ENG vs NZ, ODI WC 2023: 


ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 ఆరంభ మ్యాచు హోరాహోరీగా సాగుతోంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ను రన్నరప్‌ న్యూజిలాండ్‌ బాగానే కట్టడి చేసింది. భీకరమైన ఆంగ్లేయ జట్టును 50 ఓవర్లలో 282/9కు కట్టడి చేసింది. మ్యాట్‌ హెన్రీ (3/48), మిచెల్‌ శాంట్నర్‌ (2/37), గ్లెన్‌ ఫిలిప్స్‌ (2/17) చక్కని బౌలింగ్‌ చేశారు. మాజీ కెప్టెన్‌ జో రూట్‌ (77; 86 బంతుల్లో 4x4, 1x6) అర్ధశతకంతో ఇంగ్లాండ్‌ను ఆదుకున్నాడు. కెప్టెన్‌ జోస్‌ బట్లర్ (43; 42 బంతుల్లో 2x4, 2x6) దూకుడుగా ఆడాడు.


కనిపించని దూకుడు


టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ ఆరంభం నుంచీ తన దూకుడు కొనసాగించలేదు. జానీ బెయిర్‌ స్టో (33) నిలకడగా ఆడగా డేవిడ్‌ మలన్‌ (14; 24 బంతుల్లో) ఇబ్బంది పడ్డాడు. జట్టు స్కోరు 40 వద్ద అతడిని హెన్రీ ఔట్‌ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన జోరూట్‌ ఆచితూచి ఆడాడు. కివీస్ బౌలర్లను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే జట్టు స్కోరు 64 వద్ద బెయిర్‌స్టోను శాంట్నర్‌ పెవిలియన్‌ పంపించాడు. వేగంగా ఆడుతున్న హ్యారీ బ్రూక్‌ (25; 16 బంతుల్లో 4x4, 1x6)ను జట్టు స్కోరు 94 వద్ద రచిన్‌ రవీంద్ర బోల్తా కొట్టించాడు. మరికాసేపటికే మొయిన్‌ అలీ (11)ని ఫిలిప్స్‌ ఔట్‌ చేశాడు.


ఆదుకున్న రూట్‌, బట్లర్‌


ఇంగ్లాండ్‌ 118 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకోవడంతో జోరూట్‌, కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 72 బంతుల్లో 70 పరుగుల భాగస్వామ్యం అందించారు. రూట్‌ ఆచితూచి ఆడగా బట్లర్‌ సమయోచిత దూకుడు ప్రదర్శించాడు. వీరిద్దరూ అలాగే నిలిస్తే ఇంగ్లాండ్‌ భారీ స్కోరు చేసేదే. జట్టు స్కోరు 188 వద్ద రూట్‌ను ఫిలిప్స్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేసి బ్రేకిచ్చాడు. లియామ్‌ లివింగ్‌స్టన్‌ (20) సైతం స్వల్ప స్కోరుకే ఔటయ్యాడు. ఆ తర్వాత లోయర్‌ మిడిలార్డర్‌ ఎక్కువ పరుగులు చేయలేకపోయింది. దాంతో ఇంగ్లాండ్‌ 50 ఓవర్లకు 282/9తో నిలిచింది.