Asia Cup 2022: ఆసియా కప్ లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ గెలవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తన సంతోషాన్ని ప్రకటించారు. జట్టుకు అభినందనలు తెలిపారు. టీమిండియా అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన  చేసిందని అన్నారు. గొప్ప నైపుణ్యంతో పాక్ పై గెలిచిందన్నారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా భారత జట్టు సభ్యులకు తన అభినందనలు తెలియజేశారు. 


టీమిండియాకు కేంద్ర మంత్రి అభినందనలు.. 
అలానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా భారత జట్టుకు అభినందనలు తెలిపారు. ఆసియా కప్ లో పాక్ ను ఓడించడం ద్వారా  భారత్ శుభారంభం చేసిందని అన్నారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించడం సంతోషకరమంటూ ట్వీట్ చేశారు. ఇంకా భారత మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు భారత జట్టుకు శుభాకాంక్షాలు తెలియజేశారు. మిగిలిన మ్యాచుల్లోనూ గెలిచి ఆసియా కప్ ను అందుకోవాలని ఆకాంక్షించారు. 


ఆసియా కప్‌ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. థ్రిల్లింగ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 147 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం టీమిండియా 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసియా కప్‌లో భారత్ తన తదుపరి మ్యాచ్‌లో హాంగ్ కాంగ్‌తో తలపడనుంది. ఆగస్టు 31వ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 4వ తేదీన జరిగే సూపర్-4 మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ మళ్లీ తలపడనున్నాయి.