Harman Preet Stunning 50: డ‌బ్ల్యూపీఎల్ లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) వ‌రుస విజ‌యాల‌కు బ్రేక్ ప‌డింది. ఒక్క‌రోజు విరామం త‌ర్వాత శుక్ర‌వారం ప్రారంభ‌మైన లీగ్ మ్యాచ్ లో ఆర్సీబీపై 4 వికెట్ల‌తో ముంబై ఇండియ‌న్స్ ఉత్కంఠ భ‌రిత విజ‌యం సాధించింది. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్ లో  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల‌కు 167 ప‌రుగులు చేసింది. ఎలీసా పెర్రీ విధ్వంస‌క‌ర ఫిఫ్టీ (43 బంతుల్లో 81, 11 ఫోర్లు, 2 సిక్స‌ర్లు)తో స‌త్తా చాటింది. అమ‌న్ జ్యోత్ కౌర్ ఆల్ రౌండ్ షో (34 నాటౌట్, 3-22)తో స‌త్తా చాట‌డంతో టార్గెట్ ను 19.5 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల‌కు 170 ప‌రుగులు చేసి పూర్తి చేసింది. బౌల‌ర్ల‌లో జార్తియా వారెహ‌మ్ మూడు వికెట్ల‌తో స‌త్తా చాటింది. ఆల్ రౌండర్ గా రెండు విభాగాల్లో రాణించిన అమ‌న్ జ్యోత్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది. శనివారం మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో యూపీ వారియర్జ్ త‌ల‌ప‌డ‌తారు. 

30 బంతుల్లో ఫిఫ్టీ..బ్యాటింగ్ ఫస్ట్ చేసిన ఆర్సీబీకీ మంచి ఆరంభం ద‌క్క‌లేదు. 48 ప‌రుగుల‌కే ఓపెన‌ర్లు స్మృతి మంధాన , డాని వ్యాట్  వికెట్ల‌ను కోల్పోయింది. ఈ ద‌శ‌లో పించ్ హిట్ట‌ర్ గా బ‌రిలోకి దిగిన పెర్రీ.. ఆద్యంతం బౌండ‌రీల‌తో ఆక‌ట్టుకుంది. 11 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌ను ఓ ఆటాడుకుంది. దీంతో 30 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. పెర్రీతో పాటు రిచా ఘోష్ (28) ఫ‌ర్వాలేద‌నిపించ‌గా, మిగ‌తా బ్యాట‌ర్లు అంతా సింగిల్ డిజిట్ స్కోరుకే ప‌రిమిత‌మ‌య్యారు. తాను ఉన్నంత వ‌ర‌కు స్కోరు బోర్డును పరుగులెత్తించిన పెర్రీ.. ఇన్నింగ్స్ ఆఖ‌రి ఓవ‌ర్ ఐదో బంతికి ఔట‌య్యింది. బౌల‌ర్ల‌లో  ష‌బ్నిం ఇస్మ‌యిల్, నాట్ స్కివ‌ర్ బ్రంట్, హీలీ మాథ్యూస్, సంస్కృతి గుప్తా త‌లో వికెట్ సాధించారు. 

హ‌ర్మ‌న్ కెప్టెన్ ఇన్నింగ్స్..కీల‌క‌మైన మ్యాచ్ లో ముంబై కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ సింగ్ (38 బంతుల్లో 50, 8 ఫోర్లు, 1 సిక్స‌ర్) రాణించింది. ఓపెన‌ర్లు య‌స్తిక భాటిక‌, హీలీ మ‌థ్యూస్ విఫ‌ల‌మైనా బ్రంట్ (21 బంతుల్లో 42, 9 ఫోర్లు) తో క‌లిసి జ‌ట్టును న‌డిపించింది. ఆరంభంలో యాంక‌ర్ రోల్ పోషించిన హ‌ర్మ‌న్.. స్ట్రైక్ ఎక్కువ‌గా బ్రంట్ కి ఇచ్చింది. దీంతో బ్రంట్ వేగంగా ఆడి బౌల‌ర్ల‌పై ఒత్తిడి పెంచింది. త‌ను ఔట‌య్యాక గేర్ మార్చి 36 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. అయితే టార్గెట్ కు స‌మీపంచిన ద‌శ‌లో కీప‌ర్ క్యాచ్ ఇచ్చి అనూహ్యంగా హ‌ర్మ‌న్ ఔట‌య్యింది. ఈ ద‌శ‌లో అమ‌న్ జ్యోత్ చివ‌రికంటా నిలిచి జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చింది. స్లో ఓవ‌ర్ రేట్ కార‌ణంగా చివ‌రి ఓవ‌ర్లో ఒక ఫీల్డ‌ర్ స‌ర్కిల్ లోప‌లే ఉండ‌టం కూడా ముంబైకి క‌లిసొచ్చింది. బౌల‌ర్లలో కిమ్ గార్త్ కు రెండు, ఏక్తా బిస్త్ కు ఒక వికెట్ ల‌భించింది. 

Read Also: ICC Champions Trophy 2025: సౌతాఫ్రికా సూప‌ర్ విక్ట‌రీ.. రికెల్ట‌న్ సెంచరీ.. భారీ తేడాతో ఆఫ్గాన్ చిత్తు..