WPL 2025 MI Vs UPW Live Updates: డబ్ల్యూపీఎల్ లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు చేరువగా వచ్చింది. గురువారం లక్నో ల జరిగిన లీగ్ మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో ఆతిథ్య యూపీ వారియర్జ్ పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పట్టికలో రెండోస్థానానికి ఎగబాకిన ముంబై.. మరోసారి ప్లే ఆఫ్స్ కు వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకుంది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట బ్యాటింగ్ చేసిన యూపీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల కు 150 పరుగులు చేసింది. ఓపెనర్ జార్జ్ వాల్ స్టన్నింగ్ ఫిఫ్టీ (33 బంతుల్లో 55, 12 ఫోర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచింది. అమెలియా కెర్ పాంచ్ పటాకా (5-32) తో సత్తా చాటింది. ఛేదనను 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు 153 పరుగులు సాధించింది. ఓపెనర్ హీలీ మథ్యూస్ (46 బంతుల్లో 68, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకుంది. గ్రేస్ హారిస్ కు రెండు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో యూపీ దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. శుక్రవారం జరిగే మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో గుజరాత్ జెయింట్స్ తలపడతారు. హీలీ మథ్యూస్ కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
మిడిలార్డర్ వైఫల్యం..
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన యూపీకి ఓపెనర్లు హారిస్ (28), వాల్ కు అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. ముంబై బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ జంట.. వేగంగాపరుగులు సాధిస్తూ, స్కోరు బోర్డును పరుగులెత్తించింది. తొలి వికెట్ కు 74 పరుగులు జత కావడంతో యూపీ భారీ స్కోరు సాధిస్తుందని పించింది. అయితే ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో శుభారంభం వృథా అయ్యింది. మధ్యలో కెప్టెన్ దీప్తి శర్మ (27) కాస్త పోరాటం చేయడంతో యూపీ సవాలు విసరగలిగే స్కోరును సాధించింది. చివర్లో సోఫీ ఎకిల్ స్టోన్ (16) చిన్న క్యామియో ఆడింది. మిగతా బౌలర్లలో హీలీ మథ్యూస్ కు రెండు, నాట్ స్కివర్ బ్రంట్, పరుణిక సిసోడియాకు తలో వికెట్ దక్కింది.
హీలీ జోరు..
ఇక ఛేజింగ్ లో హీలీ జోరును చూపించింది. ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లు ఎదురు దాడికి దిగి, స్కోరు బోర్డును పరుగులెత్తించింది. అమెలియా (10) విఫలమైనా, బ్రంట్ (37) తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. వీరిద్దరూ రెండో వికెట్ కు 92 పరుగులు జోడించడంతో ముంబై చేతిలోకి మ్యాచ్ వచ్చింది. ఈ క్రమంలో 35 బంతుల్లోనే ఫిఫ్టీ చేసుకుంది. అయితే చివర్లో త్వరగా మ్యాచ్ ముగించాలనే తొందరలో తను ఔటయ్యింది. ఆఖర్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (4) విఫలమైనా, అమన్ జ్యోత్ కౌర్ (12 నాటౌట్), యాస్తికా భాటియా (10 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు. మిగతా బౌలర్లలో క్రాంతి గౌడ్, చినెల్ హెన్రీకి తలో వికెట్ దక్కింది. తాజా మ్యాచ్ తర్వాత బ్రంట్ కు ఆరెంజ్ క్యాప్, అమెలియాకు పర్పుల్ క్యాప్ లభించింది.