Mohammad Kaif Comments: పాకిస్థాన్ కు హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్ లాంటి ఆటగాళ్లు లేరని.. ఇదే ఈరోజు జరిగే మ్యాచ్ లో ఇరు జట్ల మధ్య తేడాగా మారబోతోందని.. భారత సీనియర్ ఆటగాడు మహ్మద్ కైఫ్ అన్నాడు. మిడిలార్డర్ లో మ్యాచ్ విన్నింగ్ ఆటగాళ్లు లేకపోవడం ఆ జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డాడు. పాండ్య, సూర్యకుమార్ వంటి వారు టీమిండియాకు బలంగా మారతారని తెలిపాడు.


నేడు హై వోల్టేజ్ మ్యాచ్


ఆసియా కప్ సూపర్- 4 లో భాగంగా నేడు భారత్- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. గ్రూప్ దశలో పాక్ పై టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నేడు రెండోసారి దాయాదితో తలపడబోతోంది. దీనిపైనే కైఫ్ ఓ ప్రముఖ క్రీడా ఛానల్ తో మాట్లాడాడు. 


ఆ ఇద్దరూ పడితే కష్టమే


బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ లను త్వరగా ఔట్ చేయగలిగితే పోటీలో భారత్ ముందుంటుందని కైఫ్ అన్నారు. వారికి బలమైన మిడిలార్డర్ లేదని.. ఓపెనర్లు త్వరగా పెవిలియన్ చేరితే ఆ తర్వాత పెద్దగా బ్యాటింగ్ చేసేవారు లేరని అభిప్రాయపడ్డారు. అలానే భారత బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ స్పెల్ కీలకం కానుందని పేర్కొన్నారు. పాక్ తో గ్రూప్ మ్యాచ్ లో భువీ 4 వికెట్లు పడగొట్టాడు. అందులో బాబర్ అజాం వికెట్ కూడా ఉంది. 


బౌలర్లపైనే పాక్ ఆశలు


పాకిస్థాన్ ఆటగాళ్లు ఓల్డ్ స్కూల్ టీ20 క్రికెట్ ఆడుతున్నారని మహ్మద్ కైఫ్ అన్నారు. మొదటి ముగ్గురు బ్యాట్స్ మెన్ పరుగులు చేయకపోతే పాక్ వెనుకంజలో ఉంటుందని అన్నారు. మిడిల్, లోయరార్డర్ లో పేరున్న ఆటగాళ్లు లేరని.. ఇదే వారి విజయావకాశాలకు గండి కొడుతుందని పేర్కొన్నారు. వారు 160 పరుగులు చేసి బౌలర్లు మ్యాచ్ గెలిపించాలని అనుకుంటున్నారని.. ఈ విధానం సరికాదని అన్నారు. ఇప్పటికీ బౌలింగ్ పైనే పాక్ ఎక్కువగా ఆధారపడుతోందని తెలిపారు.


భారత బ్యాటింగ్ లైనప్ సూపర్


సూపర్- 4లో మ్యాచ్ లో భారత్ గెలిచే అవకాశాలే ఎక్కవగా ఉన్నాయని కైఫ్ తెలిపారు. వారికి గొప్ప టాప్ త్రీ బ్యాట్స్ మెన్ ఉన్నారని అన్నారు. రాహుల్ ఎప్పుడైనా గేర్ మార్చొచ్చని అన్నాడు. రోహిత్ పెద్ద ఇన్నింగ్స్ ఆడగలడని.. ఇక కోహ్లీ లయ అందుకున్నాడని.. ఇవి భారత్ కు సానుకూలాంశాలుగా పేర్కొన్నాడు. ఇక తర్వాత వచ్చే సూర్యకుమార్ మ్యాచ్ విన్నరని అన్నాడు. పాండ్యను గేమ్ ఛేంజర్ గా అభివర్ణించాడు. కాబట్టి తన ఫేవరెట్ టీమిండియానే అని స్పష్టంచేశారు.