ODI World Cup 2023: అక్టోబర్ నుంచి భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌కు సమయం ముంచుకొస్తున్న వేళ  టీమిండియాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే  జట్టు కూర్పుతో పాటు 15 మంది సభ్యులలో  ఎవరిని జట్టులో ఉంచాలి..? ఎవరిని తీసేయాలి..? అన్నదానిపై ఇంకా  క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో   టీమిండియా మాజీ  సారథి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. 15 మంది సభ్యులతో కూడిన జట్టును  ప్రకటించాడు.  రోహిత్ శర్మ నేతృత్వంలోని ఈ జట్టులో ఐదుగురు బ్యాటర్లు ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లు, ముగ్గురు ఆల్ రౌండర్లు,  ఒక స్పిన్నర్, నలుగురు పేసర్లకు ఛాన్స్ ఇచ్చాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఎంట్రీ ఇచ్చి  విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న  తిలక్ వర్మకు దాదా జట్టులో చోటు దక్కలేదు. 


ఆసియా కప్  నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ వేదికగా  జరిగిన  కార్యక్రమంలో గంగూలీ.. వన్డే వరల్డ్ కప్‌కు తన జట్టును ప్రకటించాడు.  బ్యాటర్లుగా  రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌లకు ఛాన్స్ ఇచ్చిన  దాదా.. వికెట్ కీపర్ బ్యాటర్లుగా కెఎల్ రాహుల్,  ఇషాన్ కిషన్‌లను  జట్టులో చోటు కల్పించాడు. 


ఇక ఆల్ రౌండర్లుగా హార్ధిక్ పాండ్యా,  రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లకు చోటిచ్చిన దాదా స్పిన్నర్‌గా మాత్రం యుజ్వేంద్ర  చాహల్‌ను పక్కనబెట్టి మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు ఛాన్స్ ఇచ్చాడు.  గంగూలీ తన టీమ్‌లో నలుగురు పేసర్లకు అవకాశం కల్పించాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాతో పాటు హైదరాబాదీ మహ్మద్ సిరాజ్,  మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్‌లకు ఛాన్స్ ఇచ్చాడు.  


 






వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో నిలకడగా రాణించి ఆసియా కప్‌లో కూడా చోటు దక్కించుకున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మను ప్రపంచకప్‌కు కూడా ఎంపిక చేయాలని   టీమిండియా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్న వేళ దాదా.. తిలక్ వర్మకు చోటు కల్పించలేదు.  అయితే  15 మంది సభ్యులలో మిడిలార్డర్‌లో ఎవరైనా బ్యాటర్ గాయపడితే మాత్రం ఆ ఆటగాడి స్థానంలో  తిలక్ వర్మను ఎంపిక చేయాలని  సూచించాడు.  ఇక నలుగురు పేసర్లలో ఎవరైనా గాయపడితే ప్రసిధ్ కృష్ణను  జట్టులోకి తీసుకోవాలని తెలిపాడు. మరి దాదా  సూచనలను టీమిండియా మేనేజ్‌మెంట్, ఆలిండియా సెలక్షన్ కమిటీ ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటుందో చూడాలి. 


గంగూలీ వరల్డ్ కప్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా,  రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ 






ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial