దక్షిణాఫ్రికా గడ్డపై మూడో మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో కీలక మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది. నిర్ణయాత్మకమైన ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ సమం చేయాలని యువ భారత్‌, ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని సఫారీలు పట్టుదలతో ఉన్నారు. మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవ్వగా... రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. కీలకమైన ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ సమం చేసి ఆత్మవిశ్వాసంతో వన్డే సిరీస్‌కు సిద్ధమవ్వాలని భారత జట్టు భావిస్తోంది. బ్యాటింగ్‌లో ఎలాంటి సమస్యలు లేకున్నా బౌలింగ్‌లో మెరుగ్గా రాణించకపోవడం టీమిండియాను ఆందోళన పరుస్తోంది.

 

గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్లు ఈ మ్యాచ్‌లో ఎలా రాణిస్తారన్న దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. సఫారీ గడ్డపై సఫారీ బ్యాటర్లను నియంత్రించడం అంత తేలికైన విషయం కాదు. రెండో టీ20 మ్యాచ్‌లో పూర్తిగా గతి తప్పిన పేసర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, ముకేశ్‌ గాడిన పడకపోతే భారత బ్యాటర్లు ఎంత లక్ష్యాన్ని నిర్దేశించినా కష్టమే అవుతుంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌ను 4-1తో గెలవడంతో పాటు అయిదో టీ20లో ఆఖరి ఓవర్లో అర్ష్‌దీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అది తప్ప సిరీస్‌ ఆసాంతం అతడు ఆకట్టుకోలేకపోయాడు. టీ20 ప్రపంచకప్‌నకు ముందు టీమ్‌ఇండియాకు నాలుగు టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఉన్న నేపథ్యంలో సెలక్టర్ల దృష్టిలో ఉండాలంటే కూడా మెరుగైన ప్రదర్శన చేయడం అర్ష్‌దీప్‌, ముకేశ్‌లకు అత్యవసరం.

 

రెండో టీ20లో విఫలమైన వైస్‌ కెప్టెన్‌ రవీంద్ర జడేజా ఈసారైనా సత్తా చాటాలని జట్టు కోరుకుంటోంది. అయితే రింకూ సింగ్‌,  కెప్టెన్‌ సూర్యకుమార్‌ రాణిస్తుండడం టీమిండియాకు కలిసి రానుంది. రెండో టీ 20లో  పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగిన ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌ బలంగా పుంజుకుని మెరుపు ఆరంభం ఇవ్వాలని జట్టు ఆశిస్తోంది. రుతురాజ్‌ గైక్వాడ్‌ అనారోగ్యం నుంచి కోలుకుంటే.. గిల్‌ స్థానంలో జట్టులోకి వస్తాడు. శుభ్‌మన్‌ గిల్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌, యశస్వి జైస్వాల్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌వర్మలతో టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ చాలా బలంగా ఉంది. కుల్‌దీప్‌ స్థానంలో రవి బిష్ణోయ్‌ ఆడే అవకాశముంది. రెండో మ్యాచ్‌లో గెలిచి పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉన్న ఆతిథ్య దక్షిణాఫ్రికా రెట్టించిన ఉత్సాహంతో మ్యాచ్‌కు సిద్ధమైంది. పేసర్లు జాన్సన్‌, కొయెట్జీ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేరు. టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవడం కోసం ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడేందుకు జట్టును వీడారు. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, కెప్టెన్ ఐడెన్ మాక్రమ్‌లతో సౌతాఫ్రికా బ్యాటింగ్‌ లైనప్ చాలా బలంగా ఉంది. హార్డ్ హిట్టర్‌ ట్రిస్టన్ స్టబ్స్ విధ్వంసం సృష్టిస్తున్నాడు.

 

టీమిండియా జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.

 

దక్షిణాఫ్రికా జట్టు: ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీట్జ్‌కే, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, డొనొవాన్‌ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, షంసి, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్.