Ind vs Eng Highlights: టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup)లో టీమిండియా(Team India) జోరు కొనసాగుతోంది. అమెరికా(USA), వెస్టిండీస్‌(WI) ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా టోర్నీలో... ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా రోహిత్‌ సేన ఫైనల్‌ చేరింది. ఇక తుది పోరులో భారత జట్టు తొలిసారి ఫైనల్‌ చేరిన దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ టైటిల్‌ పోరు ఆసక్తికరంగా మారనుంది. అయితే ఈ పొట్టి ప్రపంచకప్‌లో భారత జట్టు బ్యాటింగ్‌ కంటే బౌలింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడి విజయాలు సాధించింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బుమ్రా నేతృత్వంలోని భారత బౌలింగ్‌ దళం.. స్వల్ప లక్ష్యాలను కూడా కాపాడుకుని ఘనంగా ఫైనల్‌ చేరింది. బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌ ఈ మెగా టోర్నీలో అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్ల పని పట్టారు. అసలే బౌలింగ్‌కు పూర్తి అనుకూలంగా ఉన్న పిచ్‌లపై పదునైన బంతుల్లో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఈ క్రమంలో బుమ్రా-అర్ష్‌దీప్‌ జోడి అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. 



 

చరిత్రలో తొలిసారి

ఈ టీ 20 ప్రపంచకప్‌లో భారత పేసర్లు బుమ్రా-అర్ష్‌దీప్‌ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుని చరిత్ర సృష్టించారు. అర్ష్‌దీప్‌ టీ 20 ప్రపంచకప్‌లో భారత్‌ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ మెగా టోర్నీలో అర్ష్‌దీప్‌ ఇప్పటివరకూ 

ఏడు మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఏడు మ్యాచుల్లో 7.50 ఎకానమీతో అర్ష్‌దీప్‌ 15 వికెట్లు తీశాడు. ఇలా టీ 20 ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. సూపర్-8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీసి ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. బుమ్రా అయితే ఈ పొట్టి ప్రపంచకప్‌లో భారత బౌలింగ్‌కు వెన్నెముకగా నిలుస్తున్నాడు. బుమ్రా కీలక సమయంలో ప్రత్యర్థి బ్యాటర్ల పనిపడుతున్నాడు. ఈ టీ 20 ప్రపంచకప్‌లో బుమ్రా ఏడు మ్యాచులు ఆడి 4.12 ఎకానమీతో 13 వికెట్లు తీశాడు. బుమ్రా ఎకానమీ కేవలం నాలుగు పరుగులే ఉండడం విశేషం. 

 

రికార్డులు బద్దలు

ఈ క్రమంలో అర్ష్‌దీప్‌-బుమ్రా పలు రికార్డులను బద్దలు కొట్టారు. టీ 20 ప్రపంచకప్‌లో ఆర్పీ సింగ్, రవిచంద్రన్ అశ్విన్‌ల పేరిట ఉన్న రికార్డును బుమ్రా, అర్ష్‌దీప్ బద్దలు కొట్టారు. టీ 20 ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా వీరిద్దరూ నిలిచారు. టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానంలో ఉన్నాడు. ఆర్పీ సింగ్ మూడో స్థానంలో, రవిచంద్రన్ అశ్విన్ నాలుగో స్థానంలో ఉన్నారు. 2007 టీ 20 ప్రపంచకప్‌లో ఆర్పీ సింగ్ ఏడు మ్యాచులు ఆడి 6.33 ఎకానమీతో 12 వికెట్లు తీశాడు. 2014 టీ 20 ప్రపంచకప్‌లో రవిచంద్రన్ అశ్విన్ 6 మ్యాచ్‌లు ఆడి 5.35 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు.