Ashwin Retires from IPL cricket | చెన్నై:  భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇదివరకే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వెటరన్ ప్లేయర్ తాజాగా IPL ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. సోషల్ మీడియా పోస్టులో తన రిటైర్మెంట్ విషయాన్ని అనౌన్స్ చేశాడు. "ఈ రోజుతో నా IPL కెరీర్ ముగిసింది అని రాసుకొచ్చాడు. 16 సంవత్సరాల సుదీర్ఘ IPL కెరీర్‌లో అశ్విన్ మొత్తం 221 మ్యాచ్‌లు ఆడగా అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మొత్తం 5 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. డిసెంబర్ 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం తెలిసిందే. 

ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ 2009లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున IPL అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అతను రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. అశ్విన్ చివరి సీజన్ (IPL 2025)లో తిరిగి చెన్నై సూపర్ కింగ్స్‌లో తిరిగి చేరాడు. ఈ సీజన్ ముగిసిన మూడు నెలల తరువాత ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు.

ఆర్ అశ్విన్ రిటైర్మెంట్ పోస్ట్

IPL ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేశాడు. "ఒక ప్రత్యేకమైన రోజు, మరో ప్రత్యేకమైన ప్రారంభం. ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభానికి నాంది పలుకుతుందని అంతా చెబుతారు. ఒక IPL క్రికెటర్‌గా నా కెరీర్ ఈ రోజుతో ముగుస్తుంది, కానీ వివిధ లీగ్‌లలో ఆటను అన్వేషించే ప్లేయర్‌గా ఈ రోజు నుండి మరో ప్రస్థానం ప్రారంభమవుతుందని" పేర్కొన్నాడు.

IPLలో తనకు అవకాశం ఇచ్చిన అన్ని ఫ్రాంచైజీలకు అశ్విన్ కృతజ్ఞతలు తెలిపాడు. "ఇన్ని సంవత్సరాల అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు అవకాశం ఇచ్చిన అన్ని ఫ్రాంచైజీలకు ధన్యవాదాలు. కెరీర్‌లో తనకెంతో ఇచ్చిన BCCI, IPL లకు చాలా కృతజ్ఞతలు. జీవితంలో మరిన్ని ఆస్వాదించడానికి, తరువాత కొత్త ఇన్నింగ్స్ కోసం సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి ఎదురు చూస్తున్నాను" అని ఆసక్తికర పోస్ట్ చేశాడు అశ్విన్.

 అశ్విన్ IPL రికార్డులు

అశ్విన్ IPLలో 5 జట్ల తరఫున ఆడాడు. అతని IPL కెరీర్ 2009లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ప్రారంభం కాగా చివరి సీజన్ (2025) కూడా ఇదే ఫ్రాంచైజీ కోసం ఆడాడు.  IPLలో అశ్విన్ 221 మ్యాచ్‌లాడిన 187 వికెట్లు తీశాడు. 7.20 ఎకానమీతో వికెట్లు సాధించాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసే నైపుణ్యం అశ్విన్ సొంతం. ఐపీఎల్ లోనే కాదు అంతర్జాతీయ క్రికెట్లోనూ బెస్ట్ బౌలర్‌లలో ఒకడిగా నిలిచాడు.