ODI World Cup 2023: నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని సామెత. క్రికెట్‌లో ఈ సామెత ఆటగాళ్లకు కూడా బాగా పనికొస్తుంది. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని జట్టు సారథిపై, మేనేజ్‌మెంట్, అంతర్గత విషయాలపై ఇష్టమొచ్చినట్టు వాగితే అప్పుడు సదరు ఆటగాడికి తప్పదు భారీ మూల్యం. ఇలా నోటికొచ్చినట్టు వాగి జట్టులో చోటు కోల్పోయినవాళ్లు చాలామందే ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో పాకిస్తాన్ స్పిన్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ కూడా చేరనున్నట్టు తెలుస్తున్నది. పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్‌ను ఉద్దేశిస్తూ అతడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పాక్ క్రికెట్‌లో కలకలం సృష్టిస్తున్నాయి. దీంతో హర్ట్ అయిన బాబర్, సెలక్టర్లు షాదాబ్ ఖాన్‌ను వరల్డ్ కప్ జట్టు నుంచి పంపించేందుకు సిద్ధమైనట్టు పాకిస్తాన్ మీడియా చెవులు కొరుక్కుంటున్నది.
అసలు విషయానికొస్తే.. ఇటీవలే ఆసియా కప్‌లో ఓటమి తర్వాత పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో బాబర్ ఆజమ్, షహీన్ షా అఫ్రిది మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. జట్టులో సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల బాబర్ నిరాశ వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ఇందులో షాదాబ్ ఖాన్ కూడా ఉన్నాడని సమాచారం.
బాబర్, షహీన్‌ల వాగ్వాదానికి సంబంధించిన చర్చ ఇంకా కొనసాగుతుండగానే షాదాబ్ ఖాన్ నిన్న ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘ఆన్‌ఫీల్డ్‌లో బాబర్ కెప్టెన్సీని మేం పెద్దగా ఎంజాయ్ చేయలేం. ఫీల్డ్ లోకి దిగగానే బాబర్ పూర్తిగా మారిపోతాడు. మ్యాచ్ అయిపోయేదాకా అతడు అదే మూడ్‌లో ఉంటాడు. కానీ ఆఫ్ ఫీల్డ్‌లో మాత్రం బాబర్‌తో భలే సరదాగా ఉంటుంది..’అని కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలను షాదాబ్ ఖాన్ ఏ ఉద్దేశంతో అన్నాడో గానీ జట్టులో విభేదాల చర్చకు ఇవి అగ్నికి వాయువు తోడైనట్టుగా యాడ్ అయ్యాయి.
షాదాబ్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దాకా వెళ్లాయి. నిన్న బాబర్ ఆజమ్.. పాక్ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్‌తో సమావేశమయ్యాడు. వరల్డ్ కప్ టీమ్ గురించి ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. జియో న్యూస్ కథనం ప్రకారం.. ‘వాళ్ల మీటింగ్‌లో చీఫ్ సెలక్టర్, కెప్టెన్‌లు ఫిట్‌నెస్‌తో బాధపడుతున్న ఆటగాళ్లు, పేలవ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను మార్చాలనే ఆలోచనలో ఉన్నారు ’ అని సమాచారం. ఇది షాదాబ్ ఖాన్‌ను జట్టులోంచి పంపించేందుకు ఇచ్చిన హింట్ అని పాకిస్తాన్ మీడియా కోడై కూస్తోంది. షాదాబ్ ఖాన్ ప్లేస్‌లో యువ స్పిన్నర్ అబ్రర్ అహ్మద్‌ను తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. అబ్రర్ గతేడాది పాకిస్తాన్ టీమ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ యువ లెగ్ స్పిన్నర్ ఆరు టెస్టులలోనే ఏకంగా 38 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పై అద్భుతంగా రాణించాడు. భారత్‌లో స్పిన్ పిచ్‌లను దృష్టిలో ఉంచుకుని షాదాబ్ కంటే అబ్రర్‌ను తీసుకుందే బెటర్ అనే ఆలోచనలో బాబర్, సెలక్షన్ కమిటీ ఉన్నట్టు పీసీబీ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
ఇదే జరిగితే మాత్రం పాకిస్తాన్ జట్టు మరింత బలహీనపడ్డట్టే. ఇదివరకే ఆసియా కప్‌లో గాయపడ్డ నసీమ్ షా వరల్డ్ కప్ మొత్తానికి దూరం కానున్నాడు. హరీస్ రౌఫ్ ఇంకా కోలుకోలేదు. అఘా సల్మాన్ గాయంపై ఇంకా అప్డేట్ లేదు. తాజాగా బంతితో పాటు బ్యాట్ తోనూ మెరిసే షాదాబ్ లేకపోవడం పాక్‌కు ఎదురుదెబ్బే. అయితే ఆసియా కప్‌లో షాదాబ్ ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. నాలుగు మ్యాచ్‌లలో షాదాబ్ తీసింది 3 వికెట్లు. భారత్‌తో సూపర్ - 4 మ్యాచ్‌లో అతడి బౌలింగ్‌ను రోహిత్, కోహ్లీ, కెఎల్ రాహుల్ ఆటాడుకున్నారు. బ్యాటింగ్‌లోనూ అతడి వైఫల్యం కొనసాగింది. అయితే జట్టు నుంచి తొలగించకపోయినా వైస్ కెప్టెన్సీ అయినా తీసేసి దానిని షహీన్ అఫ్రిదికి అప్పగించే అవకాశాలున్నాయని సమాచారం.