Nicholas Pooran Retirement: వెస్ట్ ఇండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ మంగళవారం, జూన్ 10, 2025న తన అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. కేవలం 29 ఏళ్లకే క్రికెట్ నుంచి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై అతను ఒక భావోద్వేగ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
రిటైర్మెంట్ తీసుకునే ముందు చాలా ఆలోచించానని, ధ్యానం చేశానని, ఆ తర్వాత ఎంతో భారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని నికోలస్ పూరన్ చెప్పాడు.
అతను ఇలా రాశాడు, "నేను ఇష్టపడే ఈ ఆట నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇస్తూనే ఉంటుంది. మరచిపోలేని జ్ఞాపకాలు మిగిల్చింది. వెస్టిండీస్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది. మెరూన్ రంగు ధరించడం, జాతీయ గీతం ఆలపించటప్పుడు గ్రౌండ్‌లో నిలబడటం మరిచిపోలేని అనుభూతి. మైదానంలో అడుగు పెట్టిన ప్రతిసారి నా 100 శాతం ఇవ్వాలని అనుకుంటాను. ఇలా ఈ ఎక్స్‌పీరియన్స్‌ను మాటల్లో చెప్పడం కష్టం. కెప్టెన్‌గా జట్టుకు నాయకత్వం వహించడం నాకు ఎల్లప్పుడూ గౌరవంగా ఉంటుంది."
అభిమానులు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు
పురాన్ తన అభిమానుల గురించి కూడా తన లేఖలో పేర్కొన్నాడు "మీ అచంచలమైన ప్రేమకు ధన్యవాదాలు. మీరు కష్ట సమయాల్లో నాకు మద్దతు ఇచ్చారు. మంచి క్షణాలను ఆస్వాదించారు." కుటుంబం, స్నేహితులు తోటి ఆటగాళ్ల కోసం రాస్తూ,"ఈ ప్రయాణంలో నాతో నడిచినందుకు ధన్యవాదాలు. మీ విశ్వాసం మద్దతు నన్ను ఈ ప్రయాణంలో కొనసాగించింది. నా కెరీర్‌లో ఈ అంతర్జాతీయ అధ్యాయం ముగిసినప్పటికీ, వెస్టిండీస్ క్రికెట్‌పై నాకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు. జట్టు విజయం తప్ప మరేమీ నేను కోరుకోను."
నికోలస్ పూరన్ ఇంటర్నేషనల్ రికార్డ్స్
పూరన్ 2016లో తన T20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అక్కడికి 3 సంవత్సరాల తర్వాత 2019లో అతను తన ODI అరంగేట్రం చేశాడు. అతను వెస్టిండీస్ తరపున ఎప్పుడూ టెస్టులు ఆడలేదు. తన అంతర్జాతీయ కెరీర్‌లో, పూరన్ 61 ODIలు, 106 T20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 1983 పరుగులు చేస్తే టీ 20ల్లో 2275 పరుగులు చేశాడు.
తన ODI కెరీర్‌లో పురాన్ 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతను T20 అంతర్జాతీయ క్రికెట్‌లో 13 హాఫ్ సెంచరీలు చేశాడు. డిసెంబర్ 19, 2024న బంగ్లాదేశ్‌తో జరిగిన T20 మ్యాచ్ పూరన్‌కు చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా మారింది.