New Zealand Cricket Team In World Cup 2023: నెదర్లాండ్స్‌ను 99 పరుగుల తేడాతో ఓడించిన తర్వాత న్యూజిలాండ్... ఈ ప్రపంచ కప్‌లో భారత్ సహా ఇతర జట్లను హెచ్చరికలు పంపించింది. వాస్తవానికి ప్రస్తుతం న్యూజిలాండ్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా ఆడటం లేదు. అయితే ఈ మైనస్ ఉన్నప్పటికీ కివీ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. అంతకుముందు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ మంచి నీళ్లు తాగినంత సులభంగా ఓడించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కివీస్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది.
న్యూజిలాండ్‌ను ఓడించడం టీమ్ ఇండియాకు పెద్ద సవాల్...
ఐసీసీ టోర్నమెంట్లలో న్యూజిలాండ్ రికార్డు అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో భారత జట్టుకు న్యూజిలాండ్ తలనొప్పిగా మారింది. భారత జట్టు చివరిసారిగా 2003 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌ను ఓడించింది. దీని తర్వాత వన్డే, టీ20 ప్రపంచ కప్‌లలో టీమ్ ఇండియా అన్ని సార్లూ కివీ జట్టు చేతిలో ఓడిపోయింది.
అలాగే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియాను ఓడించి న్యూజిలాండ్ టైటిల్‌ను గెలుచుకుంది. 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడి సెమీ ఫైనల్‌లో భారత జట్టు నిష్క్రమించింది. ఆ రోజును భారత క్రికెట్ అభిమానులు ఎవరూ మర్చిపోలేరు.
న్యూజిలాండ్ జట్టు గత ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. అయితే టైటిల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఐసీసీ టోర్నీల్లో ఇతర జట్లకు న్యూజిలాండ్ పెద్ద సవాలుగా నిలుస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, నెదర్లాండ్స్‌పై వరుసగా రెండు మ్యాచ్‌లు గెలుపొందడం ద్వారా కివీస్ జట్టు భారత్‌తో పాటు ఇతర జట్ల కష్టాలను మరింత పెంచింది. న్యూజిలాండ్ జట్టు తన మూడో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అక్టోబర్ 13వ తేదీన న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial