ICC Rankings: వన్డే ప్రపంచకప్‌లో సత్తా చాటిన టీమిండియా(Team India) ఆటగాళ్లు.. వన్డే ర్యాంకిగ్స్‌లోనూ సత్తా చాటారు. ఐసీసీ వన్డే (ICC ODI Rankings) బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 4లో ముగ్గురు భారత ఆటగాళ్లే ఉన్నారు. చాలా కాలం తర్వాత టాప్ 4లో ముగ్గురు టీమిండియా బ్యాటర్లు స్థానం దక్కించుకున్నారు. తాజాగా విడుదలైన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(Subhaman Gill) అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. గిల్ 826 రేటింగ్ పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌(Babar Azam) రెండో  స్థానంలో ఉన్నాడు. 824 పాయింట్లతో బాబర్‌ రెండో స్థానంలో ఉండగా... గిల్‌కు బాబర్‌కు మధ్య కేవలం రెండే పాయింట్ల తేడా ఉంది. వచ్చే నెలలో భారత్ జట్టు సౌతాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్ ఆడనుంది. అక్కడ గిల్ రాణిస్తే అతని రేటింగ్ పాయింట్లు పెరగనున్నాయి.


మరోవైపు పాకిస్థాన్‌కు ఇప్పట్లో వన్డే మ్యాచ్‌లు లేవు. ప్రపంచకప్‌లో అద్భుత బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన కింగ్‌ కోహ్లీ(Virat Kohli) మూడో స్థానానికి ఎగబాకాడు. 791 రేటింగ్‌ పాయింట్లతో కోహ్లీ మూడో స్థానం కైవసం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ, ఫైనల్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు.  టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కూడా వన్డే ర్యాంకింగ్స్‌లో సత్తా చాటుతూ నాలుగో స్థానానికి ఎగబాకాడు.  నాలుగో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ ఖాతాలో 769 రేటింగ్ పాయింట్లున్నాయి.  ప్రపంచకప్‌లో చెలరేగిన సౌతాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ ఐదో స్థానంలో, న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఆరో స్థానంలో, ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ ఏడో స్థానంలో ఉన్నారు. ప్రపంచకప్‌ ఫైనల్లో సెంచరీ చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్‌ ట్రావిస్ హెడ్ 15వ స్థానానికి చేరుకున్నాడు. 


ప్రపంచకప్ ఆరంభానికి ముందు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఉన్న టీమిండియా సీమర్‌ మహ్మద్ సిరాజ్(Mahamad Siraj)  రెండు స్థానాలు దిగజారాడు. వరల్డ్ కప్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో సిరాజ్ తాజా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడిపోయాడు.  హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్.. 699 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా బుమ్రా 685 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. బౌలర్ల జాబితాలో కేశవ్‌ మహారాజ్‌.. 741 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగాజోష్‌ హెజిల్‌వుడ్‌ రెండో స్థానంలో ఉన్నాడు. 667 పాయింట్లతో కుల్‌దీప్‌ యాదవ్‌ ఆరో స్థానంలో ఉండగా మహ్మద్‌ షమీ 648 పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు. టీమిండియా నుంచి నలుగురు బౌలర్లు టాప్ 10లో ఉండడం విశేషం. ఇక మూడు ఫార్మాట్లలో భారత జట్టు నెంబర్‌ వన్‌గా కొనసాగుతోంది.


భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ ముగిసి మూడు రోజులైంది. సెమీస్ వరకు అద్భుతంగా ఆడిన టీమిండియా ఫైనల్లో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ ముగిసిన రోజు నుంచి అభిమానులంతా తీవ్ర దు:ఖంలో ఉన్నారు. మ్యాచ్ ముగిశాక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. రోహిత్ శర్మ పెవిలియన్‌కు తిరిగి వస్తుండగా అతని కళ్ల నుంచి నీళ్లు కనిపించాయి. అదే సమయంలో విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ కూడా చాలా ఎమోషనల్‌ అయినట్టు కనిపించారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇక మళ్లీ ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉండదేమో అనే బాధ అభిమానుల కలచివేస్తోంది.