PAK vs ENG T20 WC 2022 Final: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 ఆఖరి సమరానికి అంతా రెడీ! ఫైనల్ మ్యాచ్ టాస్ వేశారు. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ వెంటనే బౌలింగ్ ఎంచుకున్నాడు. రెండు జట్లు మంచి ఫామ్‌తో ఫైనల్‌కు చేరుకున్నాయని పేర్కొన్నాడు. వాతావరణం చల్లగా ఉండటంతో ఫీల్డింగ్ తీసుకున్నామన్నాడు. ఎలాంటి మార్పులు చేయలేదని సెమీస్ జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని వెల్లడించాడు. టాస్ గెలిస్తే తామూ ఫీల్డింగే ఎంచుకొనేవాళ్లమని పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నాడు. మూమెంటమ్‌ను ఇలాగే కొనసాగిస్తామని పేర్కొన్నాడు. సెమీస్ జట్టుతోనే దిగుతున్నామని చెప్పాడు.
ఇంగ్లాండ్: జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టన్, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్
పాకిస్థాన్: మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజామ్, మహ్మద్ హ్యారిస్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, నసీమ్ షా, హ్యారిస్ రౌఫ్, షాహిన్ అఫ్రిది
బ్యాటింగ్ సమతూకం.. బౌలింగ్ అద్భుతం
గ్రూపు దశలో విఫలమైన పాక్ ఓపెనర్లు బాబర్ అజాం, మహ్మద్ రిజ్వాన్ లు సెమీఫైనల్ మ్యాచులో అర్థశతకాలతో ఫామ్ లోకి వచ్చేశారు. మిడిలార్డర్ లో ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ లు బాగానే ఆడుతున్నారు. ఇక బౌలింగ్ లో ఆ జట్టు అద్భుతంగా ఉంది. షహీన్ అఫ్రీది, నసీం షా, రవూఫ్ లతో కూడిన పేస్ దళం ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తోంది. స్పిన్నర్ షాదాబ్ ఖాన్ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. వీరి బౌలింగ్ ను ఎదుర్కోవడం ఇంగ్లండ్ కు సవాల్ అని చెప్పొచ్చు.
ఇంగ్లండ్.. జట్టునిండా మ్యాచ్ విన్నర్లే
మంచి బ్యాటింగ్ చేయగల మొయిన్ అలీ, సామ్ కరణ్ లు 7, 8 స్థానాల్లో బ్యాటింగ్ వస్తారంటే ఇంగ్లండ్ జట్టు ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అలాంటి జట్టు సూపర్ - 12 దశలో ఓ మోస్తరు ప్రదర్శనే చేసింది. కానీ సెమీస్ లో భారత్ పై 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ఇంగ్లిష్ ఓపెనర్లు అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ విధ్వంసమే సృష్టించారు. వారిద్దరే 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. వారే కాక హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్ స్టోన్, బెన్ స్టోక్స్ లతో కూడిన బ్యాటింగ్ దళం వారి సొంతం. అయితే బౌలింగే కొంచెం బలహీనంగా కనబడుతోంది. స్పిన్నర్లు ఆదిల్ రషీద్, లివింగ్ స్టోన్ ఫాంలో ఉన్నారు. క్రిస్ వోక్స్, జోర్డాన్, మార్క్ ఉడ్, సామ్ కరన్ లతో కూడిన పేస్ బౌలింగ్ దళం రాణిస్తే ఇంగ్లండ్ కు తిరుగుండదు.