నసీమ్ షా.. భారత్ పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత బాగా వినిపిస్తున్న పేరు. ఫస్ట్ ఓవర్‌లోనే కేఎల్ రాహుల్‌ను బోల్తా కొట్టించి... టీమిండియాకు పెద్ద షాక్‌కి గురి చేశాడు. తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత్‌ను కష్టాల్లోకి నెట్టేశాడు. అందుకే అతను మీడియాలో ఫేమస్ అయిపోయాడు.
ఆసియా కప్‌లో భారత్ పై టీ20ల్లో అరంగేట్రం చేసిన ఈ కుర్రాడు.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను తన పేస్‌తో భయపెట్టాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 27 పరుగులే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు.
అయితే భారత్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసే క్రమంలో నసీమ్ పాదానికి గాయమైంది. అయినప్పటికీ బాధను భరిస్తూనే తన ఓవర్‌ను పూర్తి చేశాడీ యంగ్ బౌలర్. గాయంతో అతడు తర్వాతి మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
అతను వేసిన లాస్ట్ ఓవర్ వేసిన తీరు కూడా అందర్నీ కట్టిపడేసింది. కాలు కండరం పెట్టేసినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. బాల్ బాల్‌కు బాధపడుతూనే ఓవర్ ముగించాడు. రిక్వైర్డ్ రన్‌రేట్ పెరిగిపోతోందన్న కంగారులో భారీ షాట్స్‌కు ప్రయత్నించినప్పటికీ అలాంటి ఛాన్స్ ఇవ్వలేదు నసీమ్‌షా. చివరికి వేసే పరిస్థితి లేకపోవడంతో... ఐదో బాల్ సిక్స్‌గా మలిచాడు హార్దిక్ పాండ్యా.
19 ఏళ్లకే పాకిస్థాన్ టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసి ఔరా అనిపించాడు షా. ఇప్పటి వరకు 13 టెస్టులు, 3 వన్డేలు ఆడి.. వరుసగా 33, 10 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చి భారత్ ను ముప్పుతిప్పలు పెట్టాడు. ముందుముందు పాక్‌కు పేస్ బౌలింగ్‌లో నసీమ్ షా కీలక ఆటగాడవుతాడనడంలో సందేహం లేదు.
ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. థ్రిల్లింగ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 147 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం టీమిండియా 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసియా కప్‌లో భారత్ తన తదుపరి మ్యాచ్‌లో హాంగ్ కాంగ్‌తో తలపడనుంది. ఆగస్టు 31వ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 4వ తేదీన జరిగే సూపర్-4 మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ మళ్లీ తలపడనున్నాయి.
గెలిపించిన జడేజా, పాండ్యా
148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (0: 1 బంతి) తాను ఎదుర్కొన్న మొదటి బంతికే అవుటయ్యాడు. అయితే విరాట్ కోహ్లీ (35: 34 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), రోహిత్ శర్మ (12: 18 బంతుల్లో, ఒక సిక్సర్) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. రెండో వికెట్‌కు 7.4 ఓవర్లలో 49 పరుగులు జోడించారు. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ రోహిత్ శర్మను అవుట్ చేసి మహ్మద్ నవాజ్ పాకిస్తాన్‌కు కీలక వికెట్ అందించాడు. అనంతరం విరాట్ కోహ్లీ కూడా నవాజ్ బౌలింగ్‌లోనే రోహిత్ తరహాలోనే అవుటయ్యాడు. దీంతో భారత్ 53 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
అనంతరం సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా మరో వికెట్ పడకుండా కాసేపు ఆడారు. నాలుగో వికెట్‌కు 36 పరుగులు జోడించిన అనంతరం సూర్యకుమార్ యాదవ్ (18: 18 బంతుల్లో, ఒక ఫోర్) అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 89 పరుగులకు చేరుకుంది. మరో వైపు సాధించిన రన్‌రేట్ కూడా 10 పరుగులకు చేరుకోవడంతో ఒత్తిడి బాగా పెరిగింది. ఈ దశలో రవీంద్ర జడేజా (35: 29 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (33: 17 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) స్కోరును ముందుకు నడిపించారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 52 పరుగులు జోడించారు. అయితే చివరి ఓవర్లో ఏడు పరుగులు చేయాల్సిన దశలో రవీంద్ర జడేజా అవుట్ కావడంతో తిరిగి ఉత్కంఠ నెలకొంది. అయితే పాండ్యా ఎటువంటి పొరపాటు లేకుండా మ్యాచ్‌ను ముగించాడు.