ప్రపంచకప్‌ (ODI World Cup 2023)లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు శతకాల మోత మోగించడంతో పాటు రికార్డుల మోత కూడా మోగించారు. తొలి వికెట్‌కు 259 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పిన డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌ కంగారు జట్టుకు భారీ స్కోరు అందించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను కూడా నమోదు చేశారు. ప్రపంచకప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో సెంచరీలు సాధించిన ఓపెనింగ్‌ జోడిగా వార్నర్‌-మిచెల్ మార్ష్‌ రికార్డు సృష్టించారు. ప్రపంచకప్‌లో ఏ ఆస్ట్రేలియా ఓపెనింగ్ జోడీ కూడా ఇంతవరకు శతకాలు నమోదు చేయలేదు. 259 పరుగుల రికార్డు భాగస్వామ్యం.. ప్రపంచకప్‌ చరిత్రలో రెండో అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం. ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా జోడీ నమోదు చేసిన అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కూడా ఇదే.

డేవిడ్ వార్నర్‌కు పాకిస్థాన్‌పై వరుసగా ఇదో నాలుగో సెంచరీ. విరాట్‌ కోహ్లీ తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా వార్నర్‌ రికార్డు సృష్టించాడు. ఈ శతకంతో ప్రపంచకప్ మ్యాచుల్లో వార్నర్‌ అయిదో సెంచరీలను పూర్తి చేసుకున్నాడు. రికీ పాంటింగ్‌తో పాటు కలిసి అత్యధిక ప్రపంచ కప్ సెంచరీలు సాధించిన ఆస్ట్రేలియా క్రికెటర్‌గా వార్నర్‌ నిలిచాడు. రికి పాంటింగ్‌ కూడా ప్రపంచకప్‌లో అయిదు శతకాలు చేశాడు. 

 

వార్నర్‌ మూడోసారి...

ప్రపంచకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆస్ట్రేలియా ఆటగాడిగా మూడోసారి డేవిడ్‌ వార్నర్‌ నిలిచాడు. 2015, 2019 ప్రపంచకప్‌లలో వరుసగా 178, 166 పరుగులు చేసిన వార్నర్‌ తాజాగా 163 పరుగులు చేయడం గమనార్హం. 

 

పుట్టినరోజు నాడు సెంచరీ చేసిన తొలి ఆస్ట్రేలియన్‌

మిచెల్‌ మార్ష్ తన పుట్టినరోజును భారీ సెంచరీతో ఘనంగా జరుపుకున్నాడు. వన్డే చరిత్రలో శతకం సాధించిన ఆరో ఆటగాడిగా మార్ష్‌ నిలిచాడు. పుట్టినరోజు నాడు ఈ ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియన్ మార్ష్ ఒక్కడే. రాస్ టేలర్ కూడా ప్రపంచకప్‌లో పుట్టినరోజున సెంచరీ సాధించాడు. టేలర్‌ తర్వాత జన్మదినం రోజు ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన రెండో ఆటగాడు మార్షే. వార్నర్-మార్ష్‌ నెలకొల్పిన 200 పరుగులకుపైగా భాగస్వామ్యం ప్రపంచకప్‌లో కేవలం అయిదోది. వన్డేల్లో ఆస్ట్రేలియా అత్యధిక సిక్స్‌లు 19 కొట్టిన ఇన్నింగ్స్‌గానూ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ నిలిచింది.

 

వన్డే ప్రపంచకప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు నమోదైన మూడో మ్యాచ్‌ ఇది. 2019లో మాంచెస్టర్‌ వేదికగా జరిగిన ఇంగ్లాండ్‌ vs అఫ్గాన్‌ మ్యాచ్‌లో అత్యధికంగా 25 సిక్స్‌లు.. 2015లో వెస్టిండీస్‌ vs జింబాబ్వే (కాన్‌బెర్రా) మ్యాచ్‌లో 19 సిక్స్‌లు నమోదయ్యాయి.  ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు ఇది ఐదో అత్యుత్తమ స్కోరు. 2015లో పెర్త్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్‌పై 417/6 పరుగులు చేసింది. పాక్‌ బౌలర్‌ ఉసామా మీర్‌ ఓ చెత్త రికార్డు తన పేర లిఖించుకున్నాడు. ప్రపంచకప్‌లో టోర్నీలో 80 అంతకన్నా ఎక్కువ పరుగులు సమర్పించుకున్న పాక్‌ బౌలర్లలో ఒకడిగా ఉసామా మిర్‌ నిలిచాడు. 1 వికెట్‌ తీసిన అతడు 82 పరుగులు ఇచ్చాడు. ఇక ఈ మ్యాచులో డేవిడ్‌ వార్నర్‌ 140 బంతులుఎదుర్కొని 168 పరుగులు చేశాడు. 108 బంతులు ఎదుర్కొన్న మిచెల్‌ మార్ష్‌  10 భారీ సిక్సులు, 9 ఫోర్లతో 121 పరుగులు చేశాడు. వార్నర్‌, మిచెల్ మార్షల్  విధ్వంసంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 367పరుగులు చేసింది.