Most Runs in ODI without Century: క్రికెట్‌లో ఏ ఆటగాడికైనా పరుగులు చేయడం మాత్రమే కాదు జట్టుకు విజయాలు అందించాడా లేదా అనేది ముఖ్యం. ఆటగాడు సెంచరీ సాధిస్తే మాత్రం ఆ మ్యాచ్ మరింత ప్రత్యేకంగా మారుతుంది. అదే సమయంలో శతకం చేయడంలో విఫలమయ్యే, చివరి నిమిషంలో సెంచరీ చేజార్చుకున్న ఆటగాళ్ళు చాలా మంది ఉన్నారు. వన్డే క్రికెట్‌లో కొందరు ఆటగాళ్లు ఒక్క సెంచరీ చేయకున్నా జట్టు కోసం తమ వంతు సాయంగా పరుగులు సాధించారు. అలాంటి ఆటగాళ్లు ఎవరెవరున్నారో ఇక్కడ తెలుసుకుందాం. ఆ ఆటగాల్లు వన్డే క్రికెట్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. కానీ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. సెంచరీ కూడా చేయకుండా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 7 ఆటగాళ్లలో ఎక్కువ మంది పాకిస్తాన్ ప్లేయర్లు ఉన్నారు. ఈ జాబితాలో ఒక టీమిండియా ఆల్ రౌండర్ కూడా ఉన్నాడు.
1. మిస్బా ఉల్ హక్ (Misbah-ul-Haq)
పాకిస్తాన్ ఆటగాడు మిస్బా-ఉల్-హక్ పేరు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. స్టార్ బ్యాటర్ మిస్బా వన్డేల్లో 162 మ్యాచ్‌ల్లో 43.40 స్ట్రైక్ రేట్‌తో 5,122 పరుగులు సాధించాడు. కానీ ODIలో మిస్బా అత్యధిక వ్యక్తిగత స్కోరు 96 నాటౌట్. వన్డేల్లో ఒక్క శతకం లేకున్నా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్.
2. వసీం అక్రమ్ (Wasim Akram)
పాకిస్తాన్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ పేరు ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. 356 మ్యాచ్‌లాడిన వసీం అక్రమ్ 3,717 పరుగులు చేశాడు. వన్డేల్లో అక్రమ్ అత్యుత్తమ స్కోరు 86 పరుగులు. స్టార్ పేసర్‌గా జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. సెంచరీ చేయాలన్న కల మాత్రం నెరవేరలేదు.
3. మొయిన్ ఖాన్ (Moin Khan)
వన్డేల్లో సెంచరీ లేకుండా అత్యధిక పరుగులు చేసిన మూడో క్రికెటర్ కూడా పాకిస్తాన్ ప్లేయరే కావడం విశేషం. కీపర్ బ్యాటర్ మొయిన్ ఖాన్ 219 వన్డే మ్యాచ్‌ల్లో 3,266 పరుగులు చేశాడు. వన్డేల్లో మొయిన్ ఖాన్ అత్యుత్తమ స్కోరు 72 నాటౌట్. మిడిలార్డర్ లో జట్టుకు కీలకంగా మారి ఇన్నింగ్స్‌లు ఆడాడు.
4. హిత్ స్ట్రీక్ (Health Streak)
జింబాబ్వేకు చెందిన ఆటగాడు హీత్ స్ట్రీక్ ఈ జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు. మీడియం ఫాస్ట్ బౌలర్, ఆల్ రౌండర్ అయిన హిత్ స్ట్రీక్ సెప్టెంబర్ 2023లో మరణించాడు. జింబాబ్వే జాతీయ జట్టుకు 189 మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించిన ఈ ఆటగాడు 2,943 పరుగులు చేశాడు. హిత్ స్ట్రీక్ అత్యధిక స్కోరు 79 నాటౌట్ పరుగులు.
5. రవీంద్ర జడేజా (Ravindra Jadeja)
భారత స్టార్ ఆల్ రౌండర్ ప్లేయర్ రవీంద్ర జడేజా ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో కొనసాగుతున్నాడు. 204 వన్డే మ్యాచ్‌లాడిన జడేజా 32.62 సగటుతో 2,806 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్‌లో జడేజా అత్యుత్తమ స్కోరు 87 రన్స్. వన్డేల్లో మరో 138 పరుగులు చేస్తే ఈ జాబితాలో 4వ స్థానానికి చేరుకుంటాడు. జడేజా ODIలలో 51 సార్లు నాటౌట్‌గా నిలిచి జట్టు విజయాల్లో కీలకంగా మారాడు.
6. ఆండ్రూ జోన్స్ (Andrew Jones)
న్యూజిలాండ్‌కు చెందిన ఆండ్రూ జోన్స్ ఈ జాబితాలో 6వ స్థానంలో నిలిచాడు. జోన్స్ 87 మ్యాచ్‌ల్లో 35.69 సగటుతో 2,784 పరుగులు సాధించాడు. ODIలలో ఈ న్యూజిలాండ్ ఆటగాడి అత్యుత్తమ స్కోరు 93 పరుగులు.
7. గై విట్టల్ (Guy Whittall)
జింబాబ్వే ప్లేయర్ గై విట్టల్ వన్డే ఫార్మాట్లో ఒక్క సెంచరీ కూడా చేయకుండా అత్యధిక పరుగులు చేశాడు. ఈ జాబితాలో 7వ స్థానంలో విట్టల్ ఉన్నాడు. జింబాబ్వే బ్యాటర్ విట్టల్ 147 మ్యాచ్‌ల్లో 22.54 సగటుతో 2,705 రన్స్ చేశాడు. ODIలలో ఇతడి అత్యుత్తమ స్కోరు 83 పరుగులు.