South Africa Journey In World Cup: భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ పతాకస్థాయికి చేరింది. ఇక సెమీఫైనల్లో తలపడే జట్లేవో కూడా తేలిపోయింది. తొలి సెమీస్‌లో టీమిండియాతో న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోవడం దాదాపుగా ఖాయమైంది. ఇక రెండో సెమీస్‌లో అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది. ప్రపంచకప్‌లో దురదృష్ట జట్టుగా ముద్రపడిన సఫారీలు ఈసారి ఆ ముద్రను చెరిపేసి ఫైనల్లో అడుగుపెట్టాలని పట్టుదలగా ఉన్నారు. ఇప్పుడు ప్రొటీస్ జట్టు జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు.. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లు. నిప్పులు చేరిగే ఫాస్ట్ బౌలర్లు. కళ్లు చెదిరే ఫీల్డర్లు ఉన్నారు. ఈ ప్రపంచకప్‌లో లీగ్ దశలో ఆసిస్‌ను సఫారీ జట్టు చిత్తుచిత్తుగా ఓడించింది. లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ విఫలమైన కంగారూ జట్టు.. ఘోర పరాభావాన్ని మూటకట్టుకుంది. 312 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ కేవలం 177 పరుగులకే కుప్పకూలింది. ఇదే జోరును సెమీస్‌లోనూ కనబర్చి ఫైనల్ చేరాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది.
49 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకూ ఒక్కసారి కూడా దక్షిణాఫ్రికా ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది. నాలుగు సార్లు సెమీఫైనల్‌కు చేరినా వరల్డ్‌కప్ టైటిల్‌ను ముద్దాడ లేకపోయింది. వరల్డ్‌కప్ మ్యాచుల్లో లీగ్‌ల్లో అద్భుతంగా రాణించే దక్షిణాఫ్రికా.. కీలక నాకౌట్ మ్యాచ్‌ల్లో అదృష్టం కలిసిరాక ఇంటిదారి పడుతుంటుంది. గత 27 ఏళ్లగా వరల్డ్‌కప్ కోసం ప్రోటీస్ పోరాడుతూనే ఉంది. మరోసారి ప్రపంచకప్ ట్రోఫీ లక్ష్యంగా భారత గడ్డపై సఫారీలు అడుగుపెట్టారు. తొలి దశను గతంలో ఎప్పుడూ లేనంత ఆత్మ విశ్వాసంతో ముగించారు. ఇక మిగిలింది సెమీస్. ఆ దశను కూడా దాటేస్తే తొలిసారి ప్రొటీస్ ప్రపంచకప్ పైనల్లో అడుగుపెట్టడం ఖాయమే.
ఆ మ్యాచ్‌ను మర్చిపోగలమా....
ఇంగ్లండ్ వేదికగా జరిగిన 1999 వరల్డ్ కప్‌లో కూడా దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌ల్లో ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్‌ను ప్రపంచకప్ చరిత్రలోనే అత్యద్భుత మ్యాచ్‌గా వర్ణిస్తారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 213 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ వా, మైఖేల్ బెవాన్ హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ప్రోటీస్ 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జాక్వెస్ కల్లిస్(53),జాంటీ రోడ్స్(43) తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో జట్టును విజయ తీరాల వైపు నడిపారు. ఆఖరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయానికి 9 పరుగులు అవసరం. స్టార్ ఆల్‌రౌండర్ లాన్స్ క్లూసెనర్ క్రీజులో ఉన్నాడు. కానీ ప్రోటీస్ చేతిలో కేవలం ఒకే వికెట్ ఉంది. క్రీజులో క్లూసెనర్‌తో పాటు అలన్ డోనాల్డ్ ఉన్నాడు. అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ. ఆఖరి ఓవర్‌లో డామియన్ వేసిన మొదటి రెండు బంతులను క్లూసెనర్ బౌండరీలకు తరిలించాడు. దీంతో స్కోర్లు సమయ్యాయి. ప్రోటీస్ విజయానికి 4 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే అవసరమైంది. ఇక్కడే ఎవరూ ఊహించని ట్విస్ట్ జరిగింది. మూడో బంతికి సింగిల్ ప్రయత్నించగా.. రనౌట్ అవకాశం మిస్ అయ్యింది. నాలుగో బంతికి క్లూసెనర్ సింగిల్ కోసం నాన్ స్ట్రైకర్స్ ఎండ్ వైపు పరిగెత్తగా.. అలన్ డోనాల్డ్ మాత్రం బంతిని చూస్తూ ఉండిపోయాడు. ఈ క్రమంలో ఇద్దరూ నాన్ స్ట్రైకర్స్ ఎండ్‌లో ఉండిపోయారు. వెంటనే గిల్‌క్రిస్ట్ స్టంప్స్‌ను పడగొట్టాడు. మ్యాచ్ టై అయింది. రన్‌రేట్ ఆధారంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు క్వాలిఫై అయింది.
ఈసారి కథ మార్చాలనే పట్టుదలతో..
ఇక ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన సౌతాఫ్రికా ఈసారి ఎలాగైన కప్పు కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది. అనుకున్నట్లుగానే టోర్నీని ఘనంగా ఆరంభించింది. ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు సఫారీ జట్టు బ్యాటర్లు 82 సిక్స్‌లు కొట్టారు. దీంతో 2019 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ పేరిట ఉన్న 76 సిక్స్‌ల రికార్డును దక్షిణాఫ్రికా అధిగమించింది. ఇప్పుడు సెమీస్‌లోనూ ఇదే ప్రదర్శనతో ఆసిస్‌ను మట్టికరిపించి పైనల్లో అడుగుపెట్టాలని సఫారీ జట్టు చూస్తోంది.