Josh hazlewood News Updates | మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా టీమ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఓడటంపై మాజీ క్రికెటర్ మిచెల్ జాన్సన్ ఘాటుగా స్పందించాడు. జోష్ హేజిల్‌వుడ్‌ లాంటి ఆటగాళ్ల వల్లే ఆసీస్ ఓడిపోయిందని విమర్శించాడు. జాతీయ జట్టు ఆస్ట్రేలియాకు కీలకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సమయంలో IPLలో RCB జట్టు కోసం ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఆడటంపై జోష్ హేజిల్‌వుడ్‌ను టార్గెట్ చేశాడు.  ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓడిపోయిన మాజీలు భిన్నంగా స్పందిస్తున్నారు.  దక్షిణాఫ్రికా ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి 27 సంవత్సరాల తర్వాత తన రెండవ ICC టైటిల్‌ను సాధించింది. హేజిల్‌వుడ్ తన జాతీయ జట్టు కంటే RCBకి ప్రాధాన్యత ఇచ్చాడని జాన్సన్ విమర్శలు గుప్పించాడు. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్లేఆఫ్‌ల క్వాలిఫైయర్-1లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది, ఆ తర్వాత ఫైనల్‌లో ఇదే జట్టును ఓడించి తన తొలి IPL టైటిల్‌ను ఆర్సీబీ గెలుచుకుంది. జట్టు విజయంలో జోష్ హేజిల్‌వుడ్ కీలకపాత్ర పోషించాడు. ప్లేఆఫ్‌ల కోసం ప్రత్యేకంగా ఆస్ట్రేలియా నుండి తిరిగి హేజిల్2వుడ్ భారత్‌కు తిరిగొచ్చాడు.  

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా IPL 2025 మధ్యలో వారం రోజులపాటు నిలిపివేశారు. మే 17 నుండి ఐపీఎల్ మళ్లీ ప్రారంభమైంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు తిరిగి రావడం కష్టంగా ఉంది. తరువాత వాళ్లు ఇంగ్లాండ్‌లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాల్సి ఉంది. హేజిల్‌వుడ్, పాట్ కమ్మిన్స్ డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టు సభ్యులు, అయితే IPL మిగిలిన మ్యాచ్‌ల కోసం భారతదేశానికి తిరిగి రావాలని హేజిల్ వుడ్ నిర్ణయించుకున్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు తిరిగి వచ్చినా, ప్లేఆఫ్‌లకు ముందు తమ జాతీయ జట్టుకు తిరిగి వెళ్లారు.

మిచెల్ జాన్సన్ ప్రశ్నల వర్షం

మిచెల్ జాన్సన్ మాట్లాడుతూ, "జోష్ హేజిల్‌వుడ్ కొంతకాలంగా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. అతడు జాతీయ జట్టుకు బదులుగా ఐపీఎల్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఇది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం సన్నాహాలపై అనుమానాలు రేకెత్తిస్తోంది. జోష్ హేజిల్‌వుడ్ మొదటి ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు వేసి కేవలం 1 వికెట్ మాత్రమే తీశాడు. ఈ ఇన్నింగ్స్‌లో కమ్మిన్స్ 6 వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లోనూ అతడు ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఈ ఇన్నింగ్స్‌లో హేజిల్‌వుడ్ 19 ఓవర్లలో 58 పరుగులు ఇచ్చాడు.

IPLలో హేజిల్‌వుడ్ ప్రదర్శన గురించి ప్రస్తావించాల్సి వస్తే.. అతను 12 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీసి తొలి ఐపీఎల్ ట్రోఫీ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు.  RCB నుంచి అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్, ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు.

స్టార్క్, కమ్మిన్స్‌పై కూడా విమర్శలు

"మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్, పాట్ కమ్మిన్స్, నాథన్ లియోన్‌లతో కూడిన 'బిగ్ ఫోర్' బౌలింగ్ దాడిని భవిష్యత్తులో బెస్ట్ అని పరిగణించలేము. సీనియర్ ఆటగాళ్లు యాషెస్ తర్వాత రిటైర్మెంట్ వరకు కొనసాగితే, ఇది సరైన విధానమా అనే ప్రశ్న తలెత్తుతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. కొత్త ఆటగాళ్లను ఎంచుకోవడంలో విశ్వాసం చూపించాలి.

"సామ్ కాన్‌స్టాస్, జోష్ ఇంగ్లిస్, స్కాట్ బోలాండ్ వంటి ఆటగాళ్లు భిన్నంగా ఆలోచిస్తారు. వారు 36 ఏళ్లు పైబడినా అవకాశం వచ్చిన ప్రతిసారీ తమను తాము నిరూపించుకోవడానికి ఆసక్తి చూపారు. చాలా సాధించిన పెద్ద వయసు గల ఆటగాళ్లకు ఎన్నటికీ వ్యతిరేకం కాదు. కానీ కొన్ని పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌లో ఇది సరైన అవకాశం కానుందని" మిచెల్ జాన్సన్ అభిప్రాయపడ్డాడు.