Hardik Pandya Viral: వెస్టిండీస్‌ పర్యటనలో  టెస్టు, వన్డే సిరీస్‌‌ను గెలుచుకున్న భారత జట్టు టీ20లలో మాత్రం తడబడుతోంది.  వరుసగా  రెండు మ్యాచ్‌లలోనూ  మెన్ ఇన్ బ్లూకు భంగపాటు తప్పలేదు. బ్యాటింగ్ వైఫల్యాలతో పాటు  మ్యాచ్‌లో అనుసరిస్తున్న వ్యూహాలు, కీలక సమయాల్లో బౌలింగ్ మార్పు టీమిండియాకు షాకులిస్తున్నాయి.   గయానా వేదికగా  ముగిసిన రెండో టీ20లో  బ్యాటర్లు విఫలమైనా బౌలర్లు  పోరాడటంతో విజయం దిశగా సాగిన టీమిండియా.. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తెలివి తక్కువ నిర్ణయం కారణంగా ఓటమిపాలైందని భారత జట్టు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. 


నిన్న గయానా వేదికగా ముగిసిన మ్యాచ్‌లో  భారత జట్టు నిర్దేశించిన 153 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ జట్టు నికోలస్ పూరన్ (40 బంతుల్లో 67, 6 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడటంతో లక్ష్యం దిశగా సాగింది.  అయితే  14వ ఓవర్లో పూరన్ నిష్క్రమించిన తర్వాత భారత్ పుంజుకుంది. బిష్ణోయ్ వేసిన 15వ ఓవరో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. యుజ్వేంద్ర చాహల్ వేసిన 16వ ఓవర్లో  రెండు పరుగులే రాగా  యుజీ రెండు కీలక వికెట్లు కూడా పడగొట్టాడు.  


యుజీ వేసిన 16వ ఓవర్లో తొలి బంతికి రొమారియా షెపర్డ్ రనౌట్ అయ్యాడు. నాలుగో బంతికి  చాహల్.. జేసన్ హోల్డర్ (0) ను కూడా బోల్తొ కొట్టించి పెవిలియన్‌కు పంపాడు. ఇదే ఓవర్లో ఆఖరు బంతికి షిమ్రన్ హెట్‌మెయర్ (21) కూడా ఎల్బీగా వెనుదిరిగాడు. 16వ ఓవర్‌కు ముందు  127-5గా ఉన్న విండీస్.. ఓవర్ ముగిసేవరకూ 129-8గా మారింది. రెండు వికెట్లు తీసిన చాహల్ మరో ఓవర్ వేస్తే కచ్చితంగా మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. కానీ హార్ధిక్ మాత్రం అతడికి మళ్లీ బంతినివ్వలేదు. నాలుగు ఓవర్ల కోటాలో మరో ఓవర్ మిగిలున్నా  పాండ్యా.. అతడిని పక్కనబెట్టాడు. 17వ ఓవర్ ముఖేష్ కుమార్ వేయగా 18వ ఓవర్‌ను అర్ష్‌దీప్‌కు ఇచ్చాడు.  ఆ ఓవర్లో అర్ష్‌దీప్ ఓ ఫోర్‌తో పాటు 9 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖేష్ వేసిన  19వ ఓవర్లో అల్జారీ జోసెఫ్.. 6,4 కొట్టి విండీస్ విజయాన్ని ఖాయం చేశాడు.


 






మ్యాచ్ ముగిశాక హార్ధిక్‌‌ను టార్గెట్‌గా చేసుకుని నెటిజన్లు ఆటాడుకున్నారు. రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పిన చాహల్‌కు మరో ఓవర్ ఇచ్చిఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది.  పాండ్యా తొలి టీ20లో కూడా ఇదే తప్పుచేశాడు.  ఆ మ్యాచ్‌లో చాహల్ ఐదో ఓవర్లో రెండు వికెట్లు తీసిన తర్వాత అతడి స్పెల్‌ను కంటిన్యూ చేయకుండా మళ్లీ 13వ ఓవర్లో బంతినిచ్చాడు.  అందుకు గాను హార్ధిక్ పాండ్యా, టీమిండియా భారీ మూల్యాన్ని చెల్లించుకోకతప్పలేదు. పాండ్యా నిర్ణయం పట్ల  నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   ద్వైపాక్షిక మ్యాచ్‌లు అంటే ఐపీఎల్‌లో అహ్మదాబాద్‌లో ఆడినట్టు కాదని.. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహాలు మార్చుకోవాలని సూచిస్తున్నారు.  


 






 



























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial