2019 World Cup: 


ఐపీఎల్‌ నుంచి రిటైర్‌ అయ్యాడో లేదో అంబటి రాయుడు క్రికెట్‌ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాడు! భారత క్రికెట్లో తనకు జరిగిన అన్యాయాలను ప్రశ్నిస్తున్నాడు. తనపై కొందరు చూపిన వివక్షను వేలెత్తి చూపిస్తున్నాడు. ఐసీసీ 2019 వన్డే ప్రపంచకప్‌లో తనకు చోటివ్వకపోవడంపై అప్పటి చీఫ్ సెలక్టర్‌ అభిప్రాయంతో విభేదిస్తున్నానని చెప్పాడు. విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేయడంలో అర్థం లేదని వాదించాడు. దాంతో ఎమ్మెస్కే ప్రసాద్‌ తాజాగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.


ఎందుకో తెలీదుగానీ మొదట్నుంచీ ఎమ్మెస్కే వ్యవహారశైలితో అంబటి రాయుడు ఇబ్బంది పడ్డట్టు కనిపిస్తోంది. 2005లో హైదరాబాద్‌ జట్టుకు ఎమ్మెస్కే కెప్టెన్సీలో రాయుడు ఆడాడు. కాగా సెలక్షన్‌ కమిటీలో ఒక్కరి మాటే చెల్లుబాటు కాదని ఐదుగురు కలిసి నిర్ణయం తీసుకుంటారని ప్రసాద్‌ తెలిపాడు.


'సెలక్షన్ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారని అందరికీ తెలుసు. ఎంపిక సమావేశాల్లో కెప్టెన్‌ సైతం ఉంటాడు. అలాంటప్పుడు ఒకే వ్యక్తి నిర్ణయాలు తీసుకుంటాడా? ఏకాభిప్రాయానికి వస్తారా? ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంటారా? ఒకే వ్యక్తి నిర్ణయాలు తీసుకుంటే ఐదుగురు సెలక్టర్లు అవసరం లేదు. అంటే సభ్యులందరూ ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతే నిర్ణయాన్ని ప్రకటిస్తారు. అప్పుడది ఉమ్మడి నిర్ణయం అవుతుంది. ఒక్కరిది కాదు. నేనేదైనా ప్రతిపాదించొచ్చు.. కానీ అందరూ దానిని అంగీకరించాలి కదా! కమిటీ సమావేశాల్లో ఒక్కరి నిర్ణయానికి ఆమోదం లభించదు' అని ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నాడు.


తెలుగు క్రికెటర్‌ అంబటి రాయుడికి ఎంతో సామర్థ్యం ఉంది. అతడు టీమ్ఇండియాకు 55 వన్డేలు ఆడాడు. 47.05 సగటుతో 1694 పరుగులు చేశాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కపోవడంతో నిరాశపడ్డాడు. అప్పట్నుంచి కెరీర్‌లో పతనం మొదలైంది. ఆ మెగా టోర్నీకి ఎమ్మెస్కే నేతృత్వంలోని కమిటీ కుర్రాడైన విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేసింది. రాయుడికి సెలక్షన్‌ కమిటీ సుదీర్ఘ అవకాశాలు కల్పించిందని.. ప్రపంచకప్‌లో మరొకరికి తీసుకుందే అదేనని ప్రసాద్‌ పేర్కొన్నాడు.


Also Read: జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?


దేశవాళీ క్రికెట్లో అంబటి రాయుడు తన కెప్టెన్సీ ఆడినప్పుడు తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ప్రసాద్‌ వెల్లడించాడు. బహుశా అతడు తన కెప్టెన్సీ స్వభావాన్ని ఇష్టపడలేదేమో అన్నాడు. 'నేను నిజం చెబుతున్నాను. 2005లో ఏమీ జరగలేదు. అస్సలు విభేదాలు రాలేదు. నా కెప్టెన్సీ స్టైల్‌ నచ్చలేదని మాత్రమే అంబటి చెప్పాడు. అది సబబే! అభిప్రాయబేధాలు అందరి మధ్యా ఉంటాయి. నేను అన్ని విషయాల్లో కఠినంగా ఉంటానని అందరికీ తెలిసిందే. రెజిమెంట్స్‌, ఫిట్‌నెస్‌ సహా అన్నింట్లో స్ట్రిక్ట్‌గా ఉంటాను. బహుశా అతడు దానిని ఇష్టపడకపోవచ్చు. అదేం పెద్ద సమస్య కాదు' అని ఆయన తెలిపాడు.


భారత క్రికెట్‌లో రాజకీయాల వల్ల చాలామంది క్రికెటర్ల జీవితాలు చీకట్లోనే మగ్గిపోయాయి.  ఇందుకు తానేమీ అతీతుడిని కాదన్నాడు అంబటి రాయుడు. ఇటీవలే  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌తో పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్న రాయుడు.. ఓ ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన క్రికెట్ కెరీర్‌ను ప్రభావితం చేసిన అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ క్రికెటర్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్‌పై రాయుడు సంచలన ఆరోపణలు చేశాడు.