సఫారీ గడ్డపై మూడో టీ 20లో గెలిచి సిరీస్‌ను సమం చేసిన టీమిండియాకు.. టెస్ట్ సిరీస్‌కు ముందు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో సత్తా చాటిన స్టార్ పేసర్ మహ్మద్ షమీ టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. చీలమండల గాయంతో బాధపడుతున్న షమీ... ప్రస్తుతం గాయానికి చికిత్స తీసుకుంటున్నాడు. షమీ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. అదే నిజమైతే దక్షిణాప్రికాతో టెస్ట్ సిరీస్‌కు షమీ దూరం కానున్నాడు. రెండు టెస్టు మ్యాచ్ సిరీస్ కోసం ఎంపికైన భారత ఆటగాళ్లు నేడు దక్షిణాఫ్రికా వెళ్లనున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, హర్షిత్ రాణాలు నేడు దక్షిణాఫ్రికాకు బయలుదేరనున్నారు. వీరితో షమీ వెళ్లటం లేదు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో భారత్ రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ రెండు మ్యాచుల్లో గెలుపొందడం భారత్‌కు చాలా కీలకం.
అయితే.. దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు ఇంత వరకు టెస్టు సిరీస్ గెలవలేదు. ఈ సారి అయిన అందని ద్రాక్షగా ఉన్న సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇలాంటి సమయంలో సూపర్ ఫామ్‌లో ఉన్న షమీ సిరీస్‌కు దూరం అయితే నిజంగానే టీమ్ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే. సఫారీ గడ్డపై తొలి టెస్టు డిసెంబర్ 26 నుంచి 30 వరకు సెంచూరియన్ వేదికగా, రెండో టెస్టు జవనరి 3 నుంచి 7 వరకు కేప్‌టౌన్ వేదికగా జరగనుంది.
భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో షమీ అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో షమీ 7/57 గణాంకాలు నమోదు చేశాడు. వరల్డ్ కప్ చరిత్రలో భారత్ తరఫున ఏడు వికెట్లు తీయడం ఇదే తొలిసారి. ఈ ఘనతతో షమీ తన పేరిట సరికొత్త రికార్డ్‌ని లిఖించుకున్నాడు. ఆశిష్ నెహ్రా 2003 వరల్డ్‌కప్‌లో ఆరు వికెట్లు తీసి, వరల్డ్‌కప్‌లోని సింగిల్ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర నెలకొల్పాడు. ఇప్పుడు షమీ ఏడు వికెట్లు పడగొట్టి.. ఆ చరిత్రను తిరగరాశాడు. న్యూజిలాండ్‌పై సెమీఫైనల్లో ఏడు వికెట్ల హాల్‌తో.. వరల్డ్‌కప్‌లో నాలుగుసార్లు అయిదు వికెట్లు సాధించిన బౌలర్‌గానూ షమీ మరో రికార్డ్‌ని నెలకొల్పాడు.
మరోవైపు భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అర్జున అవార్డు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. వన్డే ప్రపంచకప్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన షమీ పేరును అర్జున అవార్డు కోసం బీసీసీఐ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. క్రీడా మంత్రిత్వ శాఖకు బీసీసీఐ ప్రత్యేక అభ్యర్థన చేసిందని క్రీడా వర్గాలు తెలిపాయి. క్రీడా మంత్రిత్వ శాఖకు మొదటగా పంపిన జాబితాలో మహ్మద్ షమి పేరు లేదు. అలాగే, ‘‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’’ అవార్డుకు పురుషుల బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి పేర్లను సిఫారసు చేశారు. ఈ ఏడాది సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. బ్యాడ్మింటన్ డబుల్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది.