NEP vs NED T20 World Cup:  టీ 20 ప్రపంచకప్‌(, T20 World Cup 2024)లో భాగంగా డల్లాస్‌లో గ్రాండ్ ప్రైరీ స్టేడియం(Grand Prairie Stadium)లో నేపాల్‌(NED vs NEP)తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌ విజయం సాధించింది. మాక్స్ ఓ'డౌడ్(Max O'Dowd) అజేయ అర్ధ సెంచరీతో నెదర్లాండ్స్‌కు విజయాన్ని అందించాడు. గ్రూప్‌ డీలో జరిగిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్‌ చేసిన నేపాల్‌ 106 పరుగులు చేసింది. అనంతరం 18.4 ఓవర్లలో నెదర్లాండ్స్‌ నాలుగు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై ఇరు జట్ల బౌలర్లు రాణించడంతో పసికూనల మధ్య జరిగిన ఈ లో స్కోరింగ్‌ మ్యాచ్‌ కాస్త టెన్షన్‌గానే సాగింది.




 

బౌలర్ల ఆధిపత్యం

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన నెదర్లాండ్స్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్‌ ఎంచుకుంది. డచ్‌ జట్టు ఆహ్వానంతో బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌.. 19.2 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలారు. నెదర్లాండ్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో నేపాల్‌కు పరుగులు రావడమే కష్టమైపోయింది. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే నేపాల్‌ జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. కుశాల్‌ బ్రూటెల్‌ను వాన్ బీక్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో పది పరుగుల వద్ద నేపాల్ తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే నేపాల్‌ రెండో వికెట్‌ కూడా కోల్పోయింది. ఆసీఫ్‌ షైక్‌ను ప్రింగిల్‌ అవుట్‌ చేశాడు. దీంతో 3.1 ఓవర్లలో నేపాల్ 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నేపాల్‌ స్కోరు 40 పరుగులకు చేరిందో లేదో మరో బ్యాటర్‌ పెవిలియన్ చేరాడు. ప్రింగిల్ బౌలింగ్‌లో వాన్ బీక్ క్యాచ్ ఇచ్చి 11 పరుగులు చేసిన అనిల్ సాహ్ అవుట్‌ అయ్యాడు. కానీ నేపాల్‌ కెప్టెన్‌ రోహిత్ పాడెల్ 37 బంతుల్లో 35 పరుగులు చేసి తన జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ మిగిలిన బ్యాటర్ల నుంచి అతడికి సహాయం కరువైంది. కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఎయిరీ, సోంపాల్ కమీ త్వరత్వరగా పెవిలియన్‌ చేరారు. దీంతో నేపాల్ 13.2 ఓవర్లలో 66 పరుగులకే ఆరు వికెట్ల్లు కోల్పోయింది. కానీ రోహిత్‌ పౌడెల్‌ పోరాడడంతో నేపాల్ స్కోరు వంద పరుగులు అయినా దాటింది. కానీ పౌడెల్‌ను ప్రింగిల్ అవుట్ చేయడంతో నేపాల్‌ కథ ముగిసింది. చివరి మూడు వికెట్లు వేగంగా పతనమయ్యాయి. నెదర్లాండ్స్‌ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్ కేవలం 18 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా, టిమ్ ప్రింగిల్ కూడా మూడు వికెట్లు తీశాడు. పాల్ వాన్ మీకెరెన్ రెండు, డి లీడ్ రెండు వికెట్లు తీశారు. 

 

కష్టంగానే...

107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ను నేపాల్‌ బౌలర్లు కట్టడి చేశారు. స్వల్ప లక్ష్యమైనా ఛేదించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే లెవిట్‌ అవుటయ్యాడు. ఆ తర్వాత ఓ డౌడ్‌ నెదర్లాండ్స్‌ను ఆదుకున్నాడు. 48 బంతుల్లో 54 పరుగులు చేసిన ఓ డౌడ్... నెదర్లాండ్స్‌ జట్టును విజయం దిశగా నడిపించాడు. విక్రమ్ సింగ్ 22 పరుగులు చేసి ఓ'డౌడ్‌కు మద్దతు ఇచ్చాడు. దీంతో నెదర్లాండ్స్ మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మంచి బౌలింగ్‌తో నేపాల్‌ వెన్నువిరిచిన ప్రింగిల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్ దక్కింది.