గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సునామీల డచ్‌ జట్టుపై విరుచుకుపడిన వేళ... డేవిడ్‌ వార్నర్‌ మరోసారి శతక గర్జన చేసిన సమయాన... పసికూన నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. ఈ ప్రపంచకప్‌లో ఆరంభంలో తడబడ్డా.. తర్వాత వరుస విజయాలతో ఊపుమీదున్న కంగారులు... డచ్‌ జట్టుపై నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు చేశారు. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ప్రపంచకప్‌లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసి నెదర్లాండ్స్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. 44 బంతుల్లో 9 ఫోర్లు, ఎనిమిది సిక్సులతో మ్యాక్స్‌ వెల్‌ 106 పరుగులు చేశాడు. గ్లెన్‌ చేసిన 106 పరుగుల్లో 84 రన్స్‌ బౌండరీల రూపంలోనే వచ్చాయంటే విధ్వంసం ఎలా సాగిందో చెప్పొచ్చు. మ్యాక్స్‌ వెల్‌ విధ్వంసకర శతకానికి తోడు పాకిస్థాన్‌పై భారీ సెంచరీతో చెలరేగిన డేవిడ్‌ బాయ్‌... ఈ మ్యాచ్‌లోనూ శతక నాదం చేశాడు. డేవిడ్‌ వార్నర్‌ 93 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్సర్లతో 104 పరుగులు చేసి మరోసారి సత్తా చాటాడు. వార్నర్‌కు తోడుగా స్టీవ్‌ స్మిత్‌, లబుషేన్‌ కూడా రాణించడంతో కంగారు జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది.

 ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగింది. గత మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన మిచెల్‌ మార్ష్‌, డేవిడ్‌ వార్నర్‌ తొలి వికెట్‌కు 28 పరుగులు నమోదు చేశారు. కానీ నాలుగు ఓవర్లలో జట్టు స్కోరు 28 పరుగుల వద్ద కంగారులు తొలి వికెట్‌ కోల్పోయారు. 15 బంతుల్లో తొమ్మిది పరుగులు చేసిన మిచెల్‌ మార్ష్‌ను వాన్‌ బీక్‌ అవుట్‌ చేశాడు. మిచెల్‌ మార్ష్‌ అవుటైనా డేవిడ్‌ వార్నర్‌ తన ఫామ్ కొనసాగించాడు. సమయోచితంగా బ్యాటింగ్‌ చేసిన డేవిడ్‌ బాయ్‌.... స్టీవ్‌ స్మిత్‌తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 132 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ ప్రపంచకప్‌లో తొలిసారి స్మిత్‌ ఆత్మ విశ్వాసంతో కనపడ్డాడు. సెంచరీ దిశగా సాగుతున్న స్టీవ్‌ స్మిత్‌ను 71 పరుగుల వద్ద ఆర్యన్‌ దత్త్‌ అవుట్‌ చేశాడు. 68 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సుతో స్మిత్‌ 71 పరుగులు చేశాడు. 160 పరుగుల వద్ద కంగారు జట్టు రెండో వికెట్‌ కోల్పోయింది. స్మిత్‌ అవుటైనా లబుషేన్‌తో కలిసి వార్నర్‌ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. సమయం చిక్కినప్పుడల్లా భారీ షాట్లు ఆడిన వార్నర్‌....  93 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్సర్లతో 104 పరుగులు చేసి వాన్‌ బీక్‌ బౌలింగ్‌ అవుట్‌ అయ్యాడు. వరుసగా రెండో శతకం సాధించి వార్నర్‌ సత్తా చాటాడు. వార్నర్‌ అవుటైన తర్వాత లబుషేన్‌ తన సహజ స్వభావానికి విరుద్ధంగా ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో లబుషేన్‌ 62 పరుగులు చేశాడు. ధాటిగా బ్యాటింగ్‌ చేస్తున్న లబుషేన్‌ను డీ లీడే అవుట్‌ చేశాడు. ఎనిమిది పరుగులు చేసిన కామోరూన్‌ గ్రీన్‌ ఎనిమిది పరుగులకే రనౌట్‌ రూపంలో వెనుదిరగగా ఇంగ్లిస్‌ కూడా 14 పరుగులకే పెవిలియన్‌ చేరాడు.

 వరుసగా వికెట్లు పడుతున్న వేళ.... గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ భారీ ఇన్నింగ్స్‌ ఆడని మ్యాక్స్‌వెల్‌.... సునామీలా డచ్‌ జట్టుపై విరుచుకుపడ్డాడు. నెదర్లాండ్స్‌ బౌలర్లను  ఊచకోత కోశాడు. దొరికిన బంతిని దొరికినట్లు బాది పడేశాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని సాధించాడు. మ్యాక్స్‌ వెల్‌ సునామీ ఇన్నింగ్స్‌కు ఆస్ట్రేలియా స్కోరు బోర్డు జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోయింది. కేవలం 44 బంతులో ఎదుర్కొన్న మ్యాక్స్‌వెల్‌ 9 ఫోర్లు, 8 సిక్సులతో 106 పరుగులు చేశాడు. అసలు 350 అయినా దాటుతుందా అన్న కంగారుల స్కోరు బోర్డు... గ్లెన్‌ విధ్వంసంతో 399 పరుగులకు చేరింది. డచ్‌  బౌలర్లలో వాన్‌బీక్‌ ఒక్కడే నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. బాస్‌ డీ లీడే రెండు వికెట్లు పడగొట్టగా... ఆర్యన్‌ దత్త్‌ ఒక్క వికెట్‌ తీశాడు.  ఆస్ట్రేలియాపై నెదర్లాండ్స్‌ 400ల లక్ష్యాన్ని చేధించడం దాదాపు అసాధ్యమని మాజీలు అంచనా వేస్తున్నారు. అయితే కంగారులు ఎంత వ్యత్యాసంతో తేడా సాధిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. నెదర్లాండ్స్‌ ఇప్పటివరకూ వన్డేల్లో ఆస్ట్రేలియాను ఎన్నడూ ఓడించలేదు. 2003, 2007లోఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయారు.