 49 ఓవర్ల మ్యాచ్ ప్రారంభం అవుతుందని చెప్పారు. కానీ మరిన్ని ఓవర్లు కోత విధించే అవకాశం కనిపిస్తోంది. దాంతో ఛేజింగ్ జట్టుకు ఇది కలిసిరానుంది. అయితే 240 స్కోర్ చేస్తే డిఫెండ్ చేసుకోవచ్చు అని మాజీలు అభిప్రాయపడ్డారు. 2018 తరువాత వర్షం కారణంగా పెర్త్ పిచ్ మీద ఓవర్ల కోత తొలిసారి నేడు విధించారు. నలుగురు బౌలర్లు 10 ఓవర్లు బౌలింగ్ చేయడానికి అనుమతించవచ్చు.

పెర్త్ పేసర్ల పిచ్..

పెర్త్ స్టేడియంలో మ్యాచ్ అంటే బ్యాటర్లలో వణుకు తప్పదు. ఎందుకంటే ఒక్క బంతిని పొరపాటుగా ఆడితే క్షణాల్లో వికెట్ కోల్పోక తప్పదు. ముఖ్యంగా టాపార్డర్ ఆటగాళ్లు క్రీజులో కుదరుకునే లోపే ఆసీస్ బౌలర్లు పేస్ తో వికెట్లు రాబడతారు. అందులోనూ వర్షం వచ్చే పరిస్థితుల్లో అయితే బంతిని స్వింగ్ చేశారంటే బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం ఉండదు.