PAK vs ENG 1st Test: టీ20 విశ్వ విజేత ఇంగ్లాండ్ ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్లో రెచ్చిపోతోంది. రావల్పిండి వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వందేళ్ల నాటి రికార్డు బ్రేక్‌ చేసింది. టెస్టు తొలి రోజే 500 పరుగులు చేసిన తొలి జట్టుగా ఆవిర్భవించింది. 112 ఏళ్ల కిందట ఆస్ట్రేలియా సృష్టించిన ఘనతను తిరగరాసింది. 1910లో సిడ్నీలో దక్షిణాఫ్రికాపై కంగారూల 494 రన్స్‌ రికార్డును తుడిచి పెట్టేసింది. కాగా 17 ఏళ్ల తర్వాత ఆంగ్లేయులు పాకిస్థాన్‌లో టెస్టు సిరీస్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే.


నలుగురు సెంచరీలు


ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు వైరస్‌ బారిన పడ్డప్పటికీ పాక్‌పై తొలి టెస్టులో దూసుకుపోయారు. మొదటి రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 506 పరుగులు సాధించారు. హ్యారీ బ్రూక్‌ (101 బ్యాటింగ్‌; 81 బంతుల్లో 14x4, 2x6), బెన్‌స్టోక్స్‌ (34 బ్యాటింగ్‌; 15 బంతుల్లో 6x4, 1x6) అజేయంగా నిలిచారు. టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండుకు ఓపెనర్లు జాక్‌ క్రాలీ (122; 111 బంతుల్లో 21x4, 0x6), బెన్‌ డకెట్‌ (107; 110 బంతుల్లో 15x4, 0x6) ఫెంటాస్టిక్‌ ఓపెనింగ్‌ అందించారు. తొలి వికెట్‌కు 233 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 35వ ఓవర్లో డకెట్‌ను జహిద్‌ మహ్మద్‌ ఔట్‌ చేయడం ఈ భాగస్వామ్యం విడిపోయింది. తర్వాతి ఓవర్లోనే జాక్‌ క్రాలీని హ్యారిస్‌ రౌఫ్‌ బౌల్డ్‌ చేశాడు.


దారుణంగా పాక్‌ బౌలింగ్‌


వికెట్లు పడ్డ సంతోషం పాక్‌కు ఎక్కువసేపు నిలవలేదు. వన్‌డౌన్‌లో వచ్చిన ఒలీ పోప్‌ (108; 104 బంతుల్లో 14x4, 0x6), హ్యారీ బ్రూక్‌ (101*) సెంచరీలు కొట్టేశారు. పాక్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. టీ20లను మించి దూకుడుగా బ్యాటింగ్‌ చేశారు. బ్రూక్‌ 122 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టేందుకు ప్రయత్నించాడు. అత్యంత వేగంగా టెస్టు సెంచరీ చేసిన ఆంగ్లేయుడిగా నిలిచే అవకాశాన్ని 4 బంతుల తేడాతో చేజార్చుకున్నాడు. ఇక క్రాలీ ఇంగ్లాండ్‌ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఓపెనర్‌గా అవతరించాడు. 70వ ఓవర్లో పోప్‌ను మహ్మద్‌ అలీ ఔట్‌ చేశాడు. జోరూట్‌ (23) భారీ స్కోరు చేయలేదు.