ODI World Cup 2023: అక్టోబర్ నుంచి జరుగబోయే వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్‌కు రానుంది. ఈ మేరకు  పాకిస్తాన్ ప్రభుత్వం  ఆదివారం అనుమతులు మంజూరు చేసింది. ఆసియా కప్ వివాదం నేపథ్యంలో  పాకిస్తాన్.. భారత్‌‌కు వస్తుందా..? రాదా..? అన్నదానిపై నిన్నామొన్నటిదాకా ఉత్కంఠ ఉండేది. ఆసియా కప్‌లో భారత్ చూపిన భద్రతా సమస్యలనే  కారణంగా చూపుతూ  తాము ఇండియాకు రాబోమని, తమకూ తటస్థ వేదికలు  ఉండాలని, ఒకవేళ భారత్‌లోనే ఆడాల్సి వస్తే కొన్ని ఎంపిక చేసిన స్టేడియాలలోనే ఆడతామని కొర్రీలు పెట్టిన విషయం తెలిసిందే. 


అయితే  ఆతిథ్య దేశంగా ఉన్న భారత్ (బీసీసీఐ)తో పాటు ఐసీసీ  కూడా పీసీబీతో చర్చించి  వేదికల విషయంలో క్లారిటీ ఇచ్చాయి.   కానీ పాకిస్తాన్  వన్డే వరల్డ్ కప్‌లో ఆడే విషయాన్ని  ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ).. ప్రభుత్వానికి వదిలేసింది. దీంతో  షెహబాజ్ షరీఫ్ సారథ్యంలోని  ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించి దీనిపై నివేదిక కోరింది. మంత్రుల బృందం నివేదిక సమర్పించిన  నేపథ్యంలో  ప్రభుత్వం.. బాబర్ ఆజమ్ అండ్ గ్యాంగ్ భారత్‌కు రావడానికి అంగీకారం తెలిపింది.  క్రీడలను రాజకీయాలు, ద్వైపాక్షిక సంబంధాలతో కలపడం సరికాదని   పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. 


ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేస్తూ... ‘అంతర్జాతీయ క్రీడా సంబంధాలలో  ఇండియాతో  ద్వైపాక్షిక సంబంధాలు అడ్డురాకూడదని మేం కోరుకుంటున్నాం. అందుకే  ప్రపంచకప్ ఆడేందుకు గాను పాకిస్తాన్ జట్టును భారత్‌కు పంపనున్నాం..’అని పేర్కొంది. పాకిస్తాన్ టీమ్‌ను పంపినా భద్రత విషయంలో  బీసీసీఐ, ఐసీసీలకు ప్రత్యేక విజ్ఞప్తి కూడా చేసింది. ‘భారత్‌లో పాక్ జట్టు భద్రతపై  మాకు ఆందోళన కలుగుతోంది.  ఈ విషయాన్ని బీసీసీఐ, ఐసీసీల వద్ద ప్రస్తావిస్తాం.  భారత్‌లో పాకిస్తాన్ జట్టుకు పూర్తి రక్షణ ఉంటుందని మేం నమ్ముతున్నాం..’ అని విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. 


 






ప్రపంచకప్‌లో పాకిస్తాన్ షెడ్యూల్ : 


- అక్టోబర్ 06 : పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ - హైదరాబాద్
- అక్టోబర్ 12 : పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక - హైదరాబాద్
- అక్టోబర్ 15 : పాకిస్తాన్ వర్సెస్ ఇండియా - అహ్మదాబాద్
- అక్టోబర్ 20 : పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా - బెంగళూరు 
- అక్టోబర్ 23 : పాకిస్తాన్ వర్సెస్ అఫ్గానిస్తాన్ - చెన్నై
- అక్టోబర్ 27 : పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా - చెన్నై
- అక్టోబర్ 31 : పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ - కోల్‌కతా
- నవంబర్ 04 : పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ - బెంగళూరు
- నవంబర్ 12 : పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ - కోల్‌కతా 


ఐసీసీ వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌ను బీసీసీఐ, ఐసీసీలు సంయుక్తంగా జూన్ 27న  ముంబై వేదికగా విడుదల చేసిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా భారత్ - పాక్ మధ్య జరుగబోయే  మ్యాచ్‌ను అక్టోబర్ 14నే నిర్వహించేందుకు  పీసీబీ అంగీకరించింది. కానీ రీషెడ్యూల్‌ను ఐసీసీ ఇంకా ప్రకటించలేదు. 




















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial