ప్రపంచకప్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ చతికిలపడింది. ప్రపంచకప్‌లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. శ్రీలంక బౌలర్ల ధాటికి కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన బ్రిటీష్ బ్యాట్స్‌మెన్లను... లంక బౌలర్లు క్రీజులో కుదురుకోనివ్వలేదు. ఆరంభంలో శుభారంభం లభించినా ఆ తర్వాత ఇంగ్లండ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. తొలి వికెట్‌కు జానీ బెయిర్ స్టో- డేవిడ్ మలన్ 45 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ భాగస్వామ్యాన్ని విడదీసిన మాథ్యూస్ ఇంగ్లండ్ పతనాన్ని ప్రారంభించాడు. 25 బంతుల్లో 6 ఫోర్లతో 28 పరుగులు చేసిన డేవిడ్ మలన్‌ను మాధ్యూస్ అవుట్ చేశాడు.
ఇక అప్పటినుంచి బ్రిటీష్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన జో రూట్ కేవలం 3 పరుగులకే రనౌట్ అవ్వడంతో 57 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వికెట్ల పతనం కాసేపు ఆగింది. గత ప్రపంచకప్ హీరో బెన్ స్టోక్స్... జట్టును మళ్లీ గాడిన పెట్టేందుకు ప్రయత్నించాడు. కానీ 31 బంతుల్లో 3 ఫోర్లతో క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించిన జానీ బెయిర్ స్టోను రజిత అవుట్ చేశాడు. దీంతో 68 పరుగుల వద్ద బ్రిటీష్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది.
68 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను లాహిరో కుమారా కోలుకోలేని దెబ్బకొట్టాడు. మొదటి ఎనిమిది పరుగులు చేసిన జోస్ బట్లర్‌ను అవుట్ చేసిన లాహిరో కుమారా.... ఆ తర్వాత ఒక్క పరుగే చేసిన లివింగ్‌స్టోన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 68 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి పర్వాలేదనిపించే స్థితిలో ఉన్న బ్రిటీష్ జట్టు ఒక్కసారిగా 85 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత మొయిన్ అలీతో కలిసి బెన్ స్టోక్స్ జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. ఇన్నింగ్స్ గాడిన పడుతున్న సమయంలో 15 బంతుల్లో 15 పరుగులు చేసిన మొయిన్ అలీని మాధ్యూస్ అవుట్ చేశాడు. అనంతరం క్రిస్ వోక్స్ రజిత బౌలింగ్ డకౌట్ అవుటయ్యాడు. ఆదుకుంటాడని గంపెడు ఆశలు పెట్టుకున్న బెన్ స్టోక్స్‌ను కుమారా అవుట్ చేశాడు. 73 బంతుల్లో 6 ఫోర్లతో 43 పరుగులు చేసిన స్టోక్స్.. కుమారా బౌలింగ్‌లో హేమంతకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 137 పరుగులకు బ్రిటీష్ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయింది. తర్వాత అదిల్ రషీద్, మార్క్ వుడ్ స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో ఇంగ్లండ్ 33.2 ఓవర్లలో కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. డేవిడ్ విల్లి 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఒకే ఒక్క సిక్స్ కొట్టగా అది కూడా డేవిడ్ లిల్లినే కొట్టడం విశేషం. నెమ్మదిగా ఉన్న పిచ్‌పై బ్యాటింగ్ చేసేందుకు బ్రిటీష్ జట్టు తీవ్రంగా తడబడింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం అర్ధ శతకం కూడా చేయలేదు. అయిదుగురు బ్యాటర్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. లంక బౌలర్లు సమష్టిగా రాణించారు. లాహీరో కుమారా 7 ఓవర్లు బౌలింగ్ చేసి 35 పరుగులు ఇచ్చి 3 వికెట్లు నెలకూల్చాడు. కాసున్ రజిత 2, ఏంజెలో మాధ్యూస్ 2, తీక్షణ ఒక వికెట్ తీశారు.
బ్యాట్‌పైకి బాల్ నెమ్మదిగా వస్తున్న పిచ్‌పై బ్రిటీష్ బౌలర్లు ఏమైనా అద్భుతం చేస్తారేమో చూడాలి. 156 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ కాపాడుకుంటుంతో లేదా డిఫెండింగ్ ఛాంపియన్ నాకౌట్‌కు కూడా చేరకుండా వెనుదిరుగుతుందో వేచి చూడాలి. ఈ మ్యాచ్‌లో ఎవరైతే ఓడిపోతారో వాళ్లు ప్రపంచకప్ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ప్రపంచకప్‌లో పాయింట్ల పట్టికలో ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్న ఇంగ్లండ్.. శ్రీలంక జట్లకు సెమీస్ ఆశలు ఇంకా సజీవంగా ఉండాలంటే గెలుపు తప్పనిసరి. మరోసారి ప్రపంచకప్ దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రారంభంలో అంచనా వేసిన బ్రిటీష్ జట్టు.. ఇప్పుడు ఈ ప్రపంచకప్‌లో ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో ఉంది. శ్రీలంక కూడా అదే పరిస్థితిలో ఉంది. ఇప్పటివరకూ శ్రీలంక నాలుగు మ్యాచ్‌లు అడి ఒక విజయం, మూడు పరాజయాలతో రెండు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉండగా అన్నే మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లాండ్ రెండే పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. లంక కంటే తక్కువ రన్‌రేట్‌తో బ్రిటీష్ జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని... ఆత్మవిశ్వాసం పోగు చేసుకుని ముందుకు సాగాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.