Rahul Dravid on Ishan Kishan: కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌( Ishan Kishan) భవిష్యత్తుపై కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్(Rahul Dravid) స్పందించాడు. మళ్లీ బరిలోకి దిగడం ఎప్పుడో తనే నిర్ణయించుకోవాలని టీమిండియా హెడ్‌ కోచ్‌ అన్నాడు. ఇషాన్‌ మళ్లీ క్రికెట్‌ ఆడటం ఎప్పుడో నిర్ణయించుకున్న తర్వాతే... అతడిని జట్టు ఎంపిక కోసం పరిగణనలోకి తీసుకుంటామని ద్రవిడ్‌ తేల్చి చెప్పేశాడు. జట్టులోకి తిరిగి రావడానికి ఎవరికైనా మార్గం ఉందన్న దివాల్‌... అతడు విరామం కావాలని అడిగాడని.. అందుకు తాము అంగీకరించామని తెలిపాడు. అతడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నా.. కొంచెం క్రికెట్‌ ఆడి తిరిగి రావాలని... అతడి విషయంలో తామేమీ బలవంతం చేయడం లేదని రాహుల్‌ ద్రవిడ్‌ స్పష్టం చేశాడు. వ్యక్తిగత కారణాలతో గత డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో ఇషాన్‌ జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీలో కూడా ఆడటం లేదు. 

మానసిక కుంగుబాటేనా.?
గత ఏడాదంతా విరామం లేకుండా జట్టుతో ప్రయాణం చేసిన ఇషాన్‌ కిషన్‌.. తుది జట్టులో ఆడింది మాత్రం చాలా తక్కువ. ఎవరైనా అందుబాటులో లేకుంటేనే ఇషాన్‌కు ఛాన్స్‌లు వస్తున్నాయి తప్పితే టీమిండియా తుది జట్టులో కిషన్‌కు పెద్ద అవకాశాలు రావడం లేదు. జట్టులో చోటు దక్కకపోవడంతో ఇషాన్‌కు మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నాడని, అందుకే అతడు కొన్నాళ్లు ఆట నుంచి విరామం తీసుకునేందుకు దక్షిణాఫ్రికా సిరీస్‌ నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. ఐపీఎల్ వరకు ఆటకు దూరంగా ఉండాలని ఇషాన్ కిషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఇషాన్ కిషన్ రెండు టెస్ట్‌లతో పాటు 17 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. మొత్తం 29 ఇన్నింగ్స్‌ల్లో 29.64 సగటుతో 741 పరుగులు చేశాడు. ఇందులో ఏడు అర్ధ శతకాలు ఉన్నాయి.


క్రమశిక్షణా చర్యలంటూ వార్తలు
ఇషాన్‌ కిషన్‌పై క్రమశిక్షణ చర్యలేం తీసుకోలేదు. సెలక్షన్‌కు ఇషాన్‌ కిషనే దూరంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో విరామం కావాలని కోరడంతో ఒప్పుకున్నాం. ఇషాన్‌ కిషన్‌ తిరిగి జట్టులోకి రావాలనుకుంటే దేశవాళీ క్రికెట్లో సత్తాచాటి సెలక్షన్‌కు అందుబాటులో ఉండాలి" అని టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఇషాన్‌ కిషన్‌ దేశవాళీలో సత్తా చాటి మళ్లీ జట్టులోకి రావాలని ద్రవిడ్‌ స్పష్టం చేశాడు. అయితే మాన‌సికంగా అల‌సిపోయాన‌ని చెప్పి దుబాయ్‌లో పార్టీలు ఎంజాయ్ చేస్తుండ‌డంపై ఇషాన్‌ కిషన్‌పై బీసీసీఐ సీరియ‌స్ అయింద‌ని, ఈ క్రమంలోనే అత‌డిని అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయ‌లేద‌ని వార్తలు వ‌చ్చాయి. అయితే ఈ వార్తలను ఈ వార్తల‌ను స్వయంగా రాహుల్ ద్రవిడ్ ఖండించాడు.


అలాంటిదేమీ లేదన్న ద్రవిడ్‌
ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లపై క్రమశిక్షణ చర్యలేం తీసుకోలేదని రాహుల్‌ ద్రవిడ్‌ స్పష్టం చేశాడు. సెలక్షన్‌కు ఇషాన్‌ కిషనే దూరంగా ఉన్నాడని... దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో విరామం కావాలని కోరడంతో ఒప్పుకున్నామని ద్రవిడ్‌ వెల్లడించాడు. ఇషాన్‌ కిషన్‌ తిరిగి జట్టులోకి రావాలనుకుంటే దేశవాళీ క్రికెట్లో సత్తాచాటి సెలక్షన్‌కు అందుబాటులో ఉండాలని సూచించాడు. జట్టులో పోటీ కారణంగానే శ్రేయస్‌ను అఫ్గాన్‌తో టీ 20 సిరీస్‌కు ఎంపిక చేయలేదని... దక్షిణాఫ్రికాతో టీ20ల్లోనూ అతనాడలేదని ద్రవిడ్‌ గుర్తు చేశాడు. జట్టు ప్రయోజనాలను అనుసరించే కూర్పుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ద్రవిడ్‌ తెలిపాడు.