Ravichandran Ashwin: బజ్ బాల్ క్రికెట్- ఇంగ్లండ్ కోచ్ గా బ్రెండన్ మెక్ కల్లమ్, కెప్టెన్ గా బెన్ స్టోక్స్ బాధ్యతలు తీసుకున్నాక తమ టెస్ట్ క్రికెట్ లో ప్రవేశపెట్టిన విధానమిది. టెస్టుల్లోనూ దూకుడుగా ఆడి ప్రత్యర్థిని దెబ్బతీయడమే బజ్ బాల్ విధానం. ఈ ఆటతీరుతో ఇంగ్లండ్ టెస్టుల్లో వరుస విజయాలు సాధిస్తోంది. ఇంగ్లండ్ జట్టు ఈ విధానం అవలంబించడం ప్రారంభించాక జో రూట్ లాంటి సాంప్రదాయ టెస్ట్ క్రికెటర్ సైతం టెస్టుల్లో దూకుడుగా ఆడుతున్నాడు. దీనివలన కచ్చితంగా వారి విజయాల శాతం పెరిగింది. తాజాగా భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ బజ్ బాల్ విధానం వల్ల ఉన్న లాభాలు, నష్టాలు, దీనిపై తన అభిప్రాయాలను వివరించాడు.
'సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో బజ్ బాల్ విధానం పనిచేస్తోంది. ప్రస్తుతం రెడ్ బాల్ క్రికెట్ లో ఈ విధానం జోరందుకుంది. ఇంగ్లండ్ జట్టు ఒక నిర్దిష్టమైన క్రికెట్ ఆడాలని కోరుకుంటోంది. దానికి వారు బజ్ బాల్ ను నిర్ణయించుకున్నారు. దీంతో దూకుడుగా ఆడుతున్నారు. అయితే కొన్ని రకాల వికెట్లపై ప్రతి బంతిని దూకుడుగా ఆడాలని ప్రయత్నించినప్పుడు తప్పులు జరుగుతాయి. కాబట్టి ఈ విధానంతో లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి.' అని అశ్విన్ అన్నాడు.
'డిఫెండ్ చేసి 100 దగ్గర ఆలౌట్ అయ్యే బదులు, దూకుడుగా ఆడి 140 వద్ద ఆలౌట్ అవ్వచ్చుగా అని కొందరు నన్ను అడుగుతారు. అయితే బజ్ బాల్ విధానం పనిచేస్తుందో లేదో మ్యాచ్ ముగిసిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. కొన్నిసార్లు షరతులను గౌరవించాల్సి ఉంటుంది. మీరు పిచ్ ను గౌరవించి అందుకు తగిన విధంగా ఆడితే.. పిచ్ మిమ్మల్ని గౌరవిస్తుంది. అది మీకు లాభిస్తుంది.' అని అశ్విన్ తెలిపాడు.
3 రోజుల్లోనే ఎందుకు?
ఆసీస్ తో రెండో టెస్ట్ ముగిసిన అనంతరం.. జట్టు సభ్యులందరూ ఢిల్లీ నుంచి విమాన ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు తోటి ప్రయాణికుడి నుంచి అశ్విన్ కు ఒక ప్రశ్న ఎదురైంది. 'మీరు 3 రోజుల్లోనే మ్యాచ్ లను ఎందుకు ముగించారు. దానివలన నేను చాలా నిరాశకు గురయ్యాను' అని ఆ ప్యాసింజర్ అశ్విన్ ను ప్రశ్నించాడట. దానికి అశ్విన్ బదులిస్తూ.. 'రెండు విషయాల్లో మార్పు వచ్చింది. సుదీర్ఘ ఇన్నింగ్స్ లు ఆడడం, వేగంగా పరుగులు చేయడం వంటి వాటిల్లో బ్యాటర్ల మైండ్ సెట్ మారిపోయింది. ఈ రోజుల్లో టెస్ట్ మ్యాచుల్లోనూ వేగంగా పరుగులు రాబట్టాలని చూస్తున్నారు. సమయం తీసుకుని, క్రీజులో కుదురుకుని నెమ్మదిగా రన్స్ చేయాలని ఎవరూ కోరుకోవడం లేదు. అయితే ఈ 2 టెస్టులు 3 రోజుల్లోనే ముగిసి ఉండకూడదు.' అని అశ్విన్ చెప్పాడు.
మూడో టెస్ట్ మ్యాచ్ కు ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ దూరమయ్యాడు. అతను వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియాకు వెళ్లాడు. కమిన్స్ స్థానంలో స్టీవ్ స్మిత్ జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక టీమిండియా సూపర్ ఫాంలో ఉంది. బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా సత్తా చాటుతూ రాణిస్తున్నారు. సిరీస్ లో ఆధిక్యంలో ఉన్న భారత్ కు అడ్డుకట్ట వేయాలంటే చాలా శ్రమించాల్సి ఉంది.