MS Dhoni Birthday Special: తలా ఫర్ ఏ రీజన్... ఐపీఎల్(IPL) జరిగినన్నీ మార్మోగిన నినాదమిది. ఎందుకు ధోనీ(MS Dhoni) ఫర్ ఏ రీజన్ అంటే... చెప్పడానికి ఒకటా... రెండా అని ధోనీ అభిమానులు ఠక్కున సమాధానం చెప్తారు. అవును ధోనీ ఘనత చెప్పడానికి..... ఆ విజయాలు వర్ణించడానికి...... ఆ సారథ్యాన్ని వివరించడానికి.. ఆ ప్రశాంతతను కొనియాడడానికి...పదాలు సరిపోవేమో. టీమిండియా(India) నవ పథం వైపు నడిచిందన్నా..మైదానంలో అద్భుతాలు సృష్టించిందన్నా.. యువ ఆటగాళ్లు అవకాశాలు దక్కి దిగ్గజాలుగా మారారన్నా అంతా ధోనీ చలువే. కెప్టెన్సీ అంటే ఇలాగే చేయాలేమో... బౌలర్లకు సలహాలు ఇలాగే ఇవ్వాలేమో.. బ్యాటింగ్ అంటే ఇంతే ప్రశాంతంగా చేయాలేమో... అని క్రికెట్ ప్రపంచానికి పాఠాలు నేర్పిన గురువు ఈ మహేంద్రుడు.
దూకుడు బ్యాటింగ్‌తో టీమిండియాలోకి దూసుకొచ్చి... ఆ తర్వాత భారత జట్టు వెన్నెముకగా మారి... యువ ఆటగాళ్లకు గురువుగా... అసలైన కెప్టెన్‌గా ధోని భిన్న పాత్రలను సమర్థంగా నిర్వహించాడు. అందని ద్రాక్షగా మారిన వన్డే ప్రపంచకప్‌ను.. తొలి టీ 20 ప్రపంచకప్‌ను.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ వశం చేసిన ఒకే ఒక్కడు ధోనీ. టెస్టుల్లో టీమిండియాను నెంబర్ వన్‌గా చేసి ఇక సాధించాల్సింది ఏమీ లేదని నిరూపించి మరీ రిటైరయ్యాడు ఈ దిగ్గజ ఆటగాడు. 1981 జులై 7న జన్మించిన మహేంద్రుడి 43వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఓసారి మిస్టర్ కూల్ విశేషాలు చూద్దామా...
మహేంద్రజాలకుడు.. ఈ ధోనీ
2004 డిసెంబర్ 23 బంగ్లాదేశ్‌తో జరిగిన భారత జట్టులోకి విధ్వంసకర బ్యాటర్‌గా ఎంట్రీ ఇచ్చిన ధోనీ... ఆ తర్వాత ఫినిషర్‌గా... అనంతరం కెప్టెన్‌గా భారత క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌పై చెరగని ముద్ర వేశాడు. విశాఖపట్నం వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ ధోనీ జీవితంతోపాటు.. భారత క్రికెట్ ప్రయాణానికి అతిపెద్ద టర్నింగ్ పాయింట్. జులపాల జుట్టుతో విశాఖ తీరంలో ఉప్పెనలా విరుచుకుపడ్డ ధోనీ... పాకిస్థాన్ బౌలర్లను ఉతికి ఆరేసి తన రాకను బలంగా చాటాడు. ఆ మ్యాచ్‌లో 123 బంతుల్లో 148 పరుగులు చేసిన మహేంద్రుడు...అదే సంవత్సరం లంకతో జరిగిన మ్యాచ్‌లో 183 పరుగులు చేసి జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
సచిన్ సూచనతో కెప్టెన్‌గా...
మైదానంలో ధోనీ కెప్టెన్సీ లక్షణాలు గమనించిన సచిన్ 2007 వన్డే ప్రపంచకప్ తర్వాత ధోనీని టీ 20 ప్రపంచకప్‌కు కెప్టెన్‌గా చేయాలని సూచించాడు. సెహ్వాగ్, హర్భజన్, యువరాజ్ ఉన్నా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన మహీ... భారత జట్టును విశ్వ విజేతగా నిలిపాడు. అప్పటినుంచి భారత క్రికెట్ జట్టు రూపురేఖలు మారిపోయాయి. ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి భారత్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో ధోనీ పేరు మార్మోగిపోయింది. 2011లో ధోనీ కెప్టెన్సీలో 28 ఏళ్ల తర్వాత భారత్ వన్డే ప్రపంచకప్ గెలుచుకుంది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ధోనీ కొట్టిన సిక్సర్.... క్రికెట్ ప్రేమికుల మనసులపై ఒక చెరగని సంతకం. ఆ సిక్స్‌తో ధోనీ భారత్‌కు చారిత్రక విజయాన్ని అందించాడు. 2013లో ఛాంపియన్స్‌ని గెలిచి భారత్‌కు ఈ మహేంద్రుడు మరో ఐసీసీ ట్రోఫీని అందించాడు. మూడు ఐసీసీ ట్రోఫీలను గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌గా ధోనీ నిలిచాడు. ధోనీ నాయకత్వంలో 2010, 2014లో మూడు ఫార్మాట్లలో భారత జట్టు నంబర్ 1 జట్టుగా నిలిచింది. ధోనీ కెప్టెన్సీ శకం భారత్‌కు స్వర్ణయుగం.
ఐపీఎల్‌తో తలా శకం ఆరంభం
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ధోనీ శకం గురించి ఎంత చెప్పినా తక్కువే. చెన్నైను తిరుగు లేని జట్టుగా నిలిపి తలాగా మారిపోయాడు. ఇక అప్పటినుంచి ధోనీ మైదానంలో దిగుతున్నాడంటే చెన్నై అభిమానులు పోటెత్తెడం ఆరంభమైంది. ధోనీ కెప్టెన్సీలో CSK ఐదు IPL టైటిళ్లను గెలుచుకుంది. 2008ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై జట్టుకే ధోనీ ఆడాడు.
ముగిసిన స్వర్ణయుగం
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ధోని 17,266 పరుగులు చేశాడు. ధోని 90 టెస్టుల్లో 4, 876 పరుగులు చేశాడు. అందులో ఆరు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ చేశాడు. టెస్టు క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా ధోని నిలిచాడు. 350 వన్డేలు ఆడిన ధోనీ... 10,773 పరుగులు చేశాడు. వన్డేల్లో ధోనీ 10 శతకాలు చేశాడు. 98 టీ 20ల్లో 1617 పరుగులు చేశాడు. 2019 వరల్డ్ కప్ సెమీస్‌లో కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మహీ రనౌట్... భారత్ అభిమానులను తీవ్ర వేదనకు గురిచేసింది. అప్పుడే ధోనీ శకం ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. ప్రపంచకప్ తర్వాత సంవత్సరం పాటు క్రికెట్‌కు దూరమైన ధోనీ.. 2020 ఆగస్టు 15న రాత్రి 7.29 గంటలకు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చాడు. ధోనీని కేంద్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న (2007), పద్మశ్రీ (2009), పద్మభూషణ్ (2018) లతో సత్కరించింది.