Haris Rauf News: ఇటీవల పాకిస్థాన్ స్టార్ పేసర్ హారిస్ రౌఫ్(Haris Rauf)కు పాక్ క్రికెట్ బోర్డు(PCB )దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియా పర్యటనకు గాయం కారణంగా హారిస్ దూరంగా ఉన్నాడు. ఎలాంటి గాయం కానప్పటికీ ఉద్దేశ పూర్వకంతో హారీస్ ఆసీస్ పర్యటన నుంచి తప్పుకోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అతడిపై కఠిన చర్యలు తీసుకుంది. హరీస్ సెంట్రల్ కాంట్రాక్టును రద్దు చేసింది. అంతేకాదు.. ఈ ఏడాది జూన్ వరకు అతడు ఎటువంటి విదేశీ టీ20 లీగ్‌లు ఆడకుండా చేసింది. అయితే ఇప్పుడు లీగల్ టీమ్ సమీక్షించిన అనంతరం అతడి కాంట్రాక్టును పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపాయి. తన కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించాలని రవూఫ్ అభ్యర్థన పెట్టుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఆడకపోవడానికి దారితీసిన పరిస్థితులను లాయర్ ద్వారా వివరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘అతడి అభ్యర్థనకు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి. సెంట్రల్ కాంట్రాక్ట్ పునరుద్ధరించొచ్చని పీసీబీ వర్గాలు చెప్పినట్లు సమాచారం.
అసలు ఏం జరిగిందంటే..?
ఇటీవల పాకిస్తాన్ ఆస్ట్రేలియాలో పర్యటించగా.. ఆఖరి నిమిషంలో హారిస్ తప్పుకున్నాడు. సిరీస్‌లో ఆడాలని 10-15 ఓవర్లు బౌలింగ్ చేసినా చాలు అని టీమ్‌మేనేజ్‌మెంట్ అతడికి చెప్పినా హరీస్ అంగీకారం తెలపలేదు. అతడికి ఎటువంటి గాయం కాలేదు. మెడికల్ బృందం కూడా అతడు ఫిట్‌గా ఉన్నాడని బోర్డుకు నివేదిక ఇచ్చింది. సిరీస్‌కు ఆడకుండా బిగ్‌బాష్ లీగ్‌లో ఆడాడు. దీంతో పీసీబీ అతడిపై సీరియస్ అయ్యింది. హరీస్ నుంచి వివరణ కోరింది. ఈ స్టార్ బౌలర్ వివరణపై సంతృప్తి చెందని పీసీబీ కఠిన చర్యలు తీసుకుంది. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుకోవడంతో పాటు సరైన వివరణ ఇవ్వలేకపోయిన హరీస్ సెంట్రల్ కాంట్రాక్ట్ రూల్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 30, 2024 వరకు విదేశీ లీగుల్లో ఆడేందుకు ఎన్‌వోసీ ఇవ్వమని చెప్పింది.
వరల్డ్‌కప్‌లో చెత్త బౌలర్
భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన హరీస్ రౌఫ్ ఏకంగా 533 పరుగులు సమర్పించుకున్నాడు. లీగ్ దశ పోటీల్లో ఆడిన 9 మ్యాచ్‌లో హరీస్ రౌఫ్ 16 వికెట్లు తీశాడు. 9 మ్యాచ్‌ల్లో ఏకంగా 533 పరుగులు ఇచ్చాడు. వన్డే ప్రపంచకప్‌లో ఒక ఎడిషన్‌లో 500కు పైగా పరుగులు సమర్పించుకున్న నాలుగో బౌలర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ పేరున ఈ చెత్త రికార్డు ఉండేది. ఆదిల్ రషీద్ 2019 ప్రపంచకప్‌లో 526 పరుగులిచ్చాడు. తాజా ఎడిషన్‌లో 533 పరుగులిచ్చిన హరీస్ రౌఫ్ ఆ చెత్త రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హరీస్ రౌఫ్ 3 వికెట్లు తీసినా 64 పరుగులు సమర్పించుకున్నాడు. నెదర్లాండ్స్‌పై 43, శ్రీలంకపై 64, భారత్‌పై 43, ఆస్ట్రేలియాపై 83, అఫ్ఘానిస్థాన్‌పై 53, సౌతాఫ్రికాపై 62, బంగ్లాదేశ్‌పై 36, న్యూజిలాండ్‌పై 85 పరుగులు ఇచ్చాడు. ఇక ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తరఫున 500కు పరుగులు చేసిన బ్యాటర్ ఎవరూ లేరు.