South Africa vs Australia Semi Final Match IN World Cup 2023: ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(South Africa)కు మరోసారి అదృష్టం కలిసి రాలేదు. లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో మరోసారి ప్రొటీస్‌ను ఓడించి ఆస్ట్రేలియా(Australia)  ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఆదివారం టీమిండియాతో ఆస్ట్రేలియా  టైటిల్‌ కోసం తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా మరోసారి తడబడింది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగిపోయిన వేళ ప్రొటీస్‌  49.4  ఓవర్లలో 212 పరుగులకే పరిమితమైంది. అనంతరం ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి... 16 బంతులు మిగిలి ఉండగా అతి కష్టం మీద లక్ష్యాన్ని ఛేదించింది. ఎప్పటిలాగే తక్కువ స్కోరు చేసినా సౌతాఫ్రికా పోరాటం క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకుంది. 


పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలిస్తుందన్న అంచనాలు ఉన్నా గత రికార్డును దృష్టిలో పెట్టుకుని టాస్‌ గెలవగానే దక్షిణాఫ్రికా కెప్టెన్‌ బవూమా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అది ఎంత పెద్ద తప్పుడు నిర్ణయమో ప్రొటీస్‌కు తొలి ఓవర్‌లోనే అర్థమైంది. తొలి ఓవర్‌ ఆఖరి బంతికి బవుమాను స్టార్క్‌ బలికొన్నాడు. 4 బంతులాడి ఒక్క పరుగు కూడా చేయని బవుమా కీపర్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఒక్క పరుగుకే దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ప్రొటీస్‌ బ్యాటర్లు ఆచితూచి ఆడారు. డికాక్ 14 బంతుల్లో మూడు పరుగులు చేసి అవుటయ్యాడు. గంపెడు ఆశలు పెట్టుకున్న మార్క్రమ్‌, డస్సెన్‌ వెంటవెంటనే అవుట్‌ అవ్వడంతో దక్షిణాఫ్రికా పనైపోయింది. 6 పరుగులు చేసిన డస్సెన్‌,  10 పరుగులు చేసి మార్‌క్రమ్‌ అవుటైపోయారు. దీంతో 24 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ డేవిడ్‌ మిల్లర్‌, క్లాసెన్‌ దక్షిణాఫ్రికాను ఆదుకున్నారు. వీరిద్దరి భాగస్వామ్యం బలపడుతున్న దశలో 47 పరుగులు చేసిన క్లాసెన్‌ను హెడ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 


క్లాసెన్‌ అవుటైనా మిల్లర్‌ ఒంటరి పోరాటం ఆపలేదు. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేసి మిల్లర్‌ అవుటయ్యాడు. ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచుల్లో సెంచరీ చేసిన తొలి దక్షిణాఫ్రికా బ్యాటర్‌గా మిల్లర్‌ రికార్డు సృష్టించాడు. మిల్లర్‌ పోరాటంతో ప్రొటీస్‌  49.4  ఓవర్లలో 212 పరుగులకు ఆలౌట్‌ అయింది . ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌ 3, హాజిల్‌ వుడ్‌ 2, కమిన్స్‌ 3, హెడ్‌ 2 వికెట్లు తీశారు. ఆడమ్‌ జంపా 7 ఓవర్లలోనే 55 పరుగులు ఇచ్చాడు. 


213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు డేవిడ్‌ వార్నర్‌-ట్రావిస్ హెడ్ అదిరే ఆరంభం ఇచ్చారు. వరుసగా సిక్సులు ఫోర్లు కొడుతూ స్కోరును తేలిక చేసేశారు. ఈ ఆస్ట్రేలియా ఓపెనర్లు ఆరు ఓవర్లలోనే 60 పరుగులు జోడించడంతో 212 పరుగుల లక్ష్యం తేలిగ్గా మారిపోయింది. ఆస్ట్రేలియా విజయం తేలికే అని అంతా అనుకున్నా దక్షిణాఫ్రికా అద్భుతంగా పోరాడింది. 60 పరుగుల వద్ద 18 బంతుల్లో 1 ఫోరు, 4 సిక్సులు కొట్టిన వార్నర్‌  అవుటయ్యాడు. అదే స్కోరు వద్ద మార్ష్‌ కూడా అవుటయ్యాడు. దీంతో 61 పరుగులకు ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయింది. కానీ స్టీవ్ స్మిత్‌, ట్రావిస్‌ హెడ్‌  ఆసిస్‌ను విజయం దిశగా నడిపించారు. కానీ 48 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 62 పరుగులు చేసిన ట్రావిస్‌ హెడ్‌ వెనుదిరిగాడు. మ్యాక్స్‌వెల్‌ ఒక్క పరుగుకు... స్మిత్‌ 30 పరుగులకు అవుటవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారిపోయింది. కానీ ఇంగ్లిస్‌ పోరాడడం... దక్షిణాఫ్రికా క్యాచులు జారవిడవడంతో ఆస్ట్రేలియా ఏడు వికెట్లు కోల్పోయి అతి కష్టం మీద విజయాన్ని సాధించింది. ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి... 16 బంతులు మిగిలి ఉండగా అతి కష్టం మీద లక్ష్యాన్ని ఛేదించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో షంసీ 2, కోయిట్జే 2 వికెట్లు  తీశారు.