భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ అర్జున అవార్డు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. వన్డే ప్రపంచకప్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన షమీ పేరును అర్జున అవార్డు కోసం బీసీసీఐ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. క్రీడా మంత్రిత్వ శాఖకు బీసీసీఐ ప్రత్యేక అభ్యర్థన చేసిందని క్రీడా వర్గాలు తెలిపాయి. క్రీడా మంత్రిత్వ శాఖకు మొదటగా పంపిన జాబితాలో మహ్మద్ షమి పేరు లేదు. అలాగే, ‘‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’’ అవార్డుకు పురుషుల బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్ శెట్టి పేర్లను సిఫారసు చేశారు. ఈ ఏడాది సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడి ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో నెంబర్ వన్‌ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. 


భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో మహ్మద్‌ షమీ(Mohammed Shami).. ప్రదర్శన క్రికెట్‌ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. అది మాములు ప్రదర్శన. ప్రతీ బంతికి వికెట్‌ తీసేలా.. బంతిబంతికి పరీక్ష పెట్టేలా..బుమ్రా, సిరాజ్‌లకు ఆత్మ విశ్వాసం పెరిగేలా షమీ చెలరేగిపోయాడు. బంతితో నిప్పులు చెరిగాడు. బాల్‌ అందుకుంటే వికెట్‌ పక్కా అనేంతలా అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రతీ బంతికి వికెట్‌ తప్పదేమో అని బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టాడు. తొలి నాలుగు మ్యాచుల్లో తుది జట్టులో ఆడే అవకాశమే దక్కని షమీ.. ఒక్కసారి అవకాశం దక్కిన తర్వాత తానేంటో నిరూపించుకున్నాడు.


భార్య పెట్టిన గృహ హింస కేసు, వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు.. కోర్టు సమన్లు... ఆత్మహత్య చేసుకొందామన్న ఆలోచనలు.. రోడ్డు ప్రమాదం.. ఇలా ఒకటా రెండా షమీని సమస్యలు చుట్టుముట్టాయి. అయినా షమీ వెనక్కి తగ్గాడా.... లేదు.. ఇంకా దృఢంగా తయారయ్యాడు. జట్టులో చోటు దొరకకపోయినా కుంగిపోయాడా.. లేదు.. తానేంటో నిరూపించుకోవాలన్న కసితో తీవ్రంగా సాధన చేశాడు. ఇప్పుడు దానికి తగ్గ ఫలాలను అందిస్తున్నాడు. ఈ ప్రపంచకప్‌లో లీగ్‌ దశలో తొలి నాలుగు మ్యాచ్‌లకు షమీని తుది జట్టులోకి తీసుకోలేదు. హార్దిక్‌ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన షమీ తొలి మ్యాచ్‌లోనే పటిష్ఠమైన న్యూజిలాండ్‌ (New Zealand) బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఐదు వికెట్ల ప్రదర్శన చేసి తానేంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌పై 4, శ్రీలంకపై 5, దక్షిణాఫ్రికాపై 2 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో షమీ’ విధ్వంసమే సృష్టించాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి కివీస్‌ పతనాన్ని శాసించాడు. ఏడు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించడంతో.. అతనికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ ఇచ్చారు. భారత బౌలింగ్‌ దళం రారాజుగా నిలిచి తనలో ఎంత కసి ఉందో చాటి చెప్పాడు. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 23 వికెట్లతో ఈసారి టోర్నీలో.. టాప్‌ బౌలర్‌ స్థానానికి దూసుకొచ్చాడు.


భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో షమీ అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో షమీ 7/57 గణాంకాలు నమోదు చేశాడు. వరల్డ్ కప్ చరిత్రలో భారత్ తరఫున ఏడు వికెట్లు తీయడం ఇదే తొలిసారి. ఈ ఘనతతో షమీ తన పేరిట సరికొత్త రికార్డ్‌ని లిఖించుకున్నాడు. ఆశిష్ నెహ్రా 2003 వరల్డ్‌కప్‌లో ఆరు వికెట్లు తీసి, వరల్డ్‌కప్‌లోని సింగిల్ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర నెలకొల్పాడు. ఇప్పుడు షమీ ఏడు వికెట్లు పడగొట్టి.. ఆ చరిత్రను తిరగరాశాడు. న్యూజిలాండ్‌పై సెమీఫైనల్లో ఏడు వికెట్ల హాల్‌తో.. వరల్డ్‌కప్‌లో నాలుగుసార్లు అయిదు వికెట్లు సాధించిన బౌలర్‌గానూ షమీ మరో రికార్డ్‌ని నెలకొల్పాడు.