PCB chief Ramiz Raja:  పాకిస్థాన్‌లో ఆసియా కప్ ఆడబోమంటూ.. బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పాక్‌లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ క్రమంలోనే టీమిండియాపై గతకొంతకాలంగా విమర్శలు చేస్తోన్న రమీజ్‌.. తాజాగా మరోసారి ఈ విషయంపై స్పందించారు.


దాయాది దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పాక్‌తో.. భారత్‌ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. కేవలం ఐసీసీ ఈవెంట్లలో, తటస్థ వేదికల్లో మాత్రమే పాక్‌తో టీమ్‌ఇండియా తలపడుతోంది. అయితే వచ్చే ఏడాది ఆసియా కప్‌ పాక్‌ వేదికగా జరగనుంది. ఈ టోర్నీలో భారత్‌ పాల్గొనడంపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. భారత్ పాకిస్థాన్ లో ఆసియా కప్ ఆడబోదంటూ కొన్నాళ్ల క్రితం బీసీసీఐ కార్యదర్శి జై షా వ్యాఖ్యలు చేశారు.  ఒకవేళ భారత్‌ తమ దేశంలో ఆడకపోతే.. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో పాక్‌ క్రికెట్‌ బోర్డ్‌ చీఫ్‌ రమీజ్‌ రజా తెలిపాడు.


ఆసియా కప్‌లో భారత్‌ ఆడకపోతే.. భారత్‌లో జరిగే 2023 వన్డే ప్రపంచకప్‌లో తాము ఆడబోమని రమీజ్‌ రజా తేల్చి చెప్పాడు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి ముందే 2023 ఆసియా కప్‌ జరగనుంది. ఆసియా కప్‌ కోసం భారత్.. పాక్‌కు రావొద్దని నిర్ణయం తీసుకుంటే తాము ప్రపంచకప్ ఆడమని అన్నాడు.  ఈ విషయంలో తమ వైఖరి దృఢంగా ఉందని రమీజ్‌ స్పష్టం చేశాడు.


వారు రాకపోతే మేం వెళ్లం


'గత కొంతకాలంగా పాకిస్థాన్ నాణ్యమైన క్రికెట్ ఆడుతోంది. భారత్ ను రెండుసార్లు ఓడించింది. వాళ్లు ఆసియా కప్ కోసం ఇక్కడకు రాకపోతే.. మేం ప్రపంచకప్ ఆడడానికి అక్కడకు వెళ్లం. ప్రపంచకప్ లో పాక్ ఆడకపోతే ఆ టోర్నీని ఎవరు చూస్తారు? మేం ఆటలో దూకుడు విధానాన్ని అనుసరిస్తున్నాం. మా జట్టు మంచి ప్రదర్శన చేస్తోంది. జట్టు మంచి ఆట ఆడితే పాక్ క్రికెట్ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. బిలియన్ డాలర్ల ఎకానమీ కలిగిన బోర్డు ఉన్న జట్టును పాక్ నెలల వ్యవధిలో రెండుసార్లు ఓడించింది.' అని రమీజ్ రజా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. 


2009లో పాకిస్థాన్ లోని గడాఫీ మైదానం వెలుపల శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రదాడి అనంతరం.. ఆ దేశంలో క్రికెట్‌ ఆడటం ప్రపంచ దేశాలు మానేశాయి. అక్కడ 2009లో నిర్వహించిన ఆసియా కప్పే చివరి అంతర్జాతీయ లీగ్.  ఆ తర్వాత పరిస్థితులు మారటంతో 2015లో జింబాబ్వే, 2017లో శ్రీలంక అక్కడ పర్యటించాయి. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా కూడా ఆ దేశంలో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడింది.